నగరంలో ఏరియల్ యోగాకు క్రేజ్
తక్కువ కాలంలో ఎక్కువ ప్రయోజనాలు
శారీరక, మానసిక సమస్యలకు చక్కని పరిష్కారం
ఒత్తిడి, డిప్రెషన్ దూరం చేసే ఆయుధం..
బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపరచడంలో ముఖ్యభూమిక
బిజీ లైఫ్ స్టైల్లో తీవ్ర ఒత్తిడి, కోపం, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో భాగ్యనగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యోగా, ధ్యానం వల్ల మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. ఇవన్నీ పూర్వకాలం నుంచి తరతరాలుగా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నగరంలో వయసుతో సంబంధం లేకుండా యోగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం యోగాలో కూడా కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదే ఏరియల్ యోగా.. దీన్నే రోప్ యోగా అని కూడా అంటారు. సాధారణంగా కింద కూర్చుని యోగాసనాలు వేయడం కామన్.. కానీ గాల్లో వేలాడుతూ వివిధ యోగాసనాలు చేయడమే ఏరియల్ యోగా స్పెషల్ అన్నమాట. గాల్లో యోగాసనాలు ఎలా వేస్తారనే కదా మీ అనుమానం. దీని గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం..
ఏరియల్ యోగాలో చీర పరిమాణంలో ఉన్న ఒక వస్త్రాన్ని పైనుంచి ఊయల మాదిరిగా వేలాడదీస్తారు. ఆ వస్త్రాన్ని శరీరం చుట్టూ చుట్టుకోవాలి. ఇక, వస్త్రాన్ని శరీరానికి చుట్టుకున్న తర్వాత వివిధ యోగాసనాలు వేస్తుంటారు. దీని వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరగడంతో పాటు శరీరానికి ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ పరిష్కారంగా నిలుస్తోంది.
జీర్ణక్రియకు తోడ్పాటు..
ఏరియల్ యోగాతో జీర్ణక్రియ ఎంతో మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, ఉబ్బరం, కడుపు నొప్పి, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శరీరాన్ని సాగతీయడంతో పొత్తికడుపు ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. పేగు సంబంధ సమస్యలు దరి చేరకుండా చూస్తుంది. కడుపు నొప్పి లేదా గ్యాస్ ఉంటే ఏరియల్ యోగాతో తగ్గించుకోవచ్చు.
ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది..
ఏరియల్ యోగా శరీర కండరాలు సాగేలా చేస్తుంది. గాల్లో ఉంటారు కాబట్టి.. శరీరాన్ని మరింత స్ట్రెచ్ చేసేందుకు వీలు కలుగుతుంది. కొద్ది రోజులకు శరీరం మరింత ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. ఇలా చేయడం వల్ల కండరాలు కూడా బలంగా తయారవుతాయి. వెన్నెముక, భుజం శక్తివంతంగా తయారయ్యేందుకు దోహదపడుతుంది.
ఒత్తిడిని తగ్గించే ఆయుధం..
ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలతో బాధపడుతుంటే.. ఏరియల్ యోగా చాలా ఉత్తమమైన వ్యాయామం అని చెప్పొచ్చు. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు ప్రవర్తనలో కూడా మంచి మార్పులు తీసుకొస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గి స్తుంది. గాల్లో తల్లకిందులుగా వేలాడుతూ.. ధ్యానం చేస్తుంటే మంచి ఆలోచనలపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఏరియల్ యోగాతో మెదడులో రక్త ప్రసరణ పెరిగి మానసిక ఆరోగ్యం మన సొంతమయ్యేలా చేస్తుంది.
వెన్నునొప్పి హుష్‌కాకి..
వెన్నెముకపై ఎలాంటి ఒత్తిడీ పడకుండా వెన్నెముక, దాని సంబంధిత సమస్యలను నయం చేయడంలో ఏరియల్ యోగా ఎంతో ప్రభావం చూపుతుంది. వస్త్రంలో పడుకుని వెనక్కి అలా వంగి కాసేపు ఆసనం వేస్తే వెన్నెముక సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. ఏరియల్ యోగాతో శరీర తీరుతో పాటు వెన్నెముకను సరిచేసుకోవచ్చు. నడుము నొప్పి కూడా తగ్గుతుంది.
బరువు తగ్గిపోతుంది..
ఏరియల్ యోగా బరువు తగ్గించడంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. 50 నిమిషాల పాటు ఏరియల్ యోగా చేస్తే దాదాపు 320 కేలరీలు బర్న్ చేయగలదు. శరీర కొవ్వును బర్న్ చేసేటప్పుడు ఇది టోన్డ్, లీన్ కండరాలను పొందడానికి సహాయం చేస్తుంది. సమర్థవంతమైన ఫలితాల కోసం వారానికి ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు.
నిపుణుల పర్యవేక్షణలో ..
యోగా చేసేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. సొంతంగా చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముందు ఎవరైనా గురువు దగ్గర నేర్చుకుని ఆ తర్వాతే అభ్యాసం చేయాలి. కొన్ని యోగాసనాలు చేస్తే పర్వాలేదు. అన్ని ఆసనాలు అందరూ చేయకూడదు. ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. క్రమం తప్పకుండా క్రమపద్ధతిలో చేయాలి.
– శ్రీకాంత్ నీరటి, యోగా ట్రైనర్
యోగాతో ఎన్నో ప్రయోజనాలు
యోగా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పతంజలి సూచించిన అష్టాంగ మార్గాల్లోని యమ, నియమను పాటిస్తూ యోగా సనాలు వేయాలి. అప్పుడే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు చేకూరతాయి. స్థితప్రజ్ఞత సాధించేందుకు యోగా అత్యున్నత మార్గం.
– నెతికార్ లివాంకర్, యోగా ట్రైనర్, రామకృష్ణ మఠం
కాని్ఫడెన్స్ పెరుగుతుంది..
ఏరియల్ యోగా లేదా యాంటీ గ్రావిటీ యోగా ద్వారా శరీరం చాలా బలంగా తయారవుతుంది. అలాగే మనపై మనకు కాన్ఫిడెన్స్‌తోపాటు జ్ఞాపకశక్తి, రక్త ప్రసరణ పెరుగుతుంది. మైండ్ రిలాక్సేషన్ అవుతుంది. కాకపోతే సాధారణ యోగాలో కొంతకాలం అనుభవం ఉన్న వారు మాత్రమే దీనిని చేయాలి. ముఖ్యంగా గురువుల సమక్షంలో చేస్తే మంచిది.
– కొండకళ్ల దత్తాత్రేయ రావు, అద్వైత యోగా సెంటర్
Comments
Please login to add a commentAdd a comment