
నైపుణ్యం లేనివాళ్లను ఎవరూ రక్షించలేరు
స్కిల్స్ లేకుండా అమెరికా వచ్చేవారికే సమస్య
ఇండియాలోనే ఉద్యోగం రానివారికి ఇక్కడెలా వస్తుంది?
భారత విద్యార్థులకు అమెరికా యువత పోటీయే కాదు
వ్యవసాయ కూలి పనికి కూడా సిద్ధపడటమే సమస్య
కొన్ని అమెరికా వర్సిటీలతో కన్సల్టెన్సీలు కుమ్మక్కు
మాయ మాటలతో విద్యార్థులను మోసం చేస్తున్నాయి
డేటా సైంటిస్ట్, గెస్ట్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి అమెరికా నుంచి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ
ఇప్పుడు ఏటా 3.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు.వీళ్లల్లో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదివేవాళ్లు చాలా తక్కువ. ఇండియాలో ఏ ఉద్యోగం రాని వాళ్లు, నాణ్యతలేని కాలేజీల్లో నైపుణ్యం లేకుండా ఇంజనీరింగ్ చేసినవాళ్లే వస్తున్నారు. ఇండియాలోనే ఉద్యోగం రానప్పుడు అమెరికాలో ఎలా వస్తుంది?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులు, విద్యార్థులకు గడ్డుకాలం మొదలైందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరిమేస్తున్న ట్రంప్ యంత్రాంగం.. విదేశీ విద్యార్థులపై కఠిన ఆంక్షలు పెడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వృత్తి నిపుణులకు అమెరికా ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుందని, నైపుణ్యం లేనివారు ఏ దేశంలోనూ ముందుకెళ్లలేరని చెబుతున్నారు అమెరికాలో 30 ఏళ్లుగా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రవాసాంధ్రుడు వెంకట్ ఇక్కుర్తి (Venkat Ikkurthy).
నైపుణ్యం ఉన్న ఎవరినీ ట్రంప్ కాదుకదా.. ఎవ్వరూ అడ్డుకోలేరని, నైపుణ్యం లేనివారిని ఎవ్వరూ రక్షించలేరని చెబుతున్నారాయన. గుంటూరు జిల్లాకు చెందిన వెంకట్‌కు డేటా సైంటిస్టుగా, అమెరికన్ యూనివర్సిటీల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా 30 ఏళ్ల అనుభవం ఉంది. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక అమెరికాలో తాజా పరిస్థితి, భారత విద్యార్థుల స్థితిగతుపై ‘జూమ్ ఇన్’లో ‘సాక్షి’ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ట్రంప్ కొత్తగా తీసుకున్న నిర్ణయాలేమీ లేవు. అమెరికన్ చట్టాలనే కఠినంగా అమలు చేస్తున్నారు. తన దేశానికి మేలు చేయాలన్నదే ఆయన ఆలోచన. టారిఫ్‌లు వేయడం సర్వ సాధారణ విషయమే. కాకపోతే దీన్ని ప్రతీకార చర్యగా భావిస్తున్నారు.
భారత విద్యార్థులను అక్కడ వేధిస్తున్నారా?
భారత్ నుంచి అమెరికాకు ఏటా 3.42 లక్షల మంది చదువుకోవడానికి వస్తున్నారు. ఇందులో సగం మంది తెలుగు విద్యార్థులే. భారత విద్యార్థులంతా తెలివైన వాళ్లే. కాకపోతే నిబంధనలు వదిలేస్తారు. ఇప్పుడదే సమస్యగా మారింది. నిజానికి అమెరికావాళ్లు భారత పౌరులను గౌరవిస్తారు. గోల్డెన్ హ్యాండ్స్ (Golden Hands) అంటారు. అలాంటి వాళ్లు విద్యార్థులను ఎందుకు వేధిస్తారు. యూనివర్సిటీల్లో పార్ట్‌టైం జాబ్ చేసే ఎవరినీ ఏమీ అనడం లేదు. అడ్డదారిలో మాల్స్, హోటల్స్, ఇళ్లల్లో పనిచేయడాన్ని అడ్డుకుంటున్నారు. అమెరికాకు వచ్చేది దీని కోసమా?
అసలు సమస్య ఏంటి?
2016లో అమెరికాకు వచ్చిన భారతీయులు (Indians) 40 వేలకు మించి లేరు. వీళ్లతా ఐఐటీ, ఎన్‌ఐటీ, పేరున్న వర్సిటీల్లో చదివిన వాళ్లే. ఎంఎస్ పూర్తయిన తర్వాత వాళ్లల్లో సగం మందిని అమెరికా మంచి ఉద్యోగాలిచ్చి ఉంచేసుకుంది. ఇప్పుడు వీళ్లే అమెరికాకు గొప్ప ఆస్తి. నైపుణ్యం ఉన్న విద్యార్థులను అమెరికా ఎప్పుడూ వదులుకోదు. కానీ ఇప్పుడు ఏటా 3.40 లక్షల మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు. వీళ్లల్లో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదివేవాళ్లు చాలా తక్కువ.
ఇండియాలో ఏ ఉద్యోగం రాని వాళ్లు, నాణ్యతలేని కాలేజీల్లో నైపుణ్యం లేకుండా ఇంజనీరింగ్ చేసినవాళ్లే వస్తున్నారు. ఇండియాలోనే ఉద్యోగం రానప్పుడు అమెరికాలో ఎలా వస్తుంది? ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థులకే 295 జీఆర్‌ఈ స్కోర్ వస్తోంది. కానీ వీళ్లు 325 స్కోర్ తెచ్చుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం? కన్సల్టెన్సీలు తప్పుడు మార్గంలో జీఆర్‌ఈ రాయిస్తున్నాయి. వీటిని అమెరికా అధికారులు గుర్తించలేరా? మెక్సికో లాంటి ప్రాంతాల నుంచి లేబర్ వీసాలపై వచ్చే నల్ల జాతీయుల ఉద్యోగాలు కూడా మనవాళ్లు చేస్తామని ముందుకొస్తున్నారు. కాల్పుల ఘటనలకు ఇవే ప్రధాన కారణాలవుతున్నాయి.
అమెరికా విద్యలో నాణ్యత ఉందా?
అమెరికాలో 25 వేల విశ్వవిద్యాలయాలున్నాయి. దాదాపు ఇవన్నీ ప్రైవేటువే. వీటిల్లో నాణ్యత ఉన్నవి కొన్నే. మిగతా వర్సిటీలు కన్సల్టెన్సీల ద్వారా విద్యార్థులను మభ్యపెట్టి చేర్చుకుంటున్నాయి. కొన్ని వర్సిటీలు ఫీజుల్లో 40 శాతం కన్సల్టెన్సీలకు ఇస్తున్నాయి. దీంతో కన్సల్టెన్సీలు విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఈ వర్సిటీలు విద్యార్థులు చదివినా చదవకపోయినా డిగ్రీలు ఇస్తున్నాయి. అమెరికాలో ఉండే ఒక వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్లు 26 చోట్ల వాడారు. దీన్ని అమెరికా అధికారులు ప్రశ్నించారు.
తన బంధువు కోసం ఇచ్చిన డాక్యుమెంట్లను కన్సల్టెన్సీలు ఇలా దుర్వినియోగం చేశాయి. నాణ్యత లేని వర్సిటీల్లో నెలకు ఒక క్లాస్ జరుగుతోంది. మిగతా రోజుల్లో మనవాళ్లు చట్ట విరుద్ధంగా డబ్బుల కోసం పని చేస్తున్నారు. ఒక హోటల్‌లో గంటలకొద్దీ పనిచేసే విద్యార్థి ఎంఎస్ ఎలా చదువుతాడు? అతడికి నైపుణ్యం ఎందుకు ఉంటుంది? అమెరికాలో ఉద్యోగం ఎందుకు వస్తుంది?
అమెరికన్లు పనిచేయరు.. భారతీయులను ట్రంప్ అడ్డుకుంటున్నారు.. ఎలా?
నిజమే.. అమెరికన్లు రెస్టారెంట్లు, ఇళ్లలో పనిచేయరు. భారతీయులూ అలా చేయరనేది అమెరికన్ల నమ్మకం. అందుకే మెక్సికన్లకు ఈవీ–1 వీసా (అగ్రికల్చర్ లేబర్) ఇస్తారు. ఆ జాబితాలో భారత్ లేనేలేదు. అలాంటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయడం మంచిదేనా? కరోనా తర్వాత యాంత్రీకరణ పెరిగింది. దీంతో హోటళ్లు, పెట్రోల్ బంకులు సహా అన్నింటిలోనూ రోబోలు వస్తున్నాయి. ముందుముందు మనవాళ్లు పోటీపడే పార్ట్‌టైం ఉద్యోగాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే స్కిల్ ఉద్యోగాలు కూడా కష్టమే.
ఇప్పుడు ఉద్యోగాల మాటేమిటి?
నైపుణ్యం ఉన్నవాళ్లను ఎవరూ అడ్డుకోలేరు. అది లేనివాళ్లను ఎవరూ రక్షించలేరు. 2016కు ముందు వచ్చిన భారతీయుల పిల్లలకు ఇక్కడ పౌరసత్వం వచ్చింది. వాళ్లిప్పుడు ఉద్యోగాల వేటలో ఉన్నారు. కొత్తగా ఇండియా నుంచి వచ్చే పిల్లలకు అమెరికన్లు పోటీనే కాదు. పౌరసత్వం పొందిన భారత సంతతికి చెందిన వాళ్లే పోటీ. కాబట్టి నైపుణ్యం లేకుండా, డబ్బు సంపాదనే ధ్యేయంగా అమెరికా వస్తే ఇబ్బంది పడతారు. అమెరికా (America) వచ్చే ముందు ఒక్కసారి మీ నైపుణ్యం ఏమిటో? దేనికి సరిపోతారో బేరీజు వేసుకోండి. నైపుణ్యం పెరగాలంటే ముందుగా భారత విద్యా విధానంలో మార్పులు తేవాలి. ఇది అభివృద్ధి చెందిన దేశాల అవసరాలు తీర్చేలా లేదు.
ఇంటర్వ్యూ: వనం దుర్గాప్రసాద్