వెన్నెముక కండరాలను బలోపేతం చేయడంలోనూ, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలోనూ.. ఎన్నో ప్రయోజనాలను అర్ధచక్రాసన ద్వారా పొందవచ్చు. ఈ ఆసనం విల్లు భంగిమను పోలిఉంటుంది. అర్ధ చక్రం (హాఫ్ వీల్ ఆసన) అంటే సగం చక్రం అన్నమాట.
చురుకైన కండరాలు..
దీనిని సాధన చేయడానికి మ్యాట్‌పైన నిటారుగా నిల్చోవాలి. చేతులను, తలను భుజాల నుంచి వెనక్కి తీసుకుంటూ నడుమును వంచాలి. దీని వల్ల వెన్ను భాగం సాగుతుంది. ఎంత వీలైతే అంతగా నడుము భాగాన్ని ముందుకు, తల భాగాన్ని వెనక్కి వంచుతూ కాళ్లను నిటారుగా ఉంచాలి. దీంతో కండరాలన్నీ పూర్తి చురుగ్గా అవుతాయి. వెనుకకు వంగేటప్పుడు దీర్ఘ శ్వాస పీల్చుకొని, నెమ్మదిగా వదలాలి. అదే విధంగా యధాస్థితికి చేరుకున్నప్పుడు దీర్ఘశ్వాస తీసుకుంటూ, వదలాలి.
మూడు నుంచి ఐదు సార్లు..
సాధారణంగా శ్వాస తీసుకునేటప్పుడు సమతుల్యతను కోల్పోకుండా ఉండేలా చూసుకోవాలి. మూడు నుంచి ఐదు సార్లు ఈ భంగిమను తిరిగి చేయాలి. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం కేటాయించాలి. ఈ ఆసనం వల్ల వెన్నెముక నొప్పి తీవ్రత తగ్గుతుంది. కడుపుపై ఒత్తిడి పెరిగి, అదనపు కొవ్వు తగ్గిపోతుంది. ఊబకాయంపై ప్రభావంతంగా పనిచేస్తుంది. హృదయ స్పందన రేటును సమర్థంగా నిర్వహిస్తుంది. ఫలితంగా గుండె పనితీరు మెరుగుపడుతుంది.
– జి. అనూషా రాకేష్, యోగా ట్రైనర్
Comments
Please login to add a commentAdd a comment