లండన్ : బ్రిటన్ మాజీ ప్రధాని పుట్టిన ప్రదేశం, ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని ప్రఖ్యాత బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియంలో భారీ దొంగతనం జరిగింది. ప్రసిద్ధ ఇటాలియన్ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలాన్ 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన టాయ్‌లెట్‌ను దుండగులు మాయం చేశారు. భారీ భద్రతతో కూడిన బ్లెన్హేమ్ ప్యాలెస్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ దొంగతనం జరిగినట్టు తెలిసింది. భారీ సంఖ్యలో సందర్శకులు రావడంతోనే ఈ దోపిడీకి ఆస్కారం ఏర్పడిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. ‘గెలుపు ఒక ఎంపిక కాదు’ అనే టైటిల్‌తో రూపొందించిన ఈ టాయ్‌లెట్‌ను సందర్శనార్థం చర్చిల్ జన్మించిన పక్క గదిలోనే ఏర్పాటు చేశారు. గురువారం నుంచే ఈ టాయ్‌లెట్‌ను సందర్శనకు పెట్టారు. అంతలోనే దోపిడీకి గురైంది.
మౌరిజియో కాటెలాన్ తయారు చేసిన బంగారు టాయ్‌లెట్ దొంగతనానికి గురైనట్టు శనివారం ఉదయం సమాచారం అందిందని థేమ్స్ వాలీ పోలీసులు వెల్లడించారు. ఘటనతో ప్రమేమున్నట్టు భావిస్తున్న ఓ 66 ఏళ్ల వృద్ధురాలిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇక ఇంత ప్రతిష్టాత్మక, విలువ గల టాయ్‌లెట్ పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని, భారీ సంఖ్యలో జనాన్ని అనుమతించడం వల్ల దాని ఆర్ట్‌వర్క్ దెబ్బతింటుందని డిటెక్టివ్ ఇన్స్‌పెక్టర్ జెస్ మిల్నేఅన్నారు. నిందితులు రెండు వాహనాల్లో వచ్చినట్టు ప్రాథమికంగా నిర్ధారించామని తెలిపారు.
కాగా, శుక్రవారం అర్ధరాత్రి ఈ దోపిడీ జరిగినట్టు బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియం నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. థేమ్స్ వాలీ పోలీసులతో కలిసి నిందితులను పట్టుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సందర్శకులతో ఎప్పుడూ బిజీబిజీగా ఉండే యునెస్కో గుర్తింపు పొందిన బ్లెన్హేమ్ ప్యాలెస్ మ్యూజియంను శనివారం మధ్యాహ్నం వరకు మూసేయించారు. ఇదిలాఉండగా.. 2016లో మౌరిజియో కాటెలాన్ బంగారు టాయ్‌లెట్ ఆర్ట్‌వర్కును న్యూయార్క్‌లోని ప్రసిద్ధ గగ్గన్హేమ్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. అయితే, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై మనసు పారేసుకున్నారు. ఈ బంగారు టాయ్‌లెట్‌ను ఇస్తే బదులుగా విన్సెంట్ వాన్‌గో 1888లో వేసిన విఖ్యాత ‘ల్యాండ్స్కేప్ విత్ స్నో’ పెయింటింగ్ ఇస్తానని ట్రంప్ చెప్పడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment