
మహావీరుడు, ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ ఓ యుద్ధంలో పరాజయాన్ని చవిచూసి సెయింట్ హెలీనా అనే దీవిలో యుద్ధ ఖైదీగా ఉన్న కాలమది. ఆయన ఆరోగ్యాన్ని గమనించడానికి ఓ డాక్టర్ని నియమించారు. ఓరోజు నెపోలియన్, డాక్టరూ కలిసి ఓ బహిరంగ ప్రదేశంలో నడుచుకుంటూ పోతున్నారు.
కాసేపటికి వారిద్దరూ ఓ ఇరుకు మార్గంలోకి చేరుకున్నారు. అప్పుడు ఎదురుగా ఒక సాధారణ మహిళ నడుచుకుంటూ వస్తోంది. పక్కకు తప్పుకుని నెపోలియన్ తనకు దారి ఇస్తారని అనుకుంది ఆ స్త్రీ. కానీ డాక్టర్ ఆమెతో ‘ఇదిగో ఆయన ఎవరనుకున్నావు... నెపోలియన్ చక్రవర్తి. పక్కకు తప్పుకో. ఆయన ముందుకు పోవడానికి నువ్వే పక్కకు తప్పుకోవాలి’ అన్నాడు.
వెంటనే నెపోలియన్ ‘ఇప్పుడు మీతో ఉన్నది నెపోలియన్ చక్రవర్తి కాదు. ఓ మామూలు వ్యక్తి అయిన నెపోలియన్. ఇతరులు పక్కకు తప్పుకుని నాకు దారివ్వాల్సిన స్థితి కాదిప్పుడు నాది. ఓ మామూలు స్త్రీ కైనా నేనే పక్కకు తప్పుకుని దారివ్వక తప్పదు. అలా దారివ్వడం వల్ల నేనేమీ బాధ పడబోన’ని చెప్పాడు.
నెపోలియన్ తన జీవితంలో హెచ్చుతగ్గులను ఒకేలా చూసి పరిస్థితికి తగినట్లే వ్యవహరించిన వ్యక్తి. ‘ఎప్పుడూ గెలుపు నా పక్షమే అని అనుకోను. ఓటమిని చవిచూడడం నాకు తెలుసు. గెలుపోటములను ఒకేలా చూసిన వ్యక్తిని నేను’ అని చెప్పాడు. ఈ మానసిక పరిపక్వత కలవారిని స్థితప్రజ్ఞుడిగా భగవద్గీత చెప్పనే చెప్పింది.
విజయం సాధించినప్పుడు విర్రవీగలేదు. పరాభవం పొందినప్పుడు డీలా పడలేదు. రెండిటినీ సమానంగా చూశాడు. స్వీకరించాడు. ఈ మానసిక పరిపక్వత వల్ల జీవితంలో దేన్నయినా అధిగమించవచ్చు. అది మనిషిని దెబ్బతీయదు. పైపెచ్చు ఎప్పుడూ నిలకడగా ఉంచుతుంది. – యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment