
ప్రస్తుతం మానసిక ఒత్తిడి, సమస్యలు లేని జీవితం లేదంటే అతిశయోక్తి కాదు. పని ఒత్తిడి, ఆర్థికపరమైన సమస్యలు, ఇతర ఇబ్బందుల కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజూ కనీసం ఓ అర గంటయినా శారీరక శ్రమ చేయాలంటారు నిపుణులు. అందుకు యోగా చక్కని మార్గం. ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో సహాయపడుతుంది. చాలామందికి, వారి అస్తవ్యస్తమైన, బిజీ జీవితాల నుండి యోగా ఉపశమనాన్ని ఇవ్వగలదు. యోగా చేయడం వల్ల శరీరానికి నూతనోత్సాహం కలుగుతుంది. బలాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. భంగిమను మెరుగుపరుస్తుంది. మనసు, శరీరం, ఆత్మను నియంత్రించడంలో యోగా సహాయపడుతుంది.
యోగా ఒక శక్తిమంతమైన మైండ్‌ఫుల్‌నెస్ సాధన. యోగా ఒత్తిడిని తగ్గించి ప్రశాంతంగా ఉండేట్లు చేస్తుంది. యోగా చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. యోగ శ్వాసక్రియ శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. యోగా సాధన సాగదీసినట్లు అనిపించవచ్చు. కానీ శరీరానికి మంచి అనుభూతి అందించడం, కదిలే విధానంలో చాలా మార్పు చూపుతుంది. క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల బరువు తగ్గడం, ఒత్తిడిని తగ్గించుకోవడం సాధ్యమవుతాయి. యోగ అభ్యాసం వలన కలిగే ప్రయోజనాలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చాయి.
యోగాలో చాలా రకాలు ఉన్నాయి, హఠ (అనేక శైలుల కలయిక) అత్యంత ప్రాచుర్యం పొందిన శైలులలో ఒకటి. హఠ యోగం ప్రాణాయామాలపై (శ్వాస నియంత్రిత వ్యాయామాలు) దృష్టి పెడుతుంది. వీటి తర్వాత వరుసలో ఆసనాలు (యోగా భంగిమలు) ఉంటాయి. అవి శవాసనంతో (విశ్రాంతి కాలం) ముగుస్తాయి.
యోగశాలల్లో సాధారణంగా అద్దాలు ఉండవు. సాధకులు తమను చుట్టుపక్కల వ్యక్తులు ఎలా చూస్తారనే దాని కంటే ముఖ్యంగా తమ పట్ల తమకు ఏకాగ్రత అవసరం. యోగా సాధన చేయని వ్యక్తుల కంటే యోగా సాధన చేసేవారికి తమ శరీరాల గురించి ఎక్కువ అవగాహన ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యోగాసనాలు వేసేవారు ఎక్కువ సంతృప్తిగా ఉన్నారు. తమ శరీరాలపై తక్కువ ఫిర్యాదులు చేశారు. అందుకే సానుకూల శరీర ఆకృతి, ఆత్మగౌరవాలను ప్రోత్సహించే కార్యక్రమాలు యోగా చికిత్సలో భాగం అవుతున్నాయి.
యోగాను అభ్యసించడం ద్వారా, ఒక వ్యక్తి జీవితంలోని ఇతర రంగాలలో కూడా అవగాహన మెరుగవుతుంది. తినే రుగ్మతలను యోగా పోగొడుతుంది. బుద్ధిపూర్వకంగా తినడం, శారీరక భావోద్వేగ అనుభూతులను అవగాహనకు తెచ్చుకోవడంలో యోగా సాయపడుతుంది. విచారంలో ఉన్నప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు పరధ్యానంగా తింటారు. అదే యోగాను అభ్యసించే వ్యక్తులు ఒక పద్ధతి ప్రకారం మనస్ఫూర్తిగా భుజిస్తారు.
అందుకే బరువు తగ్గాలనుకునేవారికి యోగా సాధన ఉత్తమం. బుద్ధిపూర్వకంగా తినేవారు తమ శరీరాన్ని ఆరోగ్యాంగా చూసుకుంటారు. యోగా సాధన చేసేవారిలో కండరాల బలం, స్థితప్రజ్ఞత, ఓర్పు, కార్డియో–రెస్పిరేటరీ ఫిట్‌నెస్ మెరుగవుతాయని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. యోగా, మంచి ఆహార అలవాట్లు మనిషి మనుగడను మెరుగుపరుస్తాయి. మనిషి ప్రశాంతతకు, ఆనందమయ జీవితానికి యోగా మంచి ఉపకరణం.
– డా‘‘ ఎం. అఖిల మిత్ర ‘ ప్రకృతి వైద్యులు
(నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం)
Comments
Please login to add a commentAdd a comment