ఆయన ఓ సాధువు. ఓ సముద్రతీరాన ఆయన కూర్చుని చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు అక్కడికి ఓ రైతు వచ్చాడు. సాధువుకు నమస్కరించి ‘‘అయ్యా, నాకో మంచి మాట చెప్పండి‘‘ అన్నాడు. ‘‘నీ సమస్యేంటీ.. నీకు నేనేం చెప్పాలి‘‘ అని అడిగారు సాధువు. రైతు కాస్తంత ఆలోచించి ‘‘నాకు చాలా మంది మిత్రులున్నారు. వారిలో తొంబై శాతం మందికి ఎకరాలకు ఎకరాల భూమి ఉంది. అందరూ నాకన్నా ధనవంతులే. కానీ నేను ఓ పేదరైతును. నాకు ఓ అర ఎకరం భూమి మాత్రమే ఉంది. మిత్రులందరి మధ్య నేను అతి సామాన్యుడిలా అనిపిస్తుంటుంది. వారందరూ ఎంతో ఎత్తున ఉంటే నేనేమో నేల మీద ఉన్నట్టే అనిపిస్తుంది. ఇలా అనిపించేటప్పుడల్లా నేనెంతో నలిగిపోతాను’’ అని. సాధువు తనకు అసలు విషయం అర్థమైనట్టుగా అతని వంక చూశారు.
‘‘ఇదిగో నా పక్కన కూర్చో...’’ అన్నారు సాధువు. ‘‘పరవాలేదు స్వామీ, నేనిలానే నిల్చుంటాను’’ అన్నాడు రైతు.‘‘అరెరె, ఏం పరవాలేదు. కూర్చో నాయనా’’ అని సాధువు చెప్పడంతోనే రైతు సరేనని ఆయన పక్కన కూర్చున్నారు. ‘‘చూశావా, మనిద్దరం ఓ బండరాతిపైన కూర్చున్నాం కదూ....’’ అన్నారు సాధువు. ‘‘అవును’’ అన్నాడు రైతు. ‘‘చూశావా, మన చుట్టుపక్కల బోలెడన్ని చిన్నరాళ్ళు ఉన్నాయి. అలాగే సముద్ర తీరాన ఇసుక చూడు. అలలు తీరానికి వచ్చి పదే పదే తడుపుతుంటాయి ఇసుకను. ఇసుకను దాటి చూస్తే మన కంటికి కనిపించే దూరం వరకూ సముద్రముంది కదూ...’’ అని అన్నారు సాధువు. ‘‘అవును స్వామీ. మీరన్నట్టే సముద్ర జలాలు కంటికి కనిపిస్తున్నాయి.
అలాగే మన చుట్టూ గులకరాళ్ళూ, గవ్వలూ, ఇసుక రేణువులు... ఇలా ఎన్నో కనిపిస్తున్నాయి’’ అన్నాడు రైతు. ‘‘దీనిని బట్టి మనం తెలుసుకోవలసిందేంటీ... మనముంటున్న ప్రపంచంలో నానా రకాలూ ఉంటాయి. దేవుడి సృష్టి ఆశ్చర్యకరం. ఉపయోగపడనివంటూ ఉండవు. ప్రతిదానికీ ఏదో ఒక ప్రయోజనం ఉంటూనే ఉంటుంది. అంతమాత్రాన ప్రకృతిలో ఉన్న చిన్నచిన్నవన్నీ బాధపడుతున్నాయా... లేదుగా .. కనుక ఉన్నంతలో సర్దుకుపోవడం ప్రధానం. అటువంటి వారే హాయిగా జీవించగలరు’’ అని చెప్పారు సాధువు.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment