విశ్లేషణ
మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది. హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలను ప్రవేశపెట్టారు. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం తగ్గింది. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండటం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి.
ఆహార ఉత్పత్తి మొదలయ్యేది విత్తనాల నుంచే. దాదాపు ప్రతి పంటకు అనేక రకాల విత్తనాలు ఉన్నాయి. స్థానికంగా లభ్యమయ్యే ప్రత్యేక పర్యావరణ, వాతావరణ, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతి పంటలో రైతులు వందల ఏండ్లుగా విత్తనాలను రూపొందిస్తున్నారు. మన దేశంలో వరిలో దాదాపు 3 లక్షల దేశీ రకం విత్తనాలు ఉండేవని వ్యవసాయ చరిత్ర చెబుతున్నది. వంకాయలో 3 వేలతో సహా అనేక పంటలకు వివిధ రకాల విత్తనాలను వందల యేండ్ల నుంచి వృద్ధి చేసుకున్న ఘనత భారత సాంప్రదాయ వ్యవసాయానిది.
దేశవ్యాప్తంగా విత్తనాల చుట్టూ అనేక సంప్రదాయాలు, పండుగలు, గ్రామీణ కార్యక్రమాలు ఉండేవి. గ్రామీణులు, రైతులు, ప్రత్యేకంగా మహిళలు విత్తనాలను గుర్తించటంలో, దాచటంలో, శుద్ధి చేయడంలో గణనీయ జ్ఞానం, కౌశల్యం సంపాదించారు. 35,000 సంవత్సరాలకు పైగా, తరతరాలుగా రైతాంగం పరిశోధనల ఫలితంగా అనేక రకాల విత్తనాలు వృద్ధి అయినాయి. ఈ జానపద విత్తన రకాలు మానవాళికి సుమారు 2,500 పంటలు, 14 పశువుల రకాలకు సంబంధించి ఆశ్చర్యపరిచే స్థాయిలో 11.4 లక్షల రకాల పంటలు, 8,800 పశువుల జాతులను అందించాయి.
హరిత విప్లవం ఒక విధానంగా వచ్చిన గత 60 ఏళ్లలో అనేక రకాల హైబ్రిడ్ విత్తనాలు, ప్రధానంగా వరి, గోధుమలు, మక్కల(మొక్కజొన్న)లో ప్రవేశపెట్టారు. 1968–2019 మధ్య వివిధ సంస్థల ద్వారా 1200 వరి హైబ్రిడ్లు ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఏకపంట పద్ధతికి ప్రోత్సాహం రావడంతో, పంటల వైవిధ్యం క్రమంగా తగ్గుతూ వచ్చి, ప్రమాదకర స్థాయికి చేరింది. హైబ్రిడ్ విత్తనాలను ప్రతి 3, 4 ఏళ్లకు మార్చాల్సి వస్తుంది. ఆధునిక వ్యవసాయం ల్యాబ్ విత్తనాలను ప్రవేశపెట్టి, సంప్రదాయ విత్తనాలను కనుమరుగు చేస్తున్నది.
విత్తనాలు కంపెనీల గుప్పిట్లోకి పోయాయి. విత్తనాలు పోయినాయి అంటే మొత్తం ఆహార వ్యవస్థ ఈ కంపెనీల చేతులలోకి వెళ్లిపోవచ్చు. అట్లని కంపెనీల అధీనంలో, ఒక గొప్ప విత్తన వ్యవస్థ వచ్చిందా అంటే అదీ లేదు. రసాయనాలు వాడి తయారు చేసిన విత్తనాలు రసాయన వ్యవసాయంలోనే పని చేస్తాయి. సహజంగా విత్తనాలలో సహజీవన సూక్ష్మజీవులు ఉంటాయి. రసాయన చర్యకు లోనైన ఆధునిక విత్తనాలలో ఈ సూక్ష్మ జీవులు ఉండవు. జీవ ప్రక్రియలో ముఖ్య ఘట్టం విత్తనాలు. ఆ విత్తనాలు విషానికి, విష వ్యాపార సంస్కృతికి బలవుతున్నాయి.
ప్రైవేటు కంపెనీల విత్తన వ్యాపారం మన దేశంలో 2002 నుంచి పుంజుకుని, ప్రతి యేడు పెరుగుతున్నది. దాదాపు రూ.25 వేల కోట్ల వార్షిక టర్నోవర్‌కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 75 శాతం విత్తన వ్యాపారం కేవలం మూడు బహుళజాతి కంపెనీల గుత్తాధిపత్యంలో ఉన్నది. అమెరికాలోనే పారిశ్రామిక వ్యవసాయానికి అనుగుణమైన విత్తన వ్యవస్థ పుట్టుకొచ్చింది.
అమెరికా ప్రభుత్వం ఎల్లప్పుడూ ఈ కంపెనీలకు మద్దతుగా తన వాణిజ్య, విదేశాంగ విధానం అమలు చేస్తుంది. మార్కెట్లో పోటీ తగ్గి కొన్ని కంపెనీల ఆధిపత్యంలో మార్కెట్లు ఉండడం వ్యవసాయ సుస్థిరతకు శ్రేయస్కరం కాదు. బీటీ పత్తి మినహా వేరే రకం పత్తి మార్కెట్లో లేకుండా ఈ ప్రైవేటు కంపెనీలు సిండికేట్ అయినాయి. ప్రభుత్వ సంస్థలలో విత్తన పరిశోధనలు జరగకుండా ప్రైవేటు విత్తన వ్యాపారం అడ్డు పడుతున్నది.
అధిక దిగుబడి వంగడాలు, హైబ్రిడ్ విత్తనాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో 1968లో కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రాథమిక లక్ష్యం అప్పట్లో ప్రభుత్వ పరిశోధన సంస్థలు విత్తనాలను విడుదల చేసే పద్ధతిని నిర్దేశించిడం. తరువాత 2002లో ప్రైవేట్ కంపెనీలకు విత్తనాలను ప్రవేశపెట్టే అవకాశం ఇచ్చినాక విత్తన చట్టం సవరించాలని భావించారు. 2003 నుంచి కొత్త విత్తన చట్టాన్ని రైతాంగం కోరుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కంపెనీలకు అనుకూల ముసాయిదాలతో 20 యేండ్ల కాలం దాటింది.
కొన్ని రాష్ట్రాలు తమ పరిధిలో చట్టం తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. వ్యవసాయానికి విత్తన ఆవశ్యకత ఉన్నందున విత్తనాలను నిత్యావసర చట్టంలో చేర్చిన ప్రభుత్వం ప్రైవేటు విత్తన కంపెనీలకు ఆదాయ పన్ను చట్టం నుంచి మినహాయింపు ఇచ్చింది. విత్తన ధరల మీద నియంత్రణ లేదు. ఉత్తుత్తగా ప్రతి సంవత్సరం పత్తి విత్తనాల ధర నిర్ణయిస్తారు. కొరత ఉందని రైతులను భయపెట్టి బ్లాకు మార్కెట్లో ధరను పదింతలు పెంచుతారు. రైతు మీద భారం మోపుతారు. ఎవరైనా రైతు సొంతంగా విత్తనాలు చేసి అమ్మితే వారి మీద 420 కేసులు పెట్టే శాసన వ్యవస్థ, నాణ్యత లేని విత్తనాల వల్ల వేల ఎకరాల పంట నష్టపోయినా ఆయా కంపెనీలకు తాఖీదులు కూడా ఇచ్చే ధైర్యం చేయలేదు.
జన్యుమార్పిడి విత్తనాల వల్ల శ్రేష్ఠమైన సంప్రదాయ విత్తనాలు కనుమరుగు అవుతుంటే, కలుషితం అవుతుంటే పట్టించుకుని సంరక్షించే విత్తన సంస్థ లేకపోవడం దురదృష్టకరం. ప్రత్తి విత్తనాలలో శ్రేష్ఠమైన, దేశీ విత్తనాలు ఇప్పుడు దొరికే పరిస్థితి లేదు. అనేక పంటలలోనూ ఇదే పరిస్థితి. పసుపు, చెరుకు, గోధుమలు, జొన్నలు, కూరగాయలు, మక్కలలో దేశీ రకాలు కనుమరుగు అవుతున్నాయి. ప్రైవేటు కంపెనీలు అమ్ముతున్న కంకర లాంటి మక్క గింజల పంటను ఫ్యాక్టరీకి పంపించి, ప్రాసెస్ చేసి, పశువుల, కోళ్ళ దాణాగా మాత్రమే ఉపయోగించేందుకు వృద్ధి చేశారు.
ఇప్పటి మక్క కంకులు నేరుగా ఇళ్లల్లో కాల్చుకుని, ఉడకపెట్టుకుని, ఒలుచుకుని తినే విధంగా లేవు. అటువంటి మక్క గింజలనే పక్కాగా వాడమనీ, తమ కంపెనీల దగ్గర కొనుక్కోమనీ వివిధ దేశాల మీద ఒత్తిడి తేవడం అమెరికా పని. ఇటీవల అటువంటి జన్యుమార్పిడి మక్కలు మాకు వద్దని మెక్సికో ప్రభుత్వం అమెరికా నుంచి మక్కల దిగుమతిని ఆపేసింది. ముక్కలకు మక్కాగా ప్రసిద్ధి చెందిన మెక్సికో తమ గింజలను, తమ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి అమెరికాను ధిక్కరించింది. వరి గింజలకు, వైవిధ్యానికి ప్రసిద్ధి చెందిన మన దేశం మాత్రం విత్తన వైవిధ్యాన్ని కాపాడుకునేందుకు ఒక్కడుగు కూడా వేయడం లేదు.
రైతులే కేంద్రంగా విత్తన వ్యవస్థను పునరుద్ధరించే పనిని అనేక స్వచ్చంద సంస్థలు దేశ వ్యాప్తంగా చేస్తున్నాయి. సహకార విత్తన బ్యాంకులను (కమ్యూనిటీ సీడ్ బ్యాంక్స్) ఏర్పాటు చేసి రైతులు, ప్రత్యేకంగా మహిళలను ప్రోత్సహిస్తున్నాయి. గత పదేళ్ళలో వరిలో, గోధుమలలో, చిరు ధాన్యాలలో, వివిధ కూరగాయలు, పండ్లలో తిరిగి దేశీ విత్తనాలను ఉపయోగించే వాతావరణం కల్పించటంలో అనేక సంస్థలు, వ్యక్తుల కృషి ఉన్నది. మన దేశంలో ఈ రెండు వ్యవస్థల (రైతు కేంద్రీకృత విత్తన వ్యవస్థ, లాభాపేక్షతో కొన్ని జన్యుమార్పిడి విత్తనాలను గుప్పిట్లో పెట్టుకున్న ప్రైవేటు వ్యవస్థ) మధ్య కనపడని సంఘర్షణ ఏర్పడింది. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రైవేటు విత్తన వ్యవస్థ వైపు మొగ్గు చూపుతూ, సబ్సిడీలు అందిస్తూ గుత్తాధిపత్యానికి ఊతం అందిస్తున్నాయి.
రైతులకు విత్తనాల మీద స్వావలంబన కొనసాగించే వ్యవస్థ అవసరం. వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్నా, రసాయన రహిత పౌష్టిక ఆహారం అందాలన్నా, అందరికి కూడు, బట్ట అందాలన్నా విత్తన వ్యవస్థ లాభాపేక్ష లేని వ్యవస్థగా రూపుదిద్దాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుస్థిర, గుత్తాధిపత్య రహిత విత్తన వ్యవస్థకు ప్రోత్సాహం అందించే విధానాలు రూపొందించాలి. గాలి, నేల, నీరు వంటివి సహజ పర్యావరణ వనరులు. విత్తనాలు కూడా సహజ వనరు. ఏ ఒక్కరి సొంతమో కారాదు.
డా‘‘ దొంతి నరసింహా రెడ్డి
వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment