Noor Inayat Khan: స్పై ప్రిన్సెస్‌ | British Indian spy Noor Inayat Khan story hits London stage | Sakshi
Sakshi News home page

Noor Inayat Khan: స్పై ప్రిన్సెస్‌

Published Thu, Nov 17 2022 12:32 AM | Last Updated on Thu, Nov 17 2022 12:32 AM

British Indian spy Noor Inayat Khan story hits London stage - Sakshi

నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌

కలం పట్టి కవితలు రాసిన అమ్మాయి రణక్షేత్రంలోకి అడుగుపెట్టింది. పియానోతో సుస్వరాలు వినిపించిన అమ్మాయి ఫిరంగి ధ్వనులు వినిపించే చోట పనిచేసింది. నూర్‌ ఇనాయత్‌ఖాన్‌ అనేది నామం కాదు నాజీలను వణికించిన శబ్దం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్‌–ఇండియా తొలి మహిళా గూఢచారి నూర్‌ గురించి...

నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌ అనే పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె గురించి ఈ తరానికి తెలియజేయడానికి నాటక రూపంలో ఒక ప్రయత్నం జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్‌ ఇండియా తరఫున నియామకం అయిన తొలి మహిళా గూఢచారి నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌. ఆమె సాహసిక జీవితంపై రూపొందించిన ‘నూర్‌’ నాటకాన్ని ఈ నెలలో లండన్‌లోని సౌత్‌వార్క్‌ ప్లే హౌజ్‌లో  ప్రదర్శించబోతున్నారు.

‘ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయా అని ఆశ్చర్యపోయేంత జీవితం ఆమెది’ అంటారు ‘నూర్‌’ నాటక రచయిత్రి అజ్మా దార్‌.

నూర్‌ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే....
తండ్రి పేరు ఇనాయత్‌ఖాన్‌. బాంబే ప్రెసిడెన్సీలో జన్మించాడు. పూర్వీకులు టిప్పు సుల్తాన్‌ వంశస్థులు. ఇనాయత్‌ఖాన్‌ సూఫీ గురువు. సంగీతకారుడు. ‘ది సూఫీ ఆర్డర్‌ ఇన్‌ ది వెస్ట్‌’ అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా సూఫీ భావజాలాన్ని పాశ్చాత్య సమాజానికి పరిచయం చేశాడు. నూర్‌ తల్లి అమెరికన్‌. రే బేకర్‌ అనే ఆమె పేరు పెళ్లి తరువాత అమీనా బేగంగా మారింది.

చిన్న వయసులోనే రచయిత్రిగా తన కెరీర్‌ మొదలుపెట్టింది నూర్‌. ఇంగ్లీష్, ఫ్రెంచ్‌ భాషల్లో కవిత్వంతోబాటు, పిల్లల కథల పుస్తకాలను ప్రచురించింది. బుద్దిస్ట్‌ జాతక కథల స్ఫూర్తితో ‘ట్వంటీ జాతక టేల్స్‌’ అనే పుస్తకాన్ని రాసింది. పిల్లల పత్రికలకు రెగ్యులర్‌గా రచనలు చేస్తుండేది. ఫ్రెంచ్‌ రేడియో కోసం రచనలు చేసేది.
‘చైల్డ్‌ సైకాలజీ’ చదువుకున్న నూర్‌ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. పియానో అద్భుతంగా వాయించేది.
రెండో ప్రపంచ యుద్ధం నాటి కల్లోల కాలం అది.
ఎటు చూసినా భయం రాజ్యమేలుతున్న ఆ కాలంలో కుటుంబాన్ని తీసుకొని ఇంగ్లాండ్‌కు వెళ్లాడు ఇనాయత్‌ఖాన్‌. మొదట పోర్ట్‌ సిటీ సౌత్‌ హాంప్టన్‌లో ఒక తత్వవేత్త దగ్గర ఆశ్రయం పొందారు.

తండ్రి చనిపోయే నాటికి నూర్‌ వయసు పదమూడు సంవత్సరాలు. సున్నిత స్వభావి. కొత్త వాళ్ల దగ్గరికి వెళ్లేది కాదు. చాలా తక్కువగా మాట్లాడేది. అలాంటి నూర్‌లో అనూహ్యంగా మార్పు వచ్చింది. తల్లి తరువాత ఇంటికి తానే పెద్ద. ఒకవిధంగా చెప్పాలంటే చిన్న వయసులోనే తన కుటుంబానికి పెద్ద అండగా నిలబడింది.
కుమార్తెలో వచ్చిన మార్పు చూసి తల్లి ఆశ్చర్యపోయేది!
నవంబర్, 1940లో ఉమెన్స్‌ ఆగ్జిలరీ ఎయిర్‌ ఫోర్స్‌ (డబ్ల్యూ ఎఎఎఫ్‌)లో చేరి వైర్‌లెస్‌ ఆపరేటర్‌గా శిక్షణ పొందింది. ఆ తరువాత ‘బాంబర్‌ ట్రైనింగ్‌ స్కూల్‌’లో చేరింది. సీక్రెట్‌ బ్రిటిష్‌ వరల్డ్‌ వార్‌–2 ఆర్గనైజేషన్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎస్‌వోయి)లో నియామకం అయింది. ప్రత్యేక శిక్షణ తీసుకొని నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో అండర్‌ కవర్‌ వైర్‌లెస్‌ ఆపరేటర్‌గా పనిచేసింది. ఈ విధులు నిర్వహించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది.

నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో వైర్‌లెస్‌ ఆపరేటర్‌గా పని చేయడం అంటే చావుకు చాలా సమీపానికి వెళ్లడం. ఒళ్లు జలదరించే ఎన్నో భయానక అనుభవాలు కళ్ల ముందున్నాయి. అయినా భయపడింది లేదు.
దురదృష్టకరమైన పరిస్థితులలో నాజీలకు చిక్కి, కాన్సంట్రేషన్‌ క్యాంపుల్లో చిత్రహింసలకు గురై చనిపోయింది.
ధైర్యసాహసాలకు ఇచ్చే జార్జ్‌ క్రాస్‌ పురస్కారాన్ని నూర్‌ మరణానంతరం బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రకటించింది.

శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది? ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది?...
 ఇలాంటి సందేహాలకు ‘స్పై ప్రిన్సెన్స్‌–ది లైఫ్‌ ఆఫ్‌ నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌’లాంటి రచనలు సవివరంగా సమాధానాలు ఇచ్చాయి. ఈ క్రమంలో తాజా నాటకం ‘నూర్‌’ అనేది  మరో ముందడుగుగా చెప్పుకోవచ్చు.
 
శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది?
ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది?

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement