ప్రధానిగా చర్చిల్ గెలుపు
ఆ నేడు 26 అక్టోబర్, 1951
ఈ రోజున జరిగిన సాధారణ ఎన్నికలలో బ్రిటన్ ప్రధానిగా విన్‌స్టన్ చర్చిల్ ఎన్నికయ్యారు. 77ఏళ్ల చర్చిల్ బ్రిటిష్ ప్రధానిగా ఎన్నిక కావడం ఇది రెండవ సారి కాగా, ఆ పదవికి ఎన్నికయిన వయోవృద్ధులలో రెండవ స్థానంలో నిలిచి మరో రికార్డు సృష్టించారు. కన్‌సర్వేటివ్ పార్టీ గెలుపు తథ్యమని ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడో ప్రకటించినప్పటికీ, మెజారిటీ మాత్రం ఊహించినంత రాలేదు. ధరల పెరుగుదల, భారీగా పెరిగిన గృహనిర్మాణ వ్యయం వంటి కారణాలతో చర్చిల్ కేవలం 17 సీట్ల స్వల్ప ఆధిక్యతతో గట్టెక్కాననిపించారు.
ప్రత్యర్థి పార్టీ అయిన లేబర్ పార్టీ చర్చిల్‌ను యుద్ధపిపాసిగా అభివర్ణించినప్పటికీ, తాను గెలిస్తే సుస్థిరమైన, బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చర్చిల్ చేసిన ఎన్నికల వాగ్దానమే ఆయన గెలుపునకు ప్రధాన కారణాలలో ఒకటని విమర్శకులంటారు. ఆ తర్వాత చర్చిల్ అనారోగ్య కారణాలతో 1955లో తన పదవికి రాజీనామా చేశారు. 1964లో తన 91వ ఏట కన్నుమూశారు.