నేరుగా దాడులు చేయండి
ఇరాన్ సైన్యానికి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఆదేశాలు
మేము సైతం సిద్ధంగా ఉన్నాం..
ప్రతిస్పందించిన ఇజ్రాయెల్
టెహ్రాన్/బీరుట్: ఒకవైపు గాజాలో మారణకాండ సాగిస్తూ, మరోవైపు హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియేను పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్ దుశ్చర్య పట్ల ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం నేర్పాలన్న కృతనిశ్చయంతో ఆయన ఉన్నారు. హనియే హత్యకు ఇక ప్రతీకారం తీర్చుకోక తప్పదని భావిస్తున్నారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడి చేయాలని ఆయన తమ సైన్యానికి తాజాగా స్పష్టమైన ఆదేశాలిచి్చనట్లు ముగ్గురు ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది.
హనియే హత్యపై ప్రకటన వెలువడగానే బుధవారం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. చాలా అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి సమావేశం నిర్వహిస్తారు. తాజా పరిణామాలపై ఈ భేటీలో ఖమేనీ సమీక్ష నిర్వహించారు. ఇజ్రాయెల్‌పై నేరుగా దాడులకు దిగాలని సైనికాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇజ్రాయెల్‌కు బుద్ధి చెప్పడానికి ఇక ప్రత్యక్ష యుద్ధం తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చారు. ఇదిలా ఉండగా, పూర్తిస్థాయి యుద్ధానికి తాము సైతం సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయెల్ ప్రభుత్వం దౌత్యమార్గాల్లో ఇరాన్‌కు సందేశం చేరవేసినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన ‘చానెల్ 12’ తెలియజేసింది. తమ దేశంపై ఇరాన్ గానీ, దాని మిత్రదేశాలు గానీ దాడులకు దిగితే పూర్తిస్థాయి యుద్ధం మొదలైనట్లేనని ఇజ్రాయెల్ తేలి్చచెప్పినట్లు వివరించింది.
భారీ మూల్యం తప్పదు: నెతన్యాహూ
ఇస్మాయిల్ హనియేను హత్య చేసింది ముమ్మటికీ ఇజ్రాయెల్ సైన్యమేనని ఇరాన్, హమాస్ ఆరోపిస్తున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ ఇంకా నోరువిప్పలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తాజాగా స్పందించారు. తమ దేశం వైపు కన్నెత్తి చూస్తే శత్రువులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తమకు మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని భావిస్తున్నామని ‘అసోసియేటెడ్ ప్రెస్’తో మాట్లాడుతూ చెప్పారు.
ఇస్మాయిల్ హనియేకు ఖమేనీ నివాళులు
ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు విడిచిన హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియేకు, ఆయన అంగరక్షకుడికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ, నూతన అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఘనంగా నివాళుర్పించారు. గురువారం టెహ్రాన్ యూనివర్సిటీలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో హనియే, సెక్యూరిటీ గార్డు శవపేటికల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment