Winston Churchill
-
బంగారు టాయిలెట్ దోచుకెళ్లారు
లండన్: బ్రిటన్‌లోని బ్లెన్‌హీమ్ ప్యాలెస్‌లోని 18 క్యారెట్ల బంగారు టాయిలెట్‌ను దొంగలు శనివారం దోచుకెళ్లారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా పేరందుకున్న ప్యాలెస్‌లో ఈ చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 66 ఏళ్ల నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బ్రిటిష్ కాలమానం ప్రకారం ఉదయం 4:50 గంటలకు ఈ దొంగతనం జరిగిందని పోలీసులు స్పష్టం చేశారు. టాయిలెట్ పైపులు గోడల లోపలికి బిగించి ఉండటం వల్ల గోడలకు నష్టం జరిగిందని, ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయిందని తెలిపారు. దీన్ని దొంగిలించడానికి నిందితులు రెండు వాహనాలు ఉపయోగించినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ప్యాలెస్ డిస్ప్లేపై చూపిన బంగారు టాయిలెట్‌ను దోచుకెళ్లారని పోలీసు అధికారి చెప్పారు. నిందితుల్ని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. -
చూడ్డానికి వచ్చి ‘టాయ్‌లెట్’ కొట్టేశారు..!
లండన్ : బ్రిటన్ మాజీ ప్రధాని పుట్టిన ప్రదేశం, ఆక్స్ఫర్డ్షైర్లోని ప్రఖ్యాత బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది. ప్రసిద్ధ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన టాయ్‌లెట్‌ను దుండగులు మాయం చేశారు. భారీ భద్రతతో కూడిన బ్లెన్హేమ్ ప్యాలెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు తెలిసింది. భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతోనే ఈ దోపిడీకి ఆస్కారం ఏర్పడిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ‘గెలుపు ఒక ఎంపిక కాదు’ అనే టైటిల్‌తో రూపొందించిన ఈ టాయ్‌లెట్‌ను సందర్శనార్థం చర్చిల్ జన్మించిన పక్క గదిలోనే ఏర్పాటు చేశారు. గురువారం నుంచే ఈ టాయ్‌లెట్‌ను సందర్శనకు పెట్టారు. అంతలోనే దోపిడీకి గురైంది. మౌరిజియో కాటెలాన్ తయారు చేసిన బంగారు టాయ్‌లెట్ దొంగతనానికి గురైనట్టు శనివారం ఉదయం సమాచారం అందిందని థేమ్స్ వాలీ పోలీసులు వెల్లడించారు. ఘటనతో ప్రమేమున్నట్టు భావిస్తున్న ఓ 66 ఏళ్ల వృద్ధురాలిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇక ఇంత ప్రతిష్టాత్మక, విలువ గల టాయ్‌లెట్ పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, భారీ సంఖ్యలో జనాన్ని అనుమతించడం వల్ల దాని ఆర్ట్‌వర్క్ దెబ్బతింటుందని డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జెస్ మిల్నేఅన్నారు. నిందితులు రెండు వాహనాల్లో వచ్చినట్టు ప్రాథమికంగా నిర్ధారించామని తెలిపారు. కాగా, శుక్రవారం అర్ధరాత్రి ఈ దోపిడీ జరిగినట్టు బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియం నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. థేమ్స్ వాలీ పోలీసులతో కలిసి నిందితులను పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సందర్శకులతో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే యునెస్కో గుర్తింపు పొందిన బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియంను శనివారం మధ్యాహ్నం వరకు మూసేయించారు. ఇదిలాఉండగా.. 2016లో మౌరిజియో కాటెలాన్ బంగారు టాయ్‌లెట్ ఆర్ట్‌వర్కును న్యూయార్క్‌లోని ప్రసిద్ధ గగ్గన్హేమ్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై మనసు పారేసుకున్నారు. ఈ బంగారు టాయ్‌లెట్‌ను ఇస్తే బదులుగా విన్సెంట్ వాన్గో 1888లో వేసిన విఖ్యాత ‘ల్యాండ్‌స్కేప్ విత్ స్నో’ పెయింటింగ్ ఇస్తానని ట్రంప్ చెప్పడం విశేషం. -
బెంగాల్ కరవుకు ఓ ‘మానవుడు’ కారణం
సాక్షి, న్యూఢిల్లీ : 1873–74, 1876, 1877, 1896–97, 1899, 1943.. ఈ సంవత్సరాల్లో ఏం జరిగిందో ఎవరికీ గుర్తుండకపోవచ్చు! భారతావనిపై కరవు జెడలు విప్పి కరాళ నృత్యం చేసిన పీడ ఎడాదులు. పీడ కలల్లా వాటిని మరచిపోవడమే మంచిది, ఒక్క 1943లో వచ్చిన బెంగాల్ కరవును మినహా. దాదాపు 30 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నందున బెంగాల్ కరవును మరచి పోరాదని చెప్పడం లేదు. అంతకుముందు సంభవించిన ఐదు కరవులకు, ఈ ఆరో కరవుకు ఎంతో తేడా ఉండడమే. అంతకుముందు కరవులన్నీ ప్రకృతి సిద్ధంగా సంభవించినవే. అంటే, వర్షాలు లేక వడగాలులు పెరిగి, పంటలు పండక, తినడానికి తిండిలేక సంభవించినవి. కానీ బెంగాల్ కరవు అలాంటిది కాదు. ఓ మానవుడు అనుసరించిన విధానల వల్ల సంభవించిన కరవు. ఇది ఎలా రుజువైందంటే అమెరికా, భారత్ శాస్త్రవేత్తల బృందం కరవు సంభవించిన ఆ ఆరు కాలాల్లో భూమిలో తేమ శాతం ఎంతుందన్న విషయాన్ని పరిశోధనలతో ధ్రువీకరించడం ద్వారా. భూమిలో ఓ మోస్తారు స్థాయి వరకు తేమ ఉన్నట్లయితే ఆ సంవత్సరం వర్షాలు బాగానే కురిసినట్లు లెక్క. అంతకన్నా తేమ స్థాయి తగ్గుతూ పోతే అంత ఎక్కువ కరవు సంభవించినట్లు లెక్క. ఇక్కడ 1943లో మినహా మిగతా అన్ని కరవు సంవత్సరాల్లో భూమిలో తేమ బాగా తగ్గిందట. 1943లో భూమిలో ఎక్కువ తేమ ఉన్నట్లు తేలడమే కాకుండా ఆ ఏడాది చివరలో సమృద్ధిగా వర్షాలు కురిసినట్లు ఎన్నో చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆకలితో చనిపోయిన 30 లక్షల మందిలో ఎక్కువ మంది కూడా ఏడాది చివరలో మరణించడం గమనార్హం. ఈ కారణంగా 1943 నాటి కరవు ఓ మానవుడు సృష్టించిన కరవుగా గాంధీనగర్‌లోని ఐఐటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విమల్ మిశ్రా, అమర్దీప్ తివారీ, శరణ్ ఆధార్, రీపల్ షా, మూ జీయావో, డీఎస్ పాయ్, డెన్నీస్ లెట్టన్‌మెయిర్‌తో కలిసి జరిపిన పరిశోధనల్లో తేల్చారు. వాటిని వివరాలను ‘జియోఫిజికల్ రిసర్చ్ లెటర్స్’ తాజా సంచికలో ప్రచురించారు. ఆ మానవుడే విన్స్టన్ చర్చిల్ 1943లో సంభవించిన బెంగాల్ కరవుకు నాటి బ్రిటీష్ ప్రధాన మంత్రి విన్స్టన్ చర్చిల్ అనుసరించిన విధానాలే ప్రధాన కారణం. నాడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నందున చర్చిల్, బ్రిటీష్ సైన్యానికి భారీగా ఆహార పదార్థాలను భారత్ నుంచి తరలించారు. పరోక్షంగా జపాన్ దేశం కూడా కారణం. నాటి బర్మా నేటి మయన్మార్‌ను 1943లోనే జపాన్ ఆక్రమించుకొంది. దాంతో భారత్‌కు బియ్యం దిగుమతులు నిలిచిపోయాయి. అప్పటికి బర్మా నుంచే భారత్‌కు భారీగా బియ్యం దిగుమతులు వచ్చేవి. చర్చిల్ కారణంగా కాకుండా బర్మా నుంచి బియ్యం దిగుమతులు నిలిచి పోవడం వల్లనే ఎక్కువ కరవు ఏర్పడిందన్నది చరిత్రకారులు చెబుతూ వచ్చారు. చర్చిల్, బ్రిటీష్ సైన్యానికి భారీగా ఆహార దినుసులను ఎగమతి చేయడం వల్ల బెంగాల్‌లోని పేదలకు ఆహార దినుసులు అందుబాటులో లేకుండా పోయాయని భూమిలో తేమను రుజువుగా చూపుతున్న ఈ పరిశోధకులు చెబుతున్నారు. 