యుద్ధమంటే విజయమో.. వీర మరణమో అన్నమాట గుర్తొస్తోంది. రెండో ప్రపంచ యుద్ధంలో అణు ఆయుధ సామగ్రితో, భారీ దళాన్ని తీసుకుని బయల్దేరిన అమెరికా యుద్ధనౌక 'యూఎస్ఎస్ ఇండియానాపొలిస్'. ప్రత్యర్థి యుద్ధనౌక వదిలిన టార్పిడో దెబ్బకు కుదేలై నీట మునిగింది. అత్యంత శక్తిమంతమైన టార్పిడో కావడంతో యుద్ధనౌక భాగాలు ముక్కలయ్యాయి. వందలాది సైనికులు నీట మునిగారు. వారందరినీ బతికుండగానే షార్క్స్ కొరుక్కుని తినేశాయి.
1945 జులై 30న జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన వీడియో తమకు లభ్యమైనట్లు అమెరికా నేవీ పేర్కొంది. ఇండియానాపొలిస్ మునిగిపోయిన తర్వాత దాని శకలాలు అంతు చిక్కని మిస్టరీగా మారాయి. అయినా పట్టువిడవని అమెరికన్ నేవీ అప్పటి నుంచి ప్రయత్నాలు సాగిస్తూ.. పసిఫిక్ మహా సముద్రంలోని ఓ ప్రదేశంలో మూడున్నర మైళ్ల లోతులో యుద్ధనౌక శకలాలను గుర్తించింది.
యుద్ధనౌక మునిగినా అందులో రికార్డింగ్ కోసం ఉంచిన వీడియో కెమెరా మాత్రం పని చేస్తూనే ఉంది. 1,200 మంది సైనికులు సముద్రంలో మునిపోగానే.. అక్కడ ఉండే షార్క్స్ ఒక్కసారిగా వారిపై దాడి చేసినట్లు వీడియోలో తెలుస్తోంది. బతికుండగానే వారి శరీరాలను షార్క్స్ చీలుస్తున్న దృశ్యాలు తమకు దొరికినట్లు అమెరికన్ నేవీ చెప్పింది. అయితే, పసిఫిక్ మహా సముద్రంలో కచ్చితంగా ఏ ప్రాంతంలో ఇండియానాపొలిస్ లభ్యమయ్యాయన్న విషయాన్ని మాత్రం నేవీ రహస్యంగా ఉంచింది.
కాగా, ఈ దుర్ఘటన గురించి ప్రాణాలతో బయటపడిన ఓ నేవీ సైలర్ మాట్లాడుతూ.. అప్పటికే మరణించిన వారి రక్తం నీటిలో కలవడంతో షార్క్స్ కు పిచ్చెక్కినట్లు అయిందని చెప్పారు. పెద్ద షార్క్స్ గుంపు తమపై దాడి చేసిందని తెలిపారు. కళ్ల ముందే తన స్నేహితులను షార్క్స్ చంపేస్తున్నా వారిని కాపాడలేకపోయానని కంటతడి పెట్టుకున్నారు. సైనికులు ప్రాణాలు విడుస్తున్న వీడియో దొరకడం వారి కుటుంబ సభ్యులకు మళ్లీ బాధను కలుగుజేస్తుందని అన్నారు.