Noor
-
అనుమానాస్పద రీతిలో నటి మృతి.. పట్టించుకోని కుటుంబ సభ్యులు
ప్రముఖ యువ నటి నూర్ మాళబిక (32) అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. ముంబయిలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్న ఈమె ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ప్రాణాలు వదిలేసింది. అయితే నూర్ బాడీ కుళ్లిన స్థితిలో ఉన్నప్పుడు స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నూర్ కుటుంబ సభ్యులు కనీసం ఈమెని చూడటానికి కూడా రాలేదు. ఇప్పుడిదే పలు అనుమానాలకు తావిస్తోంది.అసోంకి చెందిన నూర్ మాళవిక.. ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో పలు అడల్ట్ సిరీస్, సినిమాల్లో నటించింది. కానీ గతేడాది 'ద ట్రయల్' వెబ్ సిరీసులో నటించి మంచిగానే గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)ఏమైందో ఏమో మరి ముంబయిలోని ఈమె ఉంటున్న ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. కానీ ఈమె బాడీ నుంచి దుర్వాసన రావడంతో అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారమిచ్చారు. వాళ్లు శవాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఇది ఆత్మహత్య అని అనుమానపడుతున్నారు.నూర్ చనిపోవడానికి రెండు వారాల ముందే కుటుంబ సభ్యులు.. ముంబయిలోని ఈమె ఇంటికి వచ్చి వెళ్లారు. ఇప్పుడు ఈమె చనిపోయిన తర్వాత పోలీసులు వాళ్లకు ఫోన్ చేసి బాడీని తీసుకెళ్లమని చెబితే పట్టించుకోలేదు. దీంతో ఓ ఎన్జీవో ఆధ్వర్యంలో ఈమె అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులతో గొడవ పడిన తర్వాతే నూర్ చనిపోవడం కాస్త డౌట్ అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం) -
Noor Inayat Khan: స్పై ప్రిన్సెస్
కలం పట్టి కవితలు రాసిన అమ్మాయి రణక్షేత్రంలోకి అడుగుపెట్టింది. పియానోతో సుస్వరాలు వినిపించిన అమ్మాయి ఫిరంగి ధ్వనులు వినిపించే చోట పనిచేసింది. నూర్ ఇనాయత్‌ఖాన్ అనేది నామం కాదు నాజీలను వణికించిన శబ్దం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్–ఇండియా తొలి మహిళా గూఢచారి నూర్ గురించి... నూర్ ఇనాయత్ ఖాన్ అనే పేరు చాలామందికి తెలియకపోవచ్చు. ఆమె గురించి ఈ తరానికి తెలియజేయడానికి నాటక రూపంలో ఒక ప్రయత్నం జరుగుతోంది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ ఇండియా తరఫున నియామకం అయిన తొలి మహిళా గూఢచారి నూర్ ఇనాయత్ ఖాన్. ఆమె సాహసిక జీవితంపై రూపొందించిన ‘నూర్’ నాటకాన్ని ఈ నెలలో లండన్‌లోని సౌత్‌వార్క్ ప్లే హౌజ్‌లో ప్రదర్శించబోతున్నారు. ‘ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని మలుపులు ఉంటాయా అని ఆశ్చర్యపోయేంత జీవితం ఆమెది’ అంటారు ‘నూర్’ నాటక రచయిత్రి అజ్మా దార్. నూర్ వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే.... తండ్రి పేరు ఇనాయత్‌ఖాన్. బాంబే ప్రెసిడెన్సీలో జన్మించాడు. పూర్వీకులు టిప్పు సుల్తాన్ వంశస్థులు. ఇనాయత్‌ఖాన్ సూఫీ గురువు. సంగీతకారుడు. ‘ది సూఫీ ఆర్డర్ ఇన్ ది వెస్ట్’ అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా సూఫీ భావజాలాన్ని పాశ్చాత్య సమాజానికి పరిచయం చేశాడు. నూర్ తల్లి అమెరికన్. రే బేకర్ అనే ఆమె పేరు పెళ్లి తరువాత అమీనా బేగంగా మారింది. చిన్న వయసులోనే రచయిత్రిగా తన కెరీర్ మొదలుపెట్టింది నూర్. ఇంగ్లీష్, ఫ్రెంచ్ భాషల్లో కవిత్వంతోబాటు, పిల్లల కథల పుస్తకాలను ప్రచురించింది. బుద్దిస్ట్ జాతక కథల స్ఫూర్తితో ‘ట్వంటీ జాతక టేల్స్’ అనే పుస్తకాన్ని రాసింది. పిల్లల పత్రికలకు రెగ్యులర్‌గా రచనలు చేస్తుండేది. ఫ్రెంచ్ రేడియో కోసం రచనలు చేసేది. ‘చైల్డ్ సైకాలజీ’ చదువుకున్న నూర్ సంగీతంలో ప్రావీణ్యం సంపాదించింది. పియానో అద్భుతంగా వాయించేది. రెండో ప్రపంచ యుద్ధం నాటి కల్లోల కాలం అది. ఎటు చూసినా భయం రాజ్యమేలుతున్న ఆ కాలంలో కుటుంబాన్ని తీసుకొని ఇంగ్లాండ్‌కు వెళ్లాడు ఇనాయత్‌ఖాన్. మొదట పోర్ట్ సిటీ సౌత్ హాంప్టన్లో ఒక తత్వవేత్త దగ్గర ఆశ్రయం పొందారు. తండ్రి చనిపోయే నాటికి నూర్ వయసు పదమూడు సంవత్సరాలు. సున్నిత స్వభావి. కొత్త వాళ్ల దగ్గరికి వెళ్లేది కాదు. చాలా తక్కువగా మాట్లాడేది. అలాంటి నూర్లో అనూహ్యంగా మార్పు వచ్చింది. తల్లి తరువాత ఇంటికి తానే పెద్ద. ఒకవిధంగా చెప్పాలంటే చిన్న వయసులోనే తన కుటుంబానికి పెద్ద అండగా నిలబడింది. కుమార్తెలో వచ్చిన మార్పు చూసి తల్లి ఆశ్చర్యపోయేది! నవంబర్, 1940లో ఉమెన్స్ ఆగ్జిలరీ ఎయిర్ ఫోర్స్ (డబ్ల్యూ ఎఎఎఫ్)లో చేరి వైర్లెస్ ఆపరేటర్‌గా శిక్షణ పొందింది. ఆ తరువాత ‘బాంబర్ ట్రైనింగ్ స్కూల్’లో చేరింది. సీక్రెట్ బ్రిటిష్ వరల్డ్ వార్–2 ఆర్గనైజేషన్ స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్వోయి)లో నియామకం అయింది. ప్రత్యేక శిక్షణ తీసుకొని నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో అండర్ కవర్ వైర్లెస్ ఆపరేటర్‌గా పనిచేసింది. ఈ విధులు నిర్వహించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది. నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌లో వైర్లెస్ ఆపరేటర్‌గా పని చేయడం అంటే చావుకు చాలా సమీపానికి వెళ్లడం. ఒళ్లు జలదరించే ఎన్నో భయానక అనుభవాలు కళ్ల ముందున్నాయి. అయినా భయపడింది లేదు. దురదృష్టకరమైన పరిస్థితులలో నాజీలకు చిక్కి, కాన్సంట్రేషన్ క్యాంపుల్లో చిత్రహింసలకు గురై చనిపోయింది. ధైర్యసాహసాలకు ఇచ్చే జార్జ్ క్రాస్ పురస్కారాన్ని నూర్ మరణానంతరం బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది? ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది?... ఇలాంటి సందేహాలకు ‘స్పై ప్రిన్సెన్స్–ది లైఫ్ ఆఫ్ నూర్ ఇనాయత్ ఖాన్’లాంటి రచనలు సవివరంగా సమాధానాలు ఇచ్చాయి. ఈ క్రమంలో తాజా నాటకం ‘నూర్’ అనేది మరో ముందడుగుగా చెప్పుకోవచ్చు. శాంతివచనాలు వినపడే ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి, రచయిత్రిగా గుర్తింపు పొందిన అమ్మాయి రణక్షేత్రంలో ఎందుకు పనిచేయాలనుకుంది? రెండో ప్రపంచయుద్ధకాలంలో గూఢచారిగా ఆమె పాత్ర, ప్రాధాన్యత ఏమిటి? ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంది? ఎన్ని కష్టాలు పడింది? ఏ పరిస్థితులలో నాజీలకు చిక్కింది? ఎంత దారుణమైన చిత్రహింసలకు గురైంది? -
వెన్నులో వణుకుపుట్టించిన ఘటన.. నూర్‌పై కిరాతకం
మరో ఘోర ఘటన అంతర్జాతీయ సమాజంలో ఆడవాళ్ల భద్రత-రక్షణల మీద చర్చకు దారి తీసింది. నూర్ ముకదమ్ అనే యువతిని అతికిరాతకంగా హత్య ఘటన పాక్ అట్టుడుకిపోయేలా చేస్తోంది. పాక్ మాజీ దౌత్యవేత్త కూతురైన నూర్‌ను ఆమె స్నేహితులే క్రూరంగా హింసించి చంపారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడి మానసిక స్థితి బాగోలేదని పోలీసులు చేసిన ప్రకటనపై పెద్ద ఎత్తున్న దుమారం రేపుతోంది. #Justicefornoor హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నూర్ ముకదమ్.. పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త షౌకత్ ముకదమ్ కూతురు. గతంలో ఆయన సౌత్ కొరియా, కజకస్థాన్‌లకు రాయబారిగా పని చేశారు. ఈయన కూతురు నూర్(27).. మంగళవారం రాత్రి ఇస్లామ్‌బాద్ సెక్టార్ ఎఫ్-7/4లోని ఓ ఇంట్లో ఘోర హత్యకు గురైంది. ఆ ఇల్లు ఆమె స్నేహితుడు జహీర్ జకీర్ జాఫర్‌ది. అయితే ఈ హత్య జహీర్ చేసిందనేనని నిర్ధారించిన పోలీసులు.. శనివారం దాకా అతన్ని అరెస్ట్ చేయలేదు. అంతేకాదు అతని మానసిక స్థితి సరిగాలేదని, అతన్ని చికిత్స కోసం తరలించాలని ఇస్లామాబాద్ పోలీసులు కోర్టును ఆశ్రయించడంపై జనాల్లో ఆగ్రహావేశాలు రాజుకున్నాయి. వేల సంఖ్యలో బ్యానర్లు చేతబడ్డి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల్లో వస్తా! మంగళవారం ఉదయం బక్రీద్ కోసమని గొర్రెను కొనడానికి రావల్పిండికి వెళ్లాడు షౌకత్. ఆయన భార్య కొత్త బట్ల కోసం బయలకు వెళ్లింది. వచ్చి చూసేసరికి కూతురు ఇంట్లో లేదు. తన స్నేహితులతో బయటకు వెళ్తున్నానని, ఒకటి రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పిందామె. మంగళవారం మధ్యాహ్నం నూర్ ఫోన్ స్విచ్ఛాఫ్ రాగా.. ఆమె తన దగ్గర లేదని జకీర్ బదులిచ్చాడు. అదేరోజు రాత్రి ఆమె మృతదేహం దొరికినట్లు ఖోహ్‌సర్ పోలీసులు షౌకత్‌కు సమాచారం అందించారు. తగలబెట్టి.. గొంతు కోసి నూర్ ముకదమ్ పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. బతికుండగానే ఆమెను చిత్రవధ చేశారు. ఆమె ఒంటిపై అన్ని చోట్లా కత్తి గాట్లు పెట్టారు. సూదులతో వీపులో గుచ్చారు. జుట్టు కత్తించేశారు. ఆపై ఆమె శరీరాన్ని తగలబెట్టి.. పదునైన ఆయుధంతో పీక కోశారు. తల, మొండాన్ని వేరు చేసి.. దూరంగా పడేశారు. ఈ పైశాచిక ఘటన ఒక్కసారిగా పాక్ ఉలిక్కిపడింది. అయితే అత్యాచారానికి గురైందన్న బాధితురాలి తండ్రి షౌకత్ అనుమానాలపై డాక్టర్ల నుంచి పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. మరోవైపు ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధితురాలికి న్యాయం జరగాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో జకీర్‌ను శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. The barbaric murder of young woman, Noor, in Islamabad is yet another horrifying reminder that women have been & are brutalized & killed with impunity. This must end. We are committed to ensuring no one is above the law & culprits having influence & power cannot simply "get away" — Shireen Mazari (@ShireenMazari1) July 21, 2021 పలుకుబడితో.. ఇస్లామాబాద్‌లో ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీకి సీఈవో జకీర్ జాఫర్. అతని కొడుకే జహీర్ జకీర్ జాఫర్.. పైగా జహీర్ కొన్నాళ్లు అమెరికాలో ఉండొచ్చాడు. జహీర్ జకీర్ జాఫర్ మానసిక స్థితి బాగానే ఉందని, పోలీసులు తప్పుదోవపట్టిస్తున్నారని, రాజకీయ పలుకుబడితో బయటపడే ప్రయత్నం చేస్తున్నారని జనాలు ఆరోపిస్తున్నారు. అయితే నిందితుడు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడని, కఠినంగా శికక్షించి తీరతామని కేంద్ర మంత్రులు హామీ ఇస్తున్నారు. -
స్పై ప్రిన్సెస్.. టిప్పు సుల్తాన్ వంశస్తురాలు!
విలాసవంతమైన జీవితాన్ని కాదనుకుని దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆ మహిళ తరఫున బ్రిటన్‌లో ప్రస్తుతం ఉద్యమం నడుస్తోంది. ఆమె భారత సంతతికి చెందిన ముస్లిం మహిళ కావడం గమనార్హం. ఆమే నూరున్నిసా ఇనాయత్ ఖాన్ అలియాస్ నూర్ ఇనాయత్ ఖాన్. బ్రిటన్ చరిత్ర పుటల్లో హీరోగా పిలుచుకునే నూర్.. భారత సంతతికి చెందిన టిప్పు సుల్తాన్ వంశస్తురాలు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎనలేని సేవలందించిన ఈమె ముఖ చిత్రాన్ని బ్రిటిష్ కరెన్సీపై ముద్రించాలన్న డిమాండ్‌ను ప్రముఖులు కూడా సమర్ధిస్తున్నారు. టిప్పు సుల్తాన్ వంశం.. నూర్ ఖాన్ తల్లి అమినా బేగం అమెరికన్, తండ్రి ఇనాయత్ ఖాన్.. మైసూరు రాజు టిప్పు సుల్తాన్ కుటుంబీకుడు. 1914లో రష్యాలోని మాస్కోలో జన్మించారు. ధనికుల కుటుంబంలో పుట్టినా నూర్ విలాసాలను కాదనుకున్నారు. ఫ్రాన్స్ నాజీల వశం కావడంతో పారిస్ నుంచి బ్రిటన్‌కు వెళ్లారు. అక్కడే భావి జీవితానికి పునాది పడింది. బ్రిటన్ ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందారు. ఫ్రెంచి భాషా నైపుణ్యం కూడా ఉండటంతో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీల ఆక్రమిత ప్రాంతంలోనే పారిస్‌కీ లండన్‌కీ మధ్య రహస్యంగా స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ (ఎస్ఓఈ) రేడియో ఆపరేటర్‌గా, నర్స్‌గా పనిచేశారు. అలా 1943లో నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌కు పంపిన తొలి మహిళా స్పెషల్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ నూర్ ఖాన్(29) కావడం గమనార్హం. మాడెలీన్, నోరా బేకర్, జీన్ మేరీ రెనియర్ అనే మారుపేర్లతో పారిస్‌లో ఆమె రహస్యంగా విధులు నిర్వర్తించారు. చిట్టచివరికి నాజీ సైన్యం 1943 అక్టోబర్‌లో ఆమెను పట్టుకోగలిగింది. 1944 సెప్టెంబర్‌లో నూర్ ఖాన్ని కాన్సన్ట్రేషన్ క్యాంప్‌లోనే చిత్రహింసలు పెట్టి, నాజీలు కాల్చి చంపారు. నూర్ కోసం ఉద్యమం 2012లో బ్రిటన్ రాణి, లండన్ యూనివర్సిటీలోని స్క్వేర్ గార్డెన్స్‌లో నూర్ఖాన్ విగ్రహాన్ని ప్రతిష్టించారు. శ్రాబణి బసు అనే జర్నలిస్టు, రచయిత 2008లో ‘స్పై ప్రిన్సెస్’ పేరుతో నూర్ ఇనాయత్ ఖాన్ చరిత్రను గ్రంథస్తం చేశారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 2020లో విడుదల చేయబోయే 50 పౌండ్ల నోట్‌పై ముఖచిత్రం కోసం ప్రతిపాదనలు కోరుతూ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. స్పందించిన పలువురు ప్రముఖులు.. నూర్ ఇనాయత్ ఖాన్ చిత్రాన్ని ముద్రించాలంటూ ఉద్యమం చేపట్టారు. ఈ అరుదైన ముస్లిం మహిళ సాహసంపై అందరికీ తెలియజెప్పాల్సిన సమయం ఇదేనంటూ చరిత్రకారులు ప్రచారం చేస్తున్నారు. వారికి మంత్రులు కూడా మద్దతు తెలపడంతో ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటికే 1,500 మంది ప్రముఖుల సంతకాలను సేకరించినట్లు ఛేంజ్ డాట్ ఆర్గ్ నిర్వాహకులు తెలిపారు. వీరి ఉద్యమాలు, ప్రయత్నాలు సఫలమైతే త్వరలో ముద్రించే 50 పౌండ్ల నోటుపై భారత సంతతి మహిళ చిత్రం దర్శనమివ్వడం ఖాయం. -
షారుఖ్ నా కోసం ప్రార్థించు..
న్యూఢిల్లీ : పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రార్థించాలని షారుఖ్ ఖాన్‌ను ఆయన సోదరి నూర్ జెహాన్ కోరారు. వరుసకు షారుఖ్‌కు కజిన్ అయిన జెహాన్ పాక్‌లోని పెషావర్ నుంచి పోటీ చేయబోతున్నారు. పెషావర్‌లోని PK-77 నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధం అవుతున్నారు. షారుఖ్ తండ్రి తరఫు బంధువైన నూర్ జెహాన్ గతంలో రెండుసార్లు షారుఖ్‌ను కలిశారు. ఆమె కుటుంబం ఇప్పటికీ భారత్‌లోని బంధువులతో సత్సంబంధాలు కలిగి ఉంది. ‘మహిళల సాధికారత కోసం నేను పని చేయాలనుకుంటున్నాను. నా నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాను’ అని ఆమె తెలిపారు. ఆమె ఎన్నికల ప్రచారానికి సోదరుడు మన్సూర్ నాయకత్వం వహిస్తున్నారు. వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. బచాఖాన్గా పేరొందిన ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నేతృత్వంలో జరిగిన ఖుదై ఖిద్మాత్గర్ ఉద్యమం(ఎర్ర చొక్కా ఉద్యమం)లో జెహాన్ పూర్వీకులు పాల్గొన్నారు. -
బుక్... లక్!
‘అమ్మాయి.. నువ్వు పుస్తకాలు చదివితే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది’... నాలుగైదేళ్ల క్రితం సోనాక్షీ సిన్హాకు ఓ పెద్ద జ్యోతిష్కుడు ఇచ్చిన సలహా ఇది. వెంటనే ఈ బ్యూటీ బోల్డన్ని పుస్తకాలు కొన్నారేమో అనుకుంటున్నారా? అదేం లేదు. సోనాక్షి ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ, ఈ మధ్య ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయట. ఆ విషయం గురించి సోనాక్షీ మాట్లాడుతూ – ‘‘నేను జాతకాలను నమ్మను. ఆ జ్యోతిష్కుడు నన్ను బుక్స్ చదవమన్నా చదవలేదు. విచిత్రం ఏంటంటే.. మూడేళ్ల క్రితం నేను చేసిన ‘లుటేరా’ రచయిత ఒ. హెన్రీ రాసిన కథ ఆధారంగా తీసినది. ఈ నెలలో విడుదలకు సిద్ధమవుతున్న ‘నూర్’ సబా ఇంతియాజ్ రాసిన నవల ఆధారంగా తీసిన చిత్రం. ‘లుటేరా’ నాకు మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు మంచి విజయం సాధించింది. ‘నూర్’ ట్రైలర్, పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా కూడా హిట్టవుతుంది. ఈ ఆరేళ్లల్లో నేను 20కి పైగా సినిమాలు చేస్తే, వాటిలో ‘లుటేరా’, ‘నూర్’ నా హార్ట్‌కి బాగా దగ్గరయ్యాయి. సో.. పుస్తకాలకూ, నాకూ నిజంగానే ఏదైనా కనెక్షన్ ఉండి ఉంటుందా? ఆ జ్యోతిష్కుడు చెప్పినట్లు పుస్తకాలు నాకు కలిసొస్తాయా? ఏమో.. ఇలాంటివాటి మీద నాకు పెద్దగా నమ్మకం లేదు. ఏదో యాదృచ్ఛికంగా జరిగిందనిపిస్తోంది’’ అన్నారు. -
సల్మాన్‌ను ఆ ప్రశ్న అడుగుతా!
సల్మాన్ ఖాన్ని సోనాక్షి సిన్హా ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నారు. ఆ ప్రశ్న ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తున్నారా? మరేం లేదు. ‘మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని అడుగుతారట. అసలు సల్మాన్‌ని సోనాక్షి ఈ ప్రశ్న ఎందుకు అడగాలనుకున్నారనే విషయానికొస్తే.. ఆమె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘నూర్’. వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో సోనాక్షి సిన్హా జర్నలిస్ట్ రోల్లో యాక్ట్ చేశారు. పాకిస్తాన్ రైటర్ సబా ఇంతియాజ్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్న సోనాక్షీని.. ‘మీరే కనుక రియల్‌గా జర్నలిస్ట్ అయితే మీ నాన్నగారు శతృఘ్న సిన్హాను ఏం ప్రశ్న అడుగుతారు’ అని కొందరు జర్నలిస్టులు అడగ్గా... ‘ఖామోష్ అని మా నాన్న తిరిగి బదులు చెప్పని ప్రశ్న అడుగుతా’ అన్నారు. మరి, సల్మాన్ ఖాన్‌ను ఏ ప్రశ్న అడుగుతారని అడగ్గా.. ‘వేరే ఏం ఉంది. అందరూ అడిగేదే. మీకు తెలిసిందే. అదేనండి. సల్మాన్‌ని మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుం టారు? అని అడుగుతా’ అని సోనాక్షి సమాధానం ఇచ్చారు. మరి.. సల్మాన్‌ని సోనాక్షీ డైరెక్ట్‌గా ఈ ప్రశ్న అడిగితే ఆయన్నుంచి ఏం సమాధానం వస్తుందో? -
'ఆమె' ప్రపంచాన్ని జయించింది!
ఆమె ఇప్పుడు ప్రపంచాన్ని జయించింది. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ టెలివిజన్ సర్వీస్ తీస్తున్న డాక్యుమెంటరీకి కథగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న లింగ వివక్షపై సానుకూల మార్పులను ప్రోత్సహించే నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రానికి కథాంశమైంది. కోల్ కత్తా మురికివాడలనుంచి పుట్టిన ముత్యంలా.. అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ గా పేరు తెచ్చుకోవడమే కాక... డాక్యుమెంటరీకి ఎంపికైన ఏకైక భారతీయురాలుగా అయేషా నూర్ గుర్తింపు పొందింది. మూర్ఛరోగం, పేదరికంతో పోరాడుతూనే తన లక్ష్యాన్ని సాధించింది కోల్ కత్తా మురికి వాడకు చెందిన 19ఏళ్ళ యువతి అయేషా నూర్. తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ మరణించినా.. ఆమె వెనుకంజ వేయలేదు. తన కరాటే కోచ్ ప్రోత్సాహంతో ప్రపంచ ప్రఖ్యాత బ్లాక్ బెల్ట్ ను సాధించింది. ఐదు దేశాలకు చెందిన ఐదుగురు యువతుల వ్యక్తిగత గాధలను ఐటీవీ సర్వీసెస్ తెరకెక్కించింది. ఐదుగురి కథాంశం ఒకేలా ఉన్నా... ఒక్కో యువతీ ఇతర యువతులకు ఒక్కో రకంగా సహాయం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అంటారు నెదర్లాండ్ కు చెందిన చిత్ర నిర్మాత కోయెన్ సూయిడ్ గీస్ట్. కోల్ కత్తాలోని మురికివాడకు చెందిన మాఫిడల్ ఇస్లాం లైన్ లోని రెండు బిర్యానీ దుకాణాల మధ్య ఉన్న ఒకే ఒక్క గదిలో అయేషా కుటుంబం నివసిస్తోంది. థాయ్ పిఛాయ్ ఇంటర్నేషనల్ యూత్ కరాటే ఛాంపియన్ షిప్ కు సారధ్యాన్ని వహించిన అయేషా... పన్నెండు మంది సభ్యులున్న భారత జట్టులో ఒకే ఒక్క యువతి. 2012 లో రాష్ట్ర, జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ లో మూడు బంగారు పతకాలను కూడ సాధించింది. రాజ్ బజార్ సైన్స్ కాలేజీకి ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ప్రతి ఆదివారం సాయంత్రం బాలికలు, యువతులు ఆత్మ రక్షణకోసం అయేషా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టి ఎందరికో తర్ఫీదునిస్తోంది. ''తండ్రి మరణంతో కుటుంబాన్ని ఈడ్చేందుకు, కడుపు నింపుకునేందుకు నా తల్లి కుట్టుపని చేయడం ప్రారంభించింది. ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కరువే. నా కోచ్ ఎం. ఎ. అలీ. ఆయనకు ముందుగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన లేకుండా నాకేదీ సాధ్యమయ్యేది కాదు'' అంటుంది అయేషా. 1988 లో ఓ ప్రముఖ కరాటే టోర్నమెంట్ లో స్వర్ణం సాధించారు అలీ... కుటుంబాన్ని నెట్టేందుకు తాత్కాలిక షూ వ్యాపారం చేసే అయేషా సోదరుడు తన్వీర్.. ఆమె పట్టుబట్టడంతో.. అలీవద్ద శిక్షణకు చేర్పించాడు. ఆమె పట్టుదలే.. అనుకున్నది సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచానికే లింగ వివక్షపై అవగాహన కల్పించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ..లక్ష్య సాధనే ధ్యేయంగా గుర్తింపు పొందిన అయేషా నూర్ కథ... ఇప్పుడు ఓ అసాధారణ గాధగా తెరకెక్కింది. జోర్ధాన్, కెన్యా, పెరు, బంగ్లాదేశ్ లకు చెందిన మరో నలుగురు మహిళల కథలతోపాటు అయేషా నూర్ జీవిత కథ చిత్రంగా రూపొందింది. లాభాపేక్ష లేని సంస్థగా ఐ టీ వీ సర్వీస్... పలు అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రాజెక్లులకు నిధులను ఇచ్చి ప్రోత్సహిస్తుంది. యూఎస్ కాంగ్రెస్ ఆదేశంతో 1988 లో ఈ సంస్థ స్థాపించారు. అయితే డాక్యుమెంటరీ విషయం కోల్ కత్తా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియడంతో, మైనారిటీ వ్యవహారాల శాఖ అయేషా నూర్ కు సాహాయం అందించేందుకు ప్రయత్నించింది. అయితే అయేషా దాన్ని స్వచ్ఛందంగా తిరస్కరించింది. -
నూర్, హసీమ్‌లు పాత్రధారులే!
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద అనుమానితుడు నజీర్ కేసు దర్యాప్తును సిట్ పోలీసులు వేగవంతం చేశారు. ఇటీవల చంచల్‌గూడ జైలు సమీపంలోని ఎంఎం జిరాక్స్ సెంటర్‌పై దాడి చేసిన నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు నజీర్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సిట్ పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండటంతో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2010లో బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడిన నసీర్‌కు బంగ్లాదేశ్‌కు చెందిన నూర్ ఉల్ హక్ అలియాస్ షేక్ నూర్, మయన్మార్‌కు చెందిన హసీమ్ అలియాస్ షేక్ అమీర్ అలియాస్ అన్వర్ సహాయం అందించినట్టు తెలిసింది. నూర్, హసీమ్ కొద్దికాలంగా మెదక్ జిల్లా జహీరాబాద్‌లో నివసిస్తున్నారు. నసీర్ జహీరాబాద్‌లో ఉండేందుకు వసతి కల్పించిన వీరు.. బాలాపూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొహైల్ సహకారంతో యునాని ఆస్పత్రిలో వాచ్‌మన్‌గా అతనికి ఉద్యోగం ఇప్పించినట్టు సిట్ విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. నసీర్ ఇచ్చిన సమాచారం మేరకు నగర పోలీసులు ఢిల్లీ చేరుకున్నారు. అయితే అప్పటికే నూర్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతడిని ట్రాన్సిట్ వారంట్‌పై సిట్ పోలీసులు సోమవారం నగరానికి తీసుకొచ్చారు. మరోవైపు సోమవారం మధ్యాహ్నం లింగంపల్లి రైల్వేస్టేషన్లో హసీమ్‌ను ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది. నూర్‌ది ప్రధాన పాత్రే.. హుజీతోపాటు ఇతర నిషేధిత ఉగ్రవాదులకు నూర్(62) సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నూర్ 2 దశాబ్దాలకుపైగా ఈ పని చేస్తున్నాడని, అనుమానం రాకుండా ఉండేందుకు నగరాలను మారుస్తుండేవాడని భావిస్తున్నారు. పానిపట్టు నుంచి ఈ ఏడాది మార్చిలో జహీరాబాద్‌కు వచ్చిన నసీర్‌కు.. నూర్, హసీమ్ ఆశ్రయం కల్పించారని, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కి వచ్చే సమయంలో రూ. 20 వేలు తీసుకుని నసీర్‌ను నూర్ భారత్‌కి చేర్చాడని, ఆ తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద అక్రమ రవాణా ముఠాల దందాలో నసీర్‌కు నూర్ దగ్గరైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా యువతకు ఉద్యోగాలిస్తామని ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తుండేవారని, మాల్దా చెక్‌పోస్టు కేంద్రంగా ఈ తతంగాన్ని నడిపించారని విచారణలో తేలింది. నూర్ ఏది చెబితే హసీమ్ అదే ఫాలో అవుతుండేవాడని, జహీరాబాద్ నుంచి నసీర్ చంచల్‌గూడకు మారే క్రమంలో అంతా హసీమే చూసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నసీర్ విచారణ మంగళవారంతో ముగియనుండగా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
నూర్, అసీమ్లు పాత్రధారులే..
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రవాద అనుమానితుడు నజీర్ కేసు దర్యాప్తును సిట్ పోలీసులు వేగవంతం చేశారు. ఇటీవల చంచల్‌గూడ జైలు సమీపంలోని ఎంఎం జిరాక్స్ సెంటర్‌పై దాడి చేసి అరెస్టు చేసిన నజీర్‌తో పాటు మరో ఐదుగురి విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2010లో బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడిన నసీర్‌కు జహీరాబాద్ వాసులు నూర్, అసీమ్లు పూర్తి సహయసహకారాలు అందించినట్టు తెలిసింది. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఉండేందుకు వసతి కల్పించిన వీరు...బాలాపూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొహైల్ సహాకారంతో యునాని ఆస్పత్రిలో వాచ్‌మన్‌గా నసీర్‌కు ఉద్యోగం ఇప్పించాడని విచారణలో తెలిపినట్టు తెలుస్తోంది. నసీర్ ఇచ్చిన పక్కా సమాచారం మేరకు నగర పోలీసులు ఢిల్లీ చేరుకుని నూర్, అసీమ్లని శనివారం అరెస్టు చేసి...స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు. నూర్‌ది ప్రధాన పాత్రే... హుజీతో పాటు ఇతర నిషేధిత ఉగ్రవాదులకు అన్ని విధాల నూర్ సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 54 ఏళ్లున్న నూర్ రెండు దశాబ్దాలకుపైగా ఈ పని చేస్తున్నాడని, అనుమానం రాకుండా ఉండేందుకు నగరాలను మారుస్తుండేవాడని భావిస్తున్నారు. పానిపట్టు నుంచి ఈ ఏడాది మార్చిలో మెదక్ జిల్లా జహీరాబాద్‌కు వచ్చిన నసీర్‌కు...నూర్, అసీమ్లు ఆశ్రయం కల్పించారు.బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కి వచ్చే సమయంలో నూర్...20వేల రూపాయాలను తీసుకుని నసీర్ని భారత్‌కి చేర్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద అక్రమ రవాణా ముఠాల దందా క్రమంలో నసీర్‌కు నూర్ మరింత దగ్గరైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబైలు కేంద్రంగా యువతకు ఉద్యోగాలిస్తామని మోసగించి ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తుండేవారు. మాల్దా చెక్‌పోస్టు కేంద్రంగా ఈ తతంగాన్ని నడిపించారని పోలీసుల విచారణలో తేలింది. నూర్‌కు సన్నిహితుడైన అసిమ్...అతడు ఏది చెబితే అదే ఫాలో అవుతుండేవాడు. జహీరాబాద్ నుంచి నసీర్...చంచల్‌గూడ మారే క్రమంలో అంతా తానై అసిమే చూసుకున్నాడని తెలుస్తోంది. గత ఆరేళ్ల నుంచి నూర్‌తో కలిసి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నసీర్ విచారణ మంగళవారంతో ముగియనుండగా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ఈత కొలునులో చిక్కుకుని ముగ్గురు మృతి
స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాదం ముగ్గురూ మిల్లార్‌పేట వాసులే సాక్షి, బళ్లారి : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకుందామని బళ్లారిలోని చారిత్రాత్మక కొండపైనున్న కోటపైకి ఎక్కిన ముగ్గురు బాలురు ఈత కొలనులో పడి మృతి చెందిన హృదయ విదారక సంఘటన శుక్రవారం జరిగింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బళ్లారిలోని మిల్లార్ పేటకు చెందిన ఆటో డ్రైవర్ నూర్ కుమారుడు జాఫర్ (15), మున్సిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న మస్తానప్ప, మీనాక్షిల కుమారుడు సుప్రీత్ (13), మిల్లార్ పేటకు చెందిన షంషుద్దీన్ కుమారుడు మహమ్మద్ షమిఉల్లా (17) బళ్లారి కొండపైనున్న కోటపైకి వెళ్లారు. కొండపై అటూ, ఇటూ సంతోషంగా తిరుగుతూ ఈత కొలునులో కమలం పువ్వులను పీకేందుకు దిగారు. దీంతో బురదలో ఒక బాలుడు చిక్కుకోవడంతో అతన్ని రక్షించేందుకు వెళ్లిన మిగిలిన ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు కొలునులోని బురదలో ఇరుక్కుని మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న కౌల్‌బజార్ పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఈత నిపుణులను కొలనులో దింపారు. రెండు గంట ల పాటు కొలనులో వెతికి ముగ్గురు బాలుర మృతదేహాలను వెలికి తీశారు. ముగ్గురూ మిల్లార్‌పేటకు చెందిన వారే కావడంతో ఆ పేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, మాజీ ఎంపీ కేసీ కొండయ్య తదితరులు వెళ్లి బాధిత కుటుంబీకులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ముగ్గురు పిల్లలు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడిపెట్టించింది. ఈ ఘటనపై కౌల్‌బజార్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.