1873–74లో కరవు వచ్చినప్పుడు బెంగాల్‌కు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా పనిచేసిన రిచర్డ్ టెంపుల్ దేశంలోని వివిధ ప్రాంతాలు, పలు దేశాల నుంచి ఆహార దినుసులను దిగుమతి చేయించారట. ఆయన అనుసరించిన విధానాన్ని అనుసరించాల్సిందిగా విన్స్టన్ చర్చిల్ ముందుకు నాడు ప్రతిపాదన వస్తే ఆయన నిర్ద్వంద్వంగా త్రోసిపుచ్చారట. 1943లో బయటి నుంచి ఆహార దినుసులను సరిపడా దిగుమతి చేసుకోకపోవడం తప్పిదమని భారతీయ ఆర్థికవేత్త అమర్త్యసేన్ కూడా 1981లో రాసిన ఓ వ్యాసం ఆరోపించారు. 70 వేల టన్నుల బియ్యం ఎగుమతి 1943లో జనవరి నుంచి జూలై నెలల మధ్య భారతదేశం నుంచి 70 వేల టన్నుల బియ్యం సైనిక అవసరాల కోసం ఎగుమతి అయ్యాయని, అది కరవును మరింత తీవ్రం చేసిందంటూ ‘చర్చిల్స్ సీక్రెట్ వార్: ది బ్రిటీష్ ఎంపైర్ అండ్ రివేజింగ్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ ది సెకండ్ వరల్డ్ వార్’ పుస్తకంలో (2011) మధుశ్రీ ముఖర్జీ రాశారు. సైన్యం కోసం బ్రిటన్‌లో అపార నిల్వలు ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తంటూ భారత్ నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకున్నారంటూ ఆమె తన పుస్తకంలో ఆరోపించారు. ఈ అంశం నాడు బ్రిటీష్ వార్ కేబినెట్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు ‘మనలాగే అక్కడి ప్రజలకు కూడా ముందు జాగ్రత్త ఉండాలి’ అంటూ చర్చిల్ వ్యాఖ్యానించారని ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. ‘నరహంతక నియంతల్లో ఒకడైన, చేతులు రెండు రక్తంతో తడిసిపోయిన చర్చిల్‌నా స్వాతంత్య్ర పిపాసి, ప్రజాతంత్ర వాదిగా ప్రశంసించుమని బ్రిటీష్ మనకు చెప్పేది’ అని పుస్తకాలు ఎక్కువగా చదివే అలవాటున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చిల్‌కు బాగా నప్పుతాయి. -
అతీతులు కారెవరూ!
రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలమది. బ్రిటీష్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్. రేడియో ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. చర్చిల్ తన ఇంటి నుంచి రేడియో స్టేషన్ కి వెళ్ళవలసి ఉంది. అయితే ఎప్పుడూ సవ్యంగా నడిచే ఆయన కారు కాస్తా ఆ రోజు మరమ్మతుకు గురైంది. బయలుదేరే సమయానికి అది నడవలేదు. దాంతో ఆయన ఆలస్యం చేయకుండా ఓ అద్దె టాక్సీ మాట్లాడుకున్నారు. అయితే తన టాక్సీలో ప్రధాని చర్చిల్ వస్తున్నారన్న విషయం ఆ వాహన డ్రైవరుకి తెలీదు. కారణం, ఆ డ్రైవర్ అంతకుముందు చర్చిల్ని చూసింది లేదు. కనుక ఆయన చర్చిల్ ని గుర్తుపట్టలేదు. చర్చిల్ కారెక్కి కూర్చున్నారు. కారు బయలుదేరింది. దారి మధ్యలో చర్చిల్ డ్రైవరుతో ‘‘ఇదిగో ఓ పదిహేను నిముషాలు వెయిట్ చేస్తే మళ్ళీ నీ టాక్సీలో ఇంటికి చేరుకుంటాను’’ అన్నారు. అయితే డ్రైవర్ ఏమన్నాడంటే... ‘‘క్షమించండి...అది కుదరదండి ఈరోజు రేడియోలో చర్చిల్ గారు మాట్లాడబోతున్నారు. ఆ మాటలు నేను వినాలి’’ అన్నాడు. చర్చిల్‌కి ఆ మాట ఆశ్చర్యం వేసింది. తన ప్రసంగాన్ని వినడానికి డ్రైవర్ కూడా ఆసక్తి చూపుతున్నాడుగా....నా మీద ఎంతటి ప్రేమాభిమానాలున్నాయో ఈ డ్రైవరుకి...అనుకుని మనసులో సంతోషించారు. టాక్సీ రేడియో స్టేషన్ కి చేరుకుంది. రేడియో స్టేషన్ దగ్గర ఓ మూలగా కారు ఆపించి చర్చిల్ కిందకు దిగారు. టాక్సి డ్రైవర్ వాహనాన్ని ముందుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అయితే చర్చిల్ మళ్ళీ డ్రైవర్ని అడిగాడు... ‘‘మరో అయిదు పౌండ్లు అదనంగా ఇస్తాను. కారుని ఆపకూడదు...పదిహేను నిముషాలు నిరీక్షించావంటే ఆ తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీ కారులో ఇంటికి చేరుకుంటాను’’ అన్నారు. అప్పుడు డ్రైవరు ‘‘పరవాలేదు సార్. చర్చిల్ ప్రసంగం ఈరోజు కాకపోతే ఇంకోరోజు వింటాను. మీరు అయిదు పౌండ్లు ఎక్కువగా ఇస్తానంటే పదిహేను నిముషాలేంటి సార్ ముప్పై నిముషాలు ఆగుతాను...’’ అన్నాడు. కాస్సేపటిముందు వరకూ డ్రైవర్ మీదున్న అభిప్రాయం, ఆశ్చర్యం కాస్తా గాలికి కొట్టుకుపోయాయి. నా ప్రసంగానికి ఇచ్చే విలువ కన్నా డబ్బుకు డ్రైవర్ ఇస్తున్న విలువను తలచి బాధపడ్డారు చర్చిల్. అందుకే అంటారేమో డబ్బుకు లోకం దాసోహమని. – యామిజాల జగదీశ్ -
వచ్చేవారం మళ్లీ నిషేధం
వలసలపై త్వరలో మరో ఉత్తర్వు: ట్రంప్ ► అప్పీలు కోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన సర్కారు వాషింగ్టన్ : వలసలపై మరో నిషేధ ఉత్తర్వు జారీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధమయ్యారు. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకను అడ్డుకునేలా వచ్చే వారంలో కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుల్ని జారీ చేస్తామని శుక్రవారం ఆయన ప్రకటించారు. పాత ఉత్తర్వుల్లో మార్పులు చేసి ఆదేశాలు జారీ చేస్తామని వైట్‌హౌస్‌లో మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘అది చాలా తప్పుడు నిర్ణయం. దేశ భద్రత, రక్షణకు ప్రమాదకరమైంది. కొత్త ఉత్తర్వులు చాలా పక్కాగా ఉంటాయి. అమెరికాకు వచ్చేవారిని చాలా క్షుణ్నంగా తనిఖీ చేయబోతున్నాం’ తెలిపారు. ట్రంప్‌కు టెక్సస్ రాష్ట్రం మద్దతు మరోవైపు ట్రంప్ నిషేధ ఉత్తర్వులపై తొమ్మిదో సర్క్యూట్ అప్పీలు కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా న్యాయశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ట్రంప్ ఉత్తర్వుల అమలును పునరుద్ధరించాలంటూ శుక్రవారం సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ట్రంప్ ఉత్తర్వులపై కోర్టు పోరాటంలో కీలకంగా వ్యవహరించిన వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గూసన్ మాట్లాడుతూ... ‘ట్రంప్ సర్కారు సుప్రీంను ఆశ్రయించడంతో అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టమైంది’ అని చెప్పారు. అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్... వలసల ఉత్తర్వులపై ట్రంప్ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ మేరకు టెక్సస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్ తొమ్మిదో సర్క్యూట్ అప్పీలు కోర్టు న్యాయ శాఖకు మద్దతుగా పిటిషన్ వేశారు. మీడియా పట్ల ట్రంప్ విమర్శలపై ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌ను ఆసక్తికరంగా స్పందించారు. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ...‘బ్రిటన్ మాజీ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ ఒకసారి ఏమన్నారంటే... రాజకీయ నాయకులు వార్తపత్రికల గురించి ఫిర్యాదు చేయడమంటే... సముద్రం గురించి నావికుడు ఫిర్యాదు చేయడమే’ అని పేర్కొన్నారు. మీడియాను విమర్శిస్తూ ట్రంప్ సమయం వృథా చేసుకుంటున్నారని చెప్పారు. -
ప్రధానిగా చర్చిల్ గెలుపు
ఆ నేడు 26 అక్టోబర్, 1951 ఈ రోజున జరిగిన సాధారణ ఎన్నికలలో బ్రిటన్ ప్రధానిగా విన్స్టన్ చర్చిల్ ఎన్నికయ్యారు. 77ఏళ్ల చర్చిల్ బ్రిటిష్ ప్రధానిగా ఎన్నిక కావడం ఇది రెండవ సారి కాగా, ఆ పదవికి ఎన్నికయిన వయోవృద్ధులలో రెండవ స్థానంలో నిలిచి మరో రికార్డు సృష్టించారు. కన్సర్వేటివ్ పార్టీ గెలుపు తథ్యమని ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడో ప్రకటించినప్పటికీ, మెజారిటీ మాత్రం ఊహించినంత రాలేదు. ధరల పెరుగుదల, భారీగా పెరిగిన గృహనిర్మాణ వ్యయం వంటి కారణాలతో చర్చిల్ కేవలం 17 సీట్ల స్వల్ప ఆధిక్యతతో గట్టెక్కాననిపించారు. ప్రత్యర్థి పార్టీ అయిన లేబర్ పార్టీ చర్చిల్‌ను యుద్ధపిపాసిగా అభివర్ణించినప్పటికీ, తాను గెలిస్తే సుస్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చర్చిల్ చేసిన ఎన్నికల వాగ్దానమే ఆయన గెలుపునకు ప్రధాన కారణాలలో ఒకటని విమర్శకులంటారు. ఆ తర్వాత చర్చిల్ అనారోగ్య కారణాలతో 1955లో తన పదవికి రాజీనామా చేశారు. 1964లో తన 91వ ఏట కన్నుమూశారు. -
యుద్ధ చరిత్రలో చివరి విలుకాడు
పీఛేముడ్ రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటిష్ సైన్యం తరఫున జాన్ మాల్కమ్ థోర్పే ఫ్లెమింగ్ జాక్ చర్చిల్ అనే అధికారి లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసేవాడు. ఆ కాలానికి మెషిన్గన్లు, రివాల్వర్లు వంటి అధునాతన ఆయుధాలెన్నో అందుబాటులోకి వచ్చినా, ఇతగాడు మాత్రం సంప్రదాయబద్ధమైన స్కాటిష్ ఖడ్గాన్ని, విల్లంబులను ధరించి రణరంగంలో పోరాడేవాడు. ఆధునిక యుద్ధ చరిత్రలో చిట్టచివరి విలుకాడు ఇతడే. ధనుర్విద్యలో ఇతగాడికి అపార నైపుణ్యం ఉండేది. అంతే స్థాయిలో తలతిక్కా ఉండేది. తన ఎదుటికి వచ్చే సైనికులు ఖడ్గాన్ని ధరించకుంటే, అగ్గిరాముడయ్యేవాడు. అప్పటికప్పుడే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేవాడు. శత్రుబలగాలు తుపాకుల మోత మోగిస్తున్నా, విల్లంబులు ధరించి, రణరంగానికేగిన ఈ వెర్రి సేనాని, జర్మనీలోని నాజీ బలగాలకు చిక్కాడు. ఇతగాడి ఇంటిపేరు చర్చిల్ కావడంతో బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్‌కు చుట్టం కావచ్చనే భ్రమలో తొలుత నాజీ నేతలు ఇతగాడిని చంపే ఆలోచనను విరమించుకున్నారు. విన్స్టన్ చర్చిల్తో ఇతగాడికి ఎలాంటి బంధుత్వం లేదని తేలిన మరుక్షణమే హిట్లర్ ఇతగాడిని చంపేయాలంటూ హుకుం జారీ చేశాడు. అయితే, ఆ ఆదేశాన్ని నాజీ కెప్టెన్ హాన్స్ థార్నర్ అమలు చేయకపోవడంతో జాక్ చర్చిల్ బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు.