ఈ క్షణంలోనే జీవించాలి
జెన్‌పథం
అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న వేళ. యుద్ధం తారస్థాయిలో సాగుతోంది. ఆ సమయంలో బ్రిటిష్ నేత విన్‌స్టన్ చర్చిల్ ఓ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఒకరు చర్చిల్‌ని ‘‘ఈ యుద్ధం వల్ల ఏమవుతుందో అని మీకు భయం కలగడం లేదా?’’ అని అడిగారు.‘‘మీరేం అడుగుతున్నారో అర్థం కావడం లేదు’’ అని చర్చిల్ ఎదురుప్రశ్న వేశారు.‘‘ఒకవేళ యుద్ధంలో శత్రుదేశాలు గెలిస్తే ఇంగ్లండ్ పరిస్థితి ఏమవుతుందని ఆలోచించారా? దాని గురించి మీకు ఎలాంటి కలవరపాటూ లేదా?’’ అని అడిగారు ఆ వ్యక్తి.
అందుకు చర్చిల్ ‘‘నాకెందుకు కలవరపాటు? నాకిప్పుడు చాలా పనులున్నాయి. కనుక రేపు ఏమవుతుందో అని దిగులుపడటానికి నాకేదీ సమయం?’’ అన్నారు. చర్చిల్ చెప్పిన ఈ విషయాన్నే, అంతకు చాలా పూర్వం ఎందరో జెన్ గురువులు తమ తమ జీవితాల్లో (ఈ క్షణంలో జీవించడం ప్రధానం అని) నిరూపించారు.
దీనినే కాస్తంత విడమరిచి చూస్తే ఇప్పుడున్న క్షణంలో జీవిస్తే జరిగిపోయిన క్షణాలలో తీసుకున్న నిర్ణయాలు కానీ, పనులకు సంబంధించి కానీ, లేదా జరగబోయే క్షణాలలో మనముందున్న సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడానికిగానీ ఆవగింజంత సమయం కూడా ఉండదు.ఆయన ఓ జెన్ గురువు. ఆయన ఎవరు ఏం చెప్పినా శాంతంగా వినేవారు. కోపగించుకునేవారు కాదు. తిట్టేవారు కాదు. అసలు ఎవరినీ ఏమీ అనేవారు కాదు. ఆయన వాలకం శిష్యులకు ఆశ్చర్యంగా ఉండేది. ఆయన ఎలా నిశ్చింతగా ఉన్నారో పరీక్షించాలనుకున్నారు.
ఆ గురువుగారికి రోజూ మధ్యాహ్నం మూడు గంటలకు టీ తయారు చేసుకుని ఒక కప్పు నిండా పోసుకుని తాపీగా నడుచుకుంటూ వచ్చి వాకిట్లో ఉన్న అరుగుమీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక్కో చుక్క తాగడం అలవాటు.
ఆ రోజు కూడా ఆయన అలాగే టీ తయారు చేసుకుని కప్పు నిండా పోసుకుని వంట గదిలోంచి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతలో ముగ్గురు శిష్యులు తామనుకున్నట్లు ముసుగులు ధరించి ఆయన ముందు దూకి పెద్దగా అరిచారు. అయినా గురువుగారిలో చలనం లేదు. వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ కూర్చునే అరుగు మీదకొచ్చి కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ తాగుతూ ఆనందిస్తున్నారు.
మారు వేషాలు వేసుకున్న శిష్యులు ముసుగులు తీసేసి గురువు దగ్గరకు వచ్చారు. వారిని చూసి ‘‘ఏమిట్రా’’ అని అడిగారు గురువు. ‘‘గురువుగారూ, ఇందాక మీరు భయపడాలని మీ ముందు అకస్మాత్తుగా దూకి వికారంగా అరిచింది మేమే. కానీ మీరు భయపడలేదేంటీ?’’ అని శిష్యులు అడిగారు.
అప్పుడు గురువుగారు ‘‘అలాగా? నేను నా పనిలో ఉండి నా చుట్టూ ఉన్నవేవీ గమనించలేదు. పోనీ ఇప్పుడు టీ తాగేశాను కదా మీ కోసం నేను భయపడి చూపిస్తాను. చూస్తారా నా భయాన్ని...?’’ అని చెప్పేసరికి శిష్యులు నివ్వెరపోయారు.
- యామిజాల జగదీశ్