రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలమది. బ్రిటీష్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్. రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. చర్చిల్ తన ఇంటి నుంచి రేడియో స్టేషన్ కి వెళ్ళవలసి ఉంది. అయితే ఎప్పుడూ సవ్యంగా నడిచే ఆయన కారు కాస్తా ఆ రోజు మరమ్మతుకు గురైంది. బయలుదేరే సమయానికి అది నడవలేదు. దాంతో ఆయన ఆలస్యం చేయకుండా ఓ అద్దె టాక్సీ మాట్లాడుకున్నారు. అయితే తన టాక్సీలో ప్రధాని చర్చిల్ వస్తున్నారన్న విషయం ఆ వాహన డ్రైవరుకి తెలీదు. కారణం, ఆ డ్రైవర్ అంతకుముందు చర్చిల్‌ని చూసింది లేదు. కనుక ఆయన చర్చిల్ ని గుర్తుపట్టలేదు. చర్చిల్ కారెక్కి కూర్చున్నారు. కారు బయలుదేరింది.
దారి మధ్యలో చర్చిల్ డ్రైవరుతో ‘‘ఇదిగో ఓ పదిహేను నిముషాలు వెయిట్ చేస్తే మళ్ళీ నీ టాక్సీలో ఇంటికి చేరుకుంటాను’’ అన్నారు. అయితే డ్రైవర్ ఏమన్నాడంటే... ‘‘క్షమించండి...అది కుదరదండి ఈరోజు రేడియోలో చర్చిల్ గారు మాట్లాడబోతున్నారు. ఆ మాటలు నేను వినాలి’’ అన్నాడు. చర్చిల్‌కి ఆ మాట ఆశ్చర్యం వేసింది. తన ప్రసంగాన్ని వినడానికి డ్రైవర్ కూడా ఆసక్తి చూపుతున్నాడుగా....నా మీద ఎంతటి ప్రేమాభిమానాలున్నాయో ఈ డ్రైవరుకి...అనుకుని మనసులో సంతోషించారు. టాక్సీ రేడియో స్టేషన్ కి చేరుకుంది. రేడియో స్టేషన్ దగ్గర ఓ మూలగా కారు ఆపించి చర్చిల్ కిందకు దిగారు. టాక్సి డ్రైవర్ వాహనాన్ని ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు.
అయితే చర్చిల్ మళ్ళీ డ్రైవర్‌ని అడిగాడు... ‘‘మరో అయిదు పౌండ్లు అదనంగా ఇస్తాను. కారుని ఆపకూడదు...పదిహేను నిముషాలు నిరీక్షించావంటే ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీ కారులో ఇంటికి చేరుకుంటాను’’ అన్నారు. అప్పుడు డ్రైవరు ‘‘పరవాలేదు సార్. చర్చిల్ ప్రసంగం ఈరోజు కాకపోతే ఇంకోరోజు వింటాను. మీరు అయిదు పౌండ్లు ఎక్కువగా ఇస్తానంటే పదిహేను నిముషాలేంటి సార్ ముప్పై నిముషాలు ఆగుతాను...’’ అన్నాడు. కాస్సేపటిముందు వరకూ డ్రైవర్ మీదున్న అభిప్రాయం, ఆశ్చర్యం కాస్తా గాలికి కొట్టుకుపోయాయి. నా ప్రసంగానికి ఇచ్చే విలువ కన్నా డబ్బుకు డ్రైవర్ ఇస్తున్న విలువను తలచి బాధపడ్డారు చర్చిల్. అందుకే అంటారేమో డబ్బుకు లోకం దాసోహమని.
– యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment