అమెరికాలో చదువుకోవడం అనేది చాలామంది భారతీయ విద్యార్థుల కల. అందుకోసం ఎన్నో ప్రయాసలుపడి, అప్పులు చేసి అమెరికాకు వస్తారు. ఎలాగోలా కష్టపడి మంచి యూనివర్సిటీలో సంబందిత కోర్సుల్లో జాయిన్ అయ్యి చదువుకుంటారు. అలాగే తల్లిదండ్రులకు భారం కాకుండా తమ ఖర్చుల కోసం చిన్నాచితకా ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటుంటారు. ఆ తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాక..గ్రీన్‌కార్డ్ కోసం పాట్లుపడి ఏదోలా అక్కడే స్థిరపడేవారు. అలా అమెరికాలో జీవించాలనే కోరికను సాకారం చేసుకునేవారు. ఇప్పుడు ట్రంప దెబ్బకు భారత విద్యార్థులకు ఆ ధీమా పోయింది. అసలు అక్కడ చదువు సజావుగా పూర్తి చేయగలమా అనే భయాందోళనతో గడుపుతున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు కచ్చితంగా పనినిబంధనలు పాటించాలనే కొత్తి ఇమ్మిగ్రేషన్ చట్టాల నేపథ్యంలో చాలామంది పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేశారు. అస్సలు అక్కడ ఉండాలో వెనక్కొచ్చేయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారు చాలామంది విద్యార్థులు. అసలెందుకు ఈ పరిస్థితి..? భారతీయ విద్యార్థులు ఈ సమస్యను ఎలా అధిగమించొచ్చు తదితరాల గురించి తెలుసుకుందాం..!.
ఇంతకుమునుపు వరకు అమెరికాలో చదువుకోవాలనుకునే చాలామంది భారతీయ విద్యార్థులు బ్యాంకు రుణం తీసుకునేవారు. ఆ తర్వాత జీవన ఖర్చులను భరించడానికి పార్ట్‌టైమ్‌గా పనిచేయడం, ఏదోలా ఉద్యోగం పొందడం, H-1B వీసా పొందడం వంటివి చేసేవారు. ఇక ఆ తర్వాత తమ విద్యా రుణాన్ని తిరిగి చెల్లించి అక్కడే స్థిరపడేలా ప్లాన్ చేసుకునేవారు. అయితే ఇదంతా చూడటానికి చాలా సింపుల్‌గా కనిపించినా..అందుకోసం మనవాళ్లు చాలా సవాళ్లనే ఎదుర్కొంటారు.
అది కాస్తా ఇప్పుడు ట్రంప్ పుణ్యమా అని మరింత కఠినంగా మారిపోయింది. అసలు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు తమ పరిస్థితి ఏంటో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అగ్రరాజ్యంలో చదువుకోవడానికి వచ్చిన చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు అప్పు సొప్పు చేసి పంపిస్తే వచ్చినవారే. వారంతా తమ ఖర్చులు కోసం తామే చిన్న చితకా ఉద్యోగాలు చేసి చదుకోవాల్సిందే.
ఇప్పుడేమో ట్రంప్ తీసుకొచ్చిన ఇమ్మిగ్రేషన్ పాలసీ ప్రకారం ..చదువుకునే విదేశీ విద్యార్థులంతా పని నిబంధనలు పాటించాల్సిన పరిస్థితి. పైగా స్టూడెంట్ వీసాలు కఠినమైన పరిమితుల కిందకు వచ్చాయి. ఇంతకుమునుపు ఎఫ్1 వీసా ఉన్నవారు సాధారణంగా విద్యా నిబంధనల సమయంలో వారానికి 20 గంటలు, సెలవులు, విరామ సమయాల్లో వారానికి 40 గంటల వరకు పని చేయడానికి అనుమతి ఉండేది.
కానీ ఇప్పుడు ట్రంప్ కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధన ప్రకారం..పరిమితలుకు మించి పనిచేయడం లేదా క్యాంపస్ వెలుపల అనధికార ఉపాధి చేపడితే విద్యార్థి హోదాను కోల్పోవడం తోపాటు బహిష్కరణకు గురయ్యే ప్రమాదం వంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. అలాంటప్పుడు..
సజావుగా స్టడీస్ పూర్తి చేయాలంటే..
విద్యార్థులు అమెరికాలో తమ స్టడీస్ జర్నీని పూర్తి చేయాలనుకుంటే..తమ వీసా స్థితికి సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. విద్య నాణ్యత, కెరీర్ అవకాశాలు పుష్కలంగా ఉండే టైర్ 1 లేదా టైర్ 2 లాంటి విద్యా సంస్థలలో చదువుకునేలా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఇక ట్యూషన్ ఖర్చులు విషయమై ఆందోళన చెందకుండా క్యాంపస్‌లోనే ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తే ఎలాంటి సమస్య ఎదురవ్వదు.
ఎందుకంటే చదువుకు సంబంధంలేని ఉపాధి చేయడానికి లేదనే నిబంధన ఉంది కాబట్టి వీసా నిబంధనను ఉల్లంఘించకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేయపోవడమే మంచిది. అలాగే విద్యార్థులు తమ విద్యా సంస్థలోని అంతర్జాతీయ విద్యార్థి కార్యాలయాన్ని సంప్రదించడం లేదా సందేహం వచ్చినప్పుడు న్యాయ సలహ తీసుకోవడం వంటివి చేస్తే.. వీసా సంబంధిత కఠిన సమస్యలను సులభంగా ఎదుర్కొనగలుగుతారు.
అలాగే అక్కడ వసతికి సంబంధించిన అంతరాయలను కూడా సులభంగా నివారించుకోగలుగుతారు. కఠినతరమైన సమస్యలు, ఆంక్షలు అటెన్షన్‌తో ఉండి, నేర్పుగా పని చక్కబెట్టుకోవడం ఎలాగో నేర్పిస్తాయే గానీ భయాందోళనలతో బిక్కుబిక్కుమని గడపటం కాదని నిపుణులు చెబుతున్నారు.
-చిట్వేల్ వేణు
గమనిక: భారతీయులతోపాటు, అమెరికాలో ఉంటున్న ప్రపంచ దేశాల పౌరులకు జన్మతః పౌరసత్వం దక్కే విధానాన్ని నూతన అధ్యక్షుడు డొనాల్డ్ రద్దు చేశారు. అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్టించిన వెంటనే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారాయన. ట్రంప్ షాకింగ్ నిర్ణయాలు ఎన్నారైలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? ఇమ్మిగ్రేషన్‌లో ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశముంది? ఎన్నారైలూ.. అభిప్రాయాలను సాక్షి ఎన్‌ఆర్‌ఐలో షేర్ చేసుకోండి. తెలుగు లేదా ఇంగ్లీషులో మాకు రాసి మీ ఫొటోతో nri@sakshi.comకు పంపించండి.
(చదవండి: ట్రంప్ పాలసీ.. భారతీయ అమెరికన్లకు మేలు కూడా!
Comments
Please login to add a commentAdd a comment