సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద అనుమానితుడు నజీర్ కేసు దర్యాప్తును సిట్ పోలీసులు వేగవంతం చేశారు. ఇటీవల చంచల్‌గూడ జైలు సమీపంలోని ఎంఎం జిరాక్స్ సెంటర్‌పై దాడి చేసిన నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు నజీర్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సిట్ పోలీసులు వీరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తుండటంతో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. 2010లో బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడిన నసీర్‌కు బంగ్లాదేశ్‌కు చెందిన నూర్ ఉల్ హక్ అలియాస్ షేక్ నూర్, మయన్మార్‌కు చెందిన హసీమ్ అలియాస్ షేక్ అమీర్ అలియాస్ అన్వర్ సహాయం అందించినట్టు తెలిసింది.
నూర్, హసీమ్ కొద్దికాలంగా మెదక్ జిల్లా జహీరాబాద్‌లో నివసిస్తున్నారు. నసీర్ జహీరాబాద్‌లో ఉండేందుకు వసతి కల్పించిన వీరు.. బాలాపూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొహైల్ సహకారంతో యునాని ఆస్పత్రిలో వాచ్‌మన్‌గా అతనికి ఉద్యోగం ఇప్పించినట్టు సిట్ విచారణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. నసీర్ ఇచ్చిన సమాచారం మేరకు నగర పోలీసులు ఢిల్లీ చేరుకున్నారు. అయితే అప్పటికే నూర్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. అతడిