బాంబు భయానికి 70 వేల మంది ఖాళీ
తెస్సాలోనికి: గ్రీసులో బయటపడిన రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి బాంబును నిర్వీర్యం చేయడానికి తెస్సాలోనికి అనే పట్టణం నుంచి సుమారు 70 వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించే ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. 250 కిలోలున్న ఈ బాంబును గత వారం రోడ్డు పనుల సందర్భంగా గుర్తించారు. తొలుత 20 అంబులెన్స్ లలో 300 మంది వికలాంగులను, రోగులను తరలించారు.
బాంబు ఉన్న ప్రదేశానికి 1.9 కి.మీ పరిధిలో ఉన్న ప్రజలందరినీ ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల కల్లా తరలించాల్సి ఉంది. గ్రీస్‌లో జన సమ్మర్థ ప్రాంతాల్లో ఇంతకు ముందెప్పుడూ ఇంత పెద్ద బాంబును గుర్తించలేదని, అందుకే ప్రజల తరలింపు తప్పట్లేదని ఓ అధికారి తెలిపారు. బాంబును నిర్వీర్యం చేయడానికి సుమారు 8 గంటలు పట్టొచ్చని మిలిటరీ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆపరేషన్ కోసం వేల సంఖ్యలో పోలీసులను రంగంలోకి దించారు.