భక్తి ఎక్కువైతే కొందరు ఊహాతీతంగా ప్రవర్తిస్తారు. వరగుణ పాండ్యన్ అనే రాజు ప్రవర్తన ఇందుకు మంచి ఉదాహరణ. తిరవిడై మరుదూర్ అనే ఊళ్లో ఆలయానికి కావలసిన నూనెను తీయడం కోసం ఒక రోజు నువ్వులు ఆరబెట్టారు. ఆ సమయంలో అటువైపుగా ఓ శివభక్తుడు వచ్చి ఓ పిడికెడు నువ్వులు తీసుకుని నోట్లో వేసుకున్నాడు.
దేవుడి కోసం ఉపయోగించాలని ఎండబెట్టిన నువ్వుల్ని ఇలా నోట్లో వేసుకోవచ్చా? అది తప్పు కదా? అపచారం కదూ! అక్కడ కాపలా ఉన్నవారు ఇది చూశారు. ‘అయ్యో... అపచారం అపచారం’ అంటూ పరుగున వచ్చి అతనిని పట్టుకుని తీసుకుపోయి రాజు వరగుణ పాండ్యన్ ఎదుట హాజరుపరచారు.
వరగుణ పాండ్యన్ అతని వంక తీక్షణంగా చూశాడు. నుదుట బొట్టుతో పరమ శివభక్తునిలా కనిపించిన అతడిని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ఈయన ఇలా చేయడమేమిటీ అని అనుకున్న రాజు నమ్మలేకపోతున్నాడు.
‘నువ్విలా చేయడమేమిటీ?’ అని అడిగాడు. దానికి ఆ భక్తుడు ఇలా చెప్పాడు... ‘నేను ఆకలి వల్ల అలా చేశాను. ఈ ఊరు నాకు ఎంతో నచ్చింది. శివాపచారం చేస్తే ఏడు జన్మలకు ఈ ఆలయానికి గానుగ ఆడించే ఎద్దుగా పుడతారన్న విషయం తెలుసు. అందుకే అలా చేశాను’ అన్నాడు. పూర్వం ఎద్దులతో గానుగను ఆడించి నూనెను తీసేవారు. పుడితే ఈ ఊళ్ళో పుట్టాలి. అదీనూ గానుVýæ ఆడించే ఎద్దుగా. ఆ ఆలయంలో సేవ చేయాలి. ఒక తప్పు చేస్తే ఆ అవకాశం దక్కుతుందని తెలిసి ఆ భక్తుడు అలా చేశాడు.
రాజు వరగుణ పాండ్యన్ భక్తుణ్ణి నోరు తెరవమన్నారు. శివభక్తుడు నోరు తెరిచాడు. అతని నోటిని రాజు చీలుస్తాడని అక్కడున్న వారందరూ అనుకున్నారు. కానీ రాజు భక్తుని నోటిలో అంటుకుని ఉన్న నువ్వుల్ని తీసి తన నోట్లో వేసుకున్నాడు. ‘మీరు చేసిన అపచారాన్ని నేనూ చేశాను. మీతో కలిసి నేనూ గానుగ ఆడించే ఎద్దుగా పుడతాను’ అన్నాడు రాజు. ఇలా ఉంటుంది అపరిమత భక్తిగలవారి ప్రవర్తన. ప్రవర్తనలోని తప్పొప్పుల కన్నా వారి భావన ప్రధానమని గ్రహించాలి. – యామిజాల జగదీశ్
Comments
Please login to add a commentAdd a comment