వచ్చేవారం మళ్లీ నిషేధం | New version of Trump immigration order coming | Sakshi
Sakshi News home page

వచ్చేవారం మళ్లీ నిషేధం

Published Sat, Feb 18 2017 1:07 AM | Last Updated on Sun, Sep 2 2018 5:28 PM

వచ్చేవారం మళ్లీ నిషేధం - Sakshi

వచ్చేవారం మళ్లీ నిషేధం

వలసలపై త్వరలో మరో ఉత్తర్వు: ట్రంప్‌
► అప్పీలు కోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన సర్కారు  
వాషింగ్టన్ : వలసలపై మరో నిషేధ ఉత్తర్వు జారీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సిద్ధమయ్యారు. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకను అడ్డుకునేలా వచ్చే వారంలో కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుల్ని జారీ చేస్తామని శుక్రవారం ఆయన ప్రకటించారు. పాత ఉత్తర్వుల్లో మార్పులు చేసి ఆదేశాలు జారీ చేస్తామని వైట్‌హౌస్‌లో  మీడియా సమావేశంలో వెల్లడించారు.  ఈ సందర్భంగా కోర్టు నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ‘అది చాలా తప్పుడు నిర్ణయం. దేశ భద్రత, రక్షణకు ప్రమాదకరమైంది. కొత్త ఉత్తర్వులు చాలా పక్కాగా ఉంటాయి. అమెరికాకు వచ్చేవారిని చాలా క్షుణ్నంగా తనిఖీ చేయబోతున్నాం’ తెలిపారు.

ట్రంప్‌కు టెక్సస్‌ రాష్ట్రం మద్దతు
మరోవైపు ట్రంప్‌ నిషేధ ఉత్తర్వులపై తొమ్మిదో సర్క్యూట్‌ అప్పీలు కోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా న్యాయశాఖ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ట్రంప్‌ ఉత్తర్వుల అమలును పునరుద్ధరించాలంటూ శుక్రవారం సుప్రీంకు విజ్ఞప్తి చేసింది. ట్రంప్‌ ఉత్తర్వులపై కోర్టు పోరాటంలో కీలకంగా వ్యవహరించిన వాషింగ్టన్  రాష్ట్ర అటార్నీ జనరల్‌ బాబ్‌ ఫెర్గూసన్  మాట్లాడుతూ... ‘ట్రంప్‌ సర్కారు సుప్రీంను ఆశ్రయించడంతో అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వులు రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లు స్పష్టమైంది’ అని చెప్పారు.

అమెరికాలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన టెక్సస్‌... వలసల ఉత్తర్వులపై ట్రంప్‌ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ మేరకు టెక్సస్‌ అటార్నీ జనరల్‌ కెన్  పాక్స్టన్ తొమ్మిదో సర్క్యూట్‌ అప్పీలు కోర్టు న్యాయ శాఖకు మద్దతుగా పిటిషన్ వేశారు. మీడియా పట్ల ట్రంప్‌ విమర్శలపై ఆస్ట్రేలియా ప్రధాని టర్న్‌బుల్‌ను ఆసక్తికరంగా స్పందించారు. న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ...‘బ్రిటన్  మాజీ ప్రధాని విన్ స్టన్  చర్చిల్‌ ఒకసారి ఏమన్నారంటే... రాజకీయ నాయకులు వార్తపత్రికల గురించి ఫిర్యాదు చేయడమంటే... సముద్రం గురించి నావికుడు ఫిర్యాదు చేయడమే’ అని పేర్కొన్నారు. మీడియాను విమర్శిస్తూ ట్రంప్‌ సమయం వృథా చేసుకుంటున్నారని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement