టెహ్రాన్: ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడులపై ఇరాన్ స్పందించింది. దాడులలో తమ ప్రమేయం లేదని.. ఇరాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేని నేరుగా ప్రకటన చేయడం గమనార్హం.
‘‘జియోనిస్ట్ పాలన (ఇజ్రాయెల్) మద్దతుదారులు, దోపిడీ పాలనలోని కొందరు వ్యక్తులు గత రెండు లేదా మూడు రోజులుగా ఈ చర్య వెనుక ఇస్లామిక్ ఇరాన్ ఉందని పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. అవి తప్పు’’ అని మంగళవారం మిలిటరీ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారాయన. అయితే హమాస్ దాడులతో సంబంధం లేదని ఆయన ప్రకటించినప్పటికీ.. పాలస్తీనాకు ఇరాన్ మద్దతు కొనసాగుతుందని ఆయన తెలిపారు.
శనివారం నుంచి హమాస్ బలగాలు ఇజ్రాయెల్ సరిహద్దుగుండా విరుచుకుపడుతున్నాయి. ఈ దాడుల తర్వాత ఇరాన్ స్పందించడం ఇదే తొలిసారి. అయితే.. పాలస్తీనా పోరాటానికి తమ మద్దతు ఉంటుందని, వాళ్ల పోరాట పటిమ అమోఘమని ఖమేని వెల్లడించారు. పాలస్తీనాకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేసిన తప్పిదాల వల్లే ఈ ఘోర పరిస్థితి అని ఖమేని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇది ముమ్మాటికీ ఇజ్రాయెల్ రక్షణ, నిఘా వ్యవస్థ లోపం వల్ల జరిగిన తప్పిదమేనని అన్నారు. మరోవైపు ఇది రాజకీయపరమైన ఆరోపణ అని ఇరాన్ విదేశాంగ శాఖ సోమవారమే ఒక ప్రకటన విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment