Yamijala Jagdish
-
సాయపు చేతులు..!
యమదూతలు ఓ మనిషిని తీసుకొచ్చి యమలోకాన యమ ధర్మరాజు ఎదుట నిలబెట్టారు. ఆ మనిషి ఎంతో దిగాలు ముఖం వేసుకుని నిల్చున్నాడు. పక్కనే చిత్రగుప్తుడు ఆ మనిషి ఖాతాను తరచి చూస్తున్నాడు. అతను ఏం తప్పు చేశాడని యమధర్మరాజు అడిగాడు. చిత్రగుప్తుడు అదే పనిగా అతని గురించి నమోదు చేసిన పేజీలను చదువుతుంటే తలతిరుగుతోంది. అంతా విన్నాడు యమధర్మరాజు.‘అతనిని నరకలోకంలో పడేయండి’ అన్నాడు యముడు. వెంటనే చిత్రగుప్తుడు అడ్డు తగిలి ఇలా అన్నాడు: ‘అతను అన్ని పాపాలు చేసిన ప్పటికీ ఒకే ఒక్క పుణ్యం చేశాడు. ఓరోజు ఓ వృద్ధురాలు గుడికి వెళ్ళడా నికి దారి అడిగితే చూపుడు వేలుతో దారి చెప్పడమే కాకుండా ఆమె చేయి పట్టుకుని వెళ్ళి దిగబెట్టాడు’. ఆ మాటతో యముడు తన తీర్పుని అప్పటికప్పుడు మార్చు కున్నాడు. ‘అతని చేతికి గంధం పూసి ముందుగా స్వర్గానికి తీసుకుపోండి. అనంతరం అతనిని నరకానికి తరలించవచ్చు’ అని ఆదేశించాడు.కర్ణుడు వంటి పుణ్యాత్మునికీ మరణానంతరం ఓ సమస్య ఎదురయ్యింది. ఆయన మహాదాత. అయితే ఆయన ధన రాశులను, వస్తువులనే ఇచ్చాడు. ఆకలిగొన్నవారి ఆకలి తీర్చిన చరిత్ర ఆయనకు లేదు. నిర్యాణానంతరం కర్ణుడు స్వర్గానికే వెళ్లాడు. స్వర్గానికి వెళ్ళే వారికి ఆకలి అనేది ఉండదు. కానీ కర్ణుడికి ఆకలి వేసింది. ఓమారు కర్ణుడు ‘నాకు మాత్రమే ఎందుకు ఆకలి వేస్తోంది’ అని స్వర్గ లోక ద్వార పాలకుని అడిగాడు. అప్పుడతను ‘నువ్వు భూలోకంలో ఎవరికీ అన్నదానం చేయలేదు. అందుకే నీకు ఆకలి వేస్తోంద’ని చెప్పాడు. ‘మరిప్పుడు ఏం చేయాలి. ఆకలి ఎక్కువై భరించలేకపోతు న్నాను’ అన్నాడు కర్ణుడు. వెంటనే ద్వారపాలకుడు ‘కర్ణా, నీ చూపుడు వేలుని నోట పెట్టుకో. ఆకలి తగ్గిపోతుంది’ అన్నాడు. కర్ణుడు అలాగే చేశాడు. ఆకలి పోయింది. ఇందుకు కారణమేమిటి?ఓసారి కృష్ణుడి సన్నిహితులకు కర్ణుడు అన్నం తినడానికి ఓ చోటును తన చూపుడు వేలుతో చూపించాడట. అది కాస్తా ఓ పుణ్య కార్యంగా కర్ణుడి ఖాతాలో జమైంది. పురాణాలు, ఇతిహాసాలలో పేర్కొన్న ఇటువంటి కథలను నమ్మవచ్చా, అసలు స్వర్గ–నరకాలు ఉన్నాయా అంటూ చర్చోప చర్చలు ఇక్కడ అనవసరం. మనిషిగా పుట్టినవాడు సాటి మనిషికి సాయం చేయడం అతడి కనీస ధర్మం అని తెలియచేయడానికి ఇటువంటి కథలు వాహకాలుగా నిలుస్తాయి. మానవ విలువలను ప్రోది చేసే భారతీయ తత్త్వం సర్వదా ఆచరణీయం. – యామిజాల జగదీశ్ -
స్థితప్రజ్ఞత: నెపోలియన్ ఓ యుద్ధంలో పరాజయాన్ని చవిచూసి..
మహావీరుడు, ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ ఓ యుద్ధంలో పరాజయాన్ని చవిచూసి సెయింట్ హెలీనా అనే దీవిలో యుద్ధ ఖైదీగా ఉన్న కాలమది. ఆయన ఆరోగ్యాన్ని గమనించడానికి ఓ డాక్టర్ని నియమించారు. ఓరోజు నెపోలియన్, డాక్టరూ కలిసి ఓ బహిరంగ ప్రదేశంలో నడుచుకుంటూ పోతున్నారు.కాసేపటికి వారిద్దరూ ఓ ఇరుకు మార్గంలోకి చేరుకున్నారు. అప్పుడు ఎదురుగా ఒక సాధారణ మహిళ నడుచుకుంటూ వస్తోంది. పక్కకు తప్పుకుని నెపోలియన్ తనకు దారి ఇస్తారని అనుకుంది ఆ స్త్రీ. కానీ డాక్టర్ ఆమెతో ‘ఇదిగో ఆయన ఎవరనుకున్నావు... నెపోలియన్ చక్రవర్తి. పక్కకు తప్పుకో. ఆయన ముందుకు పోవడానికి నువ్వే పక్కకు తప్పుకోవాలి’ అన్నాడు.వెంటనే నెపోలియన్ ‘ఇప్పుడు మీతో ఉన్నది నెపోలియన్ చక్రవర్తి కాదు. ఓ మామూలు వ్యక్తి అయిన నెపోలియన్. ఇతరులు పక్కకు తప్పుకుని నాకు దారివ్వాల్సిన స్థితి కాదిప్పుడు నాది. ఓ మామూలు స్త్రీ కైనా నేనే పక్కకు తప్పుకుని దారివ్వక తప్పదు. అలా దారివ్వడం వల్ల నేనేమీ బాధ పడబోన’ని చెప్పాడు.నెపోలియన్ తన జీవితంలో హెచ్చుతగ్గులను ఒకేలా చూసి పరిస్థితికి తగినట్లే వ్యవహరించిన వ్యక్తి. ‘ఎప్పుడూ గెలుపు నా పక్షమే అని అనుకోను. ఓటమిని చవిచూడడం నాకు తెలుసు. గెలుపోటములను ఒకేలా చూసిన వ్యక్తిని నేను’ అని చెప్పాడు. ఈ మానసిక పరిపక్వత కలవారిని స్థితప్రజ్ఞుడిగా భగవద్గీత చెప్పనే చెప్పింది.విజయం సాధించినప్పుడు విర్రవీగలేదు. పరాభవం పొందినప్పుడు డీలా పడలేదు. రెండిటినీ సమానంగా చూశాడు. స్వీకరించాడు. ఈ మానసిక పరిపక్వత వల్ల జీవితంలో దేన్నయినా అధిగమించవచ్చు. అది మనిషిని దెబ్బతీయదు. పైపెచ్చు ఎప్పుడూ నిలకడగా ఉంచుతుంది. – యామిజాల జగదీశ్ -
దేవుని సేవకు ఇదోమార్గం..
