కనీస సంస్కారం
ప్రముఖ రచయిత బెర్నార్డ్ షా ఓరోజు పాత పుస్తకాల దుకాణానికి వెళ్ళారు. అక్కడున్న పుస్తకాలను తరచిచూస్తున్నారు. అలా చూస్తున్నప్పుడు ఆయనకు తాను రాసిన ఓ పుస్తకం కంటపడింది. అది తీసి మొదటి పేజీ చూశారు. చూసి ఖంగుతిన్నారు. ఆయన తనకెంతో ఇష్టమైన మిత్రుడికి సంతకం చేసి ఇచ్చిన పుస్తకమది.
వెంటనే బెర్నార్డ్ షా ఆ పుస్తకాన్ని ఏ మాత్రం బేరం చేయకుండా కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్ళీ వెళ్ళడంతోనే ఆ పుస్తకాన్ని తన మిత్రుడికే సంతకం చేసి ‘మళ్ళీ నీకు నా కానుకగా ఇస్తున్నాను’ అనే మాటలు రాసి పంపారు. ఆ పుస్తకాన్ని అందుకున్న మిత్రుడు ఎలా ఫీలయ్యాడో మనం ఊహించి ఉండొచ్చు. దాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బెర్నార్డ్ షా తిరిగి ఆ పుస్తకాన్ని ఆ మిత్రుడికే పంపడంలో ఓ ఉద్దేశం లేకపోలేదు.
తాను రాసిన పుస్తకంలోని విషయ ప్రాధాన్యాన్ని మిత్రుడికి తెలియజెప్పడం బెర్నార్డ్ షా ఉద్దేశం కావచ్చు. కానీ అంతకన్నా మరో ముఖ్యవిషయం కూడా అందులో దాగి ఉంది. అదేంటో తెలుసా... ఎవరైనా సరే తమ ప్రేమకు అభిమానానికి గుర్తుగా దేన్నయినా కానుకగా ఇస్తున్నప్పుడు దానిని స్వీకరించి మూలనపడేయడం కాదు. దానిని ప్రాణప్రదంగా చూసుకోవడం ప్రధానం. అలా చేయడం వల్ల ఒకరు తనకు ప్రేమతో ఇచ్చిన దానికి తగిన గౌరవం ఇచ్చినట్లవుతుంది. మనల్ని గౌరవించిన వారిని ఆదరించిన వారిని ప్రేమించిన వారిని అంతే అభిమానంతో చూడడం సంస్కారమనిపించుకుంటుంది.
– యామిజాల జగదీశ్