దర్జాగా కబ్జా
► మిలిటరీ కాలనీ భూములపై అధికార పార్టీ నేతలు కన్ను
► బోర్లు వేసి ప్రహరీ కట్టిన గార్గేయపురం సర్పంచ్
► అధికారులను ఆశ్రయించిన బాధితుడు
కర్నూలు సీక్యాంప్: రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. 1948లో కర్నూలు నగర శివారులోని నందనపల్లె పంచాయతీ పరిధిలో దాదాపు 72 మంది సైనిక కుటుంబాలకు ఐదు వందల ఎకరాలకు పైగా కేటాయించారు. వాటిని కొందరు అమ్ముకోగా.. మరి కొందరు వారసత్వంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు - విజయవాడ రహదారి పక్కనే ఉన్న ఈ పొలాలను కబ్జా చేసేందుకు అధికార పార్టీ నేతల అండదండలతో కొందరు నాయకులు పావులు కదుపుతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే గద్దల్లా వాలుతున్నారు.
రాత్రికిరాత్రే ఆక్రమించేస్తున్నారు. 673 సర్వేలో దాదాపు మూడు ఎకరాల పొలంపై కన్నేసిన గార్గేయపురం సర్పంచ్ అక్కడ అక్రమంగా బోర్లు వేయించాడు, రక్షణగా గోడను కూడా నిర్మించాడు. మరో వైపు జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యుడిగా కొనసాగుతున్న ఓ వ్యక్తి కూడా ఇక్కడ పొలాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడు. టీడీపీ సీనీయర్ నేత తమ్ముడు అండతోనే రెచ్చిపోతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. బాధితుడు అధికారులను, పోలీసులను ఆశ్రయించగా తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. అయితే అధికార పార్టీనేతలు బాధితులను బెదిరింపులకు పాల్పడుతున్నారు.
చంపుతామని బెదిరిస్తున్నారు
673 సర్వే నంబర్‌లో మాకు మూడు ఎకరాల పొలం ఉంది. ఆ పొలం లో గార్గేయపురం సర్ప ంచ్ అక్రమంగా బోర్లు వేశాడు. రహదారి పక్కనే ఉండటంతో ఆక్రమించేందుకు యత్నించాడు. అధికారులను ఆశ్రయించగా ప్రస్తుతం పనులు నిలిపేశారు. అయితే అప్పటి నుంచి చంపుతామని బెదిరిస్తున్నారు. అధికారులు రక్షణ కల్పించాలి. - రాజు, మిలిటరీ కాలనీ