భక్తి ఎక్కువైతే కొందరు ఊహాతీతంగా ప్రవర్తిస్తారు. వరగుణ పాండ్యన్ అనే రాజు ప్రవర్తన ఇందుకు మంచి ఉదాహరణ. తిరవిడై మరుదూర్ అనే ఊళ్లో ఆలయానికి కావలసిన నూనెను తీయడం కోసం ఒక రోజు నువ్వులు ఆరబెట్టారు. ఆ సమయంలో అటువైపుగా ఓ శివభక్తుడు వచ్చి ఓ పిడికెడు నువ్వులు తీసుకుని నోట్లో వేసుకున్నాడు.దేవుడి కోసం ఉపయోగించాలని ఎండబెట్టిన నువ్వుల్ని ఇలా నోట్లో వేసుకోవచ్చా? అది తప్పు కదా? అపచారం కదూ! అక్కడ కాపలా ఉన్నవారు ఇది చూశారు. ‘అయ్యో... అపచారం అపచారం’ అంటూ పరుగున వచ్చి అతనిని పట్టుకుని తీసుకుపోయి రాజు వరగుణ పాండ్యన్ ఎదుట హాజరుపరచారు.వరగుణ పాండ్యన్ అతని వంక తీక్షణంగా చూశాడు. నుదుట బొట్టుతో పరమ శివభక్తునిలా కనిపించిన అతడిని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ఈయన ఇలా చేయడమేమిటీ అని అనుకున్న రాజు నమ్మలేకపోతున్నాడు.‘నువ్విలా చేయడమేమిటీ?’ అని అడిగాడు. దానికి ఆ భక్తుడు ఇలా చెప్పాడు... ‘నేను ఆకలి వల్ల అలా చేశాను. ఈ ఊరు నాకు ఎంతో నచ్చింది. శివాపచారం చేస్తే ఏడు జన్మలకు ఈ ఆలయానికి గానుగ ఆడించే ఎద్దుగా పుడతారన్న విషయం తెలుసు. అందుకే అలా చేశాను’ అన్నాడు. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి నూనెను తీసేవారు. పుడితే ఈ ఊళ్ళో పుట్టాలి. అదీనూ గానుVýæ ఆడించే ఎద్దుగా. ఆ ఆలయంలో సేవ చేయాలి. ఒక తప్పు చేస్తే ఆ అవకాశం దక్కుతుందని తెలిసి ఆ భక్తుడు అలా చేశాడు.రాజు వరగుణ పాండ్యన్ భక్తుణ్ణి నోరు తెరవమన్నారు. శివభక్తుడు నోరు తెరిచాడు. అతని నోటిని రాజు చీలుస్తాడని అక్కడున్న వారందరూ అనుకున్నారు. కానీ రాజు భక్తుని నోటిలో అంటుకుని ఉన్న నువ్వుల్ని తీసి తన నోట్లో వేసుకున్నాడు. ‘మీరు చేసిన అపచారాన్ని నేనూ చేశాను. మీతో కలిసి నేనూ గానుగ ఆడించే ఎద్దుగా పుడతాను’ అన్నాడు రాజు. ఇలా ఉంటుంది అపరిమత భక్తిగలవారి ప్రవర్తన. ప్రవర్తనలోని తప్పొప్పుల కన్నా వారి భావన ప్రధానమని గ్రహించాలి. – యామిజాల జగదీశ్ -
అతీతులు కారెవరూ!
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలమది. బ్రిటీష్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్. రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. చర్చిల్ తన ఇంటి నుంచి రేడియో స్టేషన్ కి వెళ్ళవలసి ఉంది. అయితే ఎప్పుడూ సవ్యంగా నడిచే ఆయన కారు కాస్తా ఆ రోజు మరమ్మతుకు గురైంది. బయలుదేరే సమయానికి అది నడవలేదు. దాంతో ఆయన ఆలస్యం చేయకుండా ఓ అద్దె టాక్సీ మాట్లాడుకున్నారు. అయితే తన టాక్సీలో ప్రధాని చర్చిల్ వస్తున్నారన్న విషయం ఆ వాహన డ్రైవరుకి తెలీదు. కారణం, ఆ డ్రైవర్ అంతకుముందు చర్చిల్ని చూసింది లేదు. కనుక ఆయన చర్చిల్ ని గుర్తుపట్టలేదు. చర్చిల్ కారెక్కి కూర్చున్నారు. కారు బయలుదేరింది. దారి మధ్యలో చర్చిల్ డ్రైవరుతో ‘‘ఇదిగో ఓ పదిహేను నిముషాలు వెయిట్ చేస్తే మళ్ళీ నీ టాక్సీలో ఇంటికి చేరుకుంటాను’’ అన్నారు. అయితే డ్రైవర్ ఏమన్నాడంటే... ‘‘క్షమించండి...అది కుదరదండి ఈరోజు రేడియోలో చర్చిల్ గారు మాట్లాడబోతున్నారు. ఆ మాటలు నేను వినాలి’’ అన్నాడు. చర్చిల్కి ఆ మాట ఆశ్చర్యం వేసింది. తన ప్రసంగాన్ని వినడానికి డ్రైవర్ కూడా ఆసక్తి చూపుతున్నాడుగా....నా మీద ఎంతటి ప్రేమాభిమానాలున్నాయో ఈ డ్రైవరుకి...అనుకుని మనసులో సంతోషించారు. టాక్సీ రేడియో స్టేషన్ కి చేరుకుంది. రేడియో స్టేషన్ దగ్గర ఓ మూలగా కారు ఆపించి చర్చిల్ కిందకు దిగారు. టాక్సి డ్రైవర్ వాహనాన్ని ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అయితే చర్చిల్ మళ్ళీ డ్రైవర్ని అడిగాడు... ‘‘మరో అయిదు పౌండ్లు అదనంగా ఇస్తాను. కారుని ఆపకూడదు...పదిహేను నిముషాలు నిరీక్షించావంటే ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీ కారులో ఇంటికి చేరుకుంటాను’’ అన్నారు. అప్పుడు డ్రైవరు ‘‘పరవాలేదు సార్. చర్చిల్ ప్రసంగం ఈరోజు కాకపోతే ఇంకోరోజు వింటాను. మీరు అయిదు పౌండ్లు ఎక్కువగా ఇస్తానంటే పదిహేను నిముషాలేంటి సార్ ముప్పై నిముషాలు ఆగుతాను...’’ అన్నాడు. కాస్సేపటిముందు వరకూ డ్రైవర్ మీదున్న అభిప్రాయం, ఆశ్చర్యం కాస్తా గాలికి కొట్టుకుపోయాయి. నా ప్రసంగానికి ఇచ్చే విలువ కన్నా డబ్బుకు డ్రైవర్ ఇస్తున్న విలువను తలచి బాధపడ్డారు చర్చిల్. అందుకే అంటారేమో డబ్బుకు లోకం దాసోహమని. – యామిజాల జగదీశ్ -
దేని విలువ దానిదే
ఆయన ఓ సాధువు. ఓ సముద్రతీరాన ఆయన కూర్చుని చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు అక్కడికి ఓ రైతు వచ్చాడు. సాధువుకు నమస్కరించి ‘‘అయ్యా, నాకో మంచి మాట చెప్పండి‘‘ అన్నాడు. ‘‘నీ సమస్యేంటీ.. నీకు నేనేం చెప్పాలి‘‘ అని అడిగారు సాధువు. రైతు కాస్తంత ఆలోచించి ‘‘నాకు చాలా మంది మిత్రులున్నారు. వారిలో తొంబై శాతం మందికి ఎకరాలకు ఎకరాల భూమి ఉంది. అందరూ నాకన్నా ధనవంతులే. కానీ నేను ఓ పేదరైతును. నాకు ఓ అర ఎకరం భూమి మాత్రమే ఉంది. మిత్రులందరి మధ్య నేను అతి సామాన్యుడిలా అనిపిస్తుంటుంది. వారందరూ ఎంతో ఎత్తున ఉంటే నేనేమో నేల మీద ఉన్నట్టే అనిపిస్తుంది. ఇలా అనిపించేటప్పుడల్లా నేనెంతో నలిగిపోతాను’’ అని. సాధువు తనకు అసలు విషయం అర్థమైనట్టుగా అతని వంక చూశారు. ‘‘ఇదిగో నా పక్కన కూర్చో...’’ అన్నారు సాధువు. ‘‘పరవాలేదు స్వామీ, నేనిలానే నిల్చుంటాను’’ అన్నాడు రైతు.‘‘అరెరె, ఏం పరవాలేదు. కూర్చో నాయనా’’ అని సాధువు చెప్పడంతోనే రైతు సరేనని ఆయన పక్కన కూర్చున్నారు. ‘‘చూశావా, మనిద్దరం ఓ బండరాతిపైన కూర్చున్నాం కదూ....’’ అన్నారు సాధువు. ‘‘అవును’’ అన్నాడు రైతు. ‘‘చూశావా, మన చుట్టుపక్కల బోలెడన్ని చిన్నరాళ్ళు ఉన్నాయి. అలాగే సముద్ర తీరాన ఇసుక చూడు. అలలు తీరానికి వచ్చి పదే పదే తడుపుతుంటాయి ఇసుకను. ఇసుకను దాటి చూస్తే మన కంటికి కనిపించే దూరం వరకూ సముద్రముంది కదూ...’’ అని అన్నారు సాధువు. ‘‘అవును స్వామీ. మీరన్నట్టే సముద్ర జలాలు కంటికి కనిపిస్తున్నాయి. అలాగే మన చుట్టూ గులకరాళ్ళూ, గవ్వలూ, ఇసుక రేణువులు... ఇలా ఎన్నో కనిపిస్తున్నాయి’’ అన్నాడు రైతు. ‘‘దీనిని బట్టి మనం తెలుసుకోవలసిందేంటీ... మనముంటున్న ప్రపంచంలో నానా రకాలూ ఉంటాయి. దేవుడి సృష్టి ఆశ్చర్యకరం. ఉపయోగపడనివంటూ ఉండవు. ప్రతిదానికీ ఏదో ఒక ప్రయోజనం ఉంటూనే ఉంటుంది. అంతమాత్రాన ప్రకృతిలో ఉన్న చిన్నచిన్నవన్నీ బాధపడుతున్నాయా... లేదుగా .. కనుక ఉన్నంతలో సర్దుకుపోవడం ప్రధానం. అటువంటి వారే హాయిగా జీవించగలరు’’ అని చెప్పారు సాధువు. – యామిజాల జగదీశ్ -
కనీస సంస్కారం
ప్రముఖ రచయిత బెర్నార్డ్ షా ఓరోజు పాత పుస్తకాల దుకాణానికి వెళ్ళారు. అక్కడున్న పుస్తకాలను తరచిచూస్తున్నారు. అలా చూస్తున్నప్పుడు ఆయనకు తాను రాసిన ఓ పుస్తకం కంటపడింది. అది తీసి మొదటి పేజీ చూశారు. చూసి ఖంగుతిన్నారు. ఆయన తనకెంతో ఇష్టమైన మిత్రుడికి సంతకం చేసి ఇచ్చిన పుస్తకమది. వెంటనే బెర్నార్డ్ షా ఆ పుస్తకాన్ని ఏ మాత్రం బేరం చేయకుండా కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్ళీ వెళ్ళడంతోనే ఆ పుస్తకాన్ని తన మిత్రుడికే సంతకం చేసి ‘మళ్ళీ నీకు నా కానుకగా ఇస్తున్నాను’ అనే మాటలు రాసి పంపారు. ఆ పుస్తకాన్ని అందుకున్న మిత్రుడు ఎలా ఫీలయ్యాడో మనం ఊహించి ఉండొచ్చు. దాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బెర్నార్డ్ షా తిరిగి ఆ పుస్తకాన్ని ఆ మిత్రుడికే పంపడంలో ఓ ఉద్దేశం లేకపోలేదు. తాను రాసిన పుస్తకంలోని విషయ ప్రాధాన్యాన్ని మిత్రుడికి తెలియజెప్పడం బెర్నార్డ్ షా ఉద్దేశం కావచ్చు. కానీ అంతకన్నా మరో ముఖ్యవిషయం కూడా అందులో దాగి ఉంది. అదేంటో తెలుసా... ఎవరైనా సరే తమ ప్రేమకు అభిమానానికి గుర్తుగా దేన్నయినా కానుకగా ఇస్తున్నప్పుడు దానిని స్వీకరించి మూలనపడేయడం కాదు. దానిని ప్రాణప్రదంగా చూసుకోవడం ప్రధానం. అలా చేయడం వల్ల ఒకరు తనకు ప్రేమతో ఇచ్చిన దానికి తగిన గౌరవం ఇచ్చినట్లవుతుంది. మనల్ని గౌరవించిన వారిని ఆదరించిన వారిని ప్రేమించిన వారిని అంతే అభిమానంతో చూడడం సంస్కారమనిపించుకుంటుంది. – యామిజాల జగదీశ్ -
ఈ క్షణంలోనే జీవించాలి
జెన్పథం అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న వేళ. యుద్ధం తారస్థాయిలో సాగుతోంది. ఆ సమయంలో బ్రిటిష్ నేత విన్స్టన్ చర్చిల్ ఓ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఒకరు చర్చిల్ని ‘‘ఈ యుద్ధం వల్ల ఏమవుతుందో అని మీకు భయం కలగడం లేదా?’’ అని అడిగారు.‘‘మీరేం అడుగుతున్నారో అర్థం కావడం లేదు’’ అని చర్చిల్ ఎదురుప్రశ్న వేశారు.‘‘ఒకవేళ యుద్ధంలో శత్రుదేశాలు గెలిస్తే ఇంగ్లండ్ పరిస్థితి ఏమవుతుందని ఆలోచించారా? దాని గురించి మీకు ఎలాంటి కలవరపాటూ లేదా?’’ అని అడిగారు ఆ వ్యక్తి. అందుకు చర్చిల్ ‘‘నాకెందుకు కలవరపాటు? నాకిప్పుడు చాలా పనులున్నాయి. కనుక రేపు ఏమవుతుందో అని దిగులుపడటానికి నాకేదీ సమయం?’’ అన్నారు. చర్చిల్ చెప్పిన ఈ విషయాన్నే, అంతకు చాలా పూర్వం ఎందరో జెన్ గురువులు తమ తమ జీవితాల్లో (ఈ క్షణంలో జీవించడం ప్రధానం అని) నిరూపించారు. దీనినే కాస్తంత విడమరిచి చూస్తే ఇప్పుడున్న క్షణంలో జీవిస్తే జరిగిపోయిన క్షణాలలో తీసుకున్న నిర్ణయాలు కానీ, పనులకు సంబంధించి కానీ, లేదా జరగబోయే క్షణాలలో మనముందున్న సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించడానికిగానీ ఆవగింజంత సమయం కూడా ఉండదు.ఆయన ఓ జెన్ గురువు. ఆయన ఎవరు ఏం చెప్పినా శాంతంగా వినేవారు. కోపగించుకునేవారు కాదు. తిట్టేవారు కాదు. అసలు ఎవరినీ ఏమీ అనేవారు కాదు. ఆయన వాలకం శిష్యులకు ఆశ్చర్యంగా ఉండేది. ఆయన ఎలా నిశ్చింతగా ఉన్నారో పరీక్షించాలనుకున్నారు. ఆ గురువుగారికి రోజూ మధ్యాహ్నం మూడు గంటలకు టీ తయారు చేసుకుని ఒక కప్పు నిండా పోసుకుని తాపీగా నడుచుకుంటూ వచ్చి వాకిట్లో ఉన్న అరుగుమీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక్కో చుక్క తాగడం అలవాటు. ఆ రోజు కూడా ఆయన అలాగే టీ తయారు చేసుకుని కప్పు నిండా పోసుకుని వంట గదిలోంచి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇంతలో ముగ్గురు శిష్యులు తామనుకున్నట్లు ముసుగులు ధరించి ఆయన ముందు దూకి పెద్దగా అరిచారు. అయినా గురువుగారిలో చలనం లేదు. వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఎప్పుడూ కూర్చునే అరుగు మీదకొచ్చి కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ టీ తాగుతూ ఆనందిస్తున్నారు. మారు వేషాలు వేసుకున్న శిష్యులు ముసుగులు తీసేసి గురువు దగ్గరకు వచ్చారు. వారిని చూసి ‘‘ఏమిట్రా’’ అని అడిగారు గురువు. ‘‘గురువుగారూ, ఇందాక మీరు భయపడాలని మీ ముందు అకస్మాత్తుగా దూకి వికారంగా అరిచింది మేమే. కానీ మీరు భయపడలేదేంటీ?’’ అని శిష్యులు అడిగారు. అప్పుడు గురువుగారు ‘‘అలాగా? నేను నా పనిలో ఉండి నా చుట్టూ ఉన్నవేవీ గమనించలేదు. పోనీ ఇప్పుడు టీ తాగేశాను కదా మీ కోసం నేను భయపడి చూపిస్తాను. చూస్తారా నా భయాన్ని...?’’ అని చెప్పేసరికి శిష్యులు నివ్వెరపోయారు. - యామిజాల జగదీశ్