ముస్సోలిని ఇక్కడే దాక్కోవాలనుకున్నాడు!
చరిత్ర
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇటాలియన్ నియంత ముస్సోలి నిర్మించిన రహస్య బంకరును తొలిసారిగా ప్రజల సందర్శనకు అవకాశం కల్పిస్తుంది ఇటలీ ప్రభుత్వం. ఇటలీలోని ‘విల్ల తొర్లోనియ’ పార్క్ ప్రస్తుతం విందు, వినోదాలు, కాలక్షేపాలకు ప్రసిద్ధి చెంది ఉండొచ్చుగానీ దానికున్న చరిత్ర తక్కువేమీ కాదు. ఒకప్పుడు ఈ ప్రదేశంలో ముస్సోలిని తన భార్యాపిల్లలతో కలిసి జీవించాడు.
వైమానిక, విషయ వాయువుల దాడుల నుంచి తనను, కుటుంబాన్ని రక్షించుకోవడానికి అండర్ గ్రౌండ్ ఛాంబర్‌ను నిర్మించాడు. అత్యంత రహస్యంగా నిర్మించిన ఈ యాంటి-గ్యాస్ ఛాంబర్‌లో ఎనిమిది గదులు, మెట్లు ఉన్నాయి. గ్యాస్‌మాస్క్‌లు, హెల్మెట్‌లు ఎప్పుడూ బంకర్‌లో సిద్ధంగా ఉండేవి. పదిహేనుమంది వరకు దీనిలో తలదాచుకోవచ్చు.బంకర్ నుంచి తప్పించుకోవడానికి రెండు మార్గాలు(ఎస్కేప్ రూట్స్) ఉన్నాయి. ‘‘బాంబులు నా బాల్కనీలో పడినా నేను బెదిరేది లేదు. బంకర్‌లో దాక్కొనేది లేదు’ అనేవాడట ముస్సోలిని.
‘‘నిజానికి బంకర్‌లు నిర్మించడానికి, అందులో తలదాచుకోవడానికి ముస్సోలిని వ్యతిరేకం. ఒకరిని చూసి ఒకరు బంకర్లు నిర్మించుకుంటున్న కాలంలో కూడా ఎప్పుడూ ఆ పని చేయలేదు. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది అనుకున్న అనివార్య పరిస్థితిలో మాత్రమే బంకర్ నిర్మించుకున్నాడు’’ అంటున్నాడు లారా లొంబర్డీ అనే చరిత్రకారుడు. ప్రత్యేక పరిస్థితులలో, ప్రత్యేక శ్రద్ధతో ముస్సోలిని ఈ బంకర్‌ని నిర్మించినప్పటికీ అందులో ఎప్పుడూ ఉండలేదు. పనిలో పురోగతి గురించి మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు. గత సంవత్సరం ఈ బంకర్ తాలూకు ఫొటోలను తొలిసారిగా విడుదల చేశారు. 2011 వరకు గానీ దీన్ని కనుగొనలేదు.
‘‘చిన్న చిన్న మరమ్మతులు మినహా బంకర్ ఇప్పటికీ చెక్క చెదరకుండా ఉంది. కితాబు ఇవ్వాల్సిన రహస్య ప్రదేశం ఇది’’ అంటున్నాడు క్లారో సెరఫిని అనే ఆర్కిటెక్ట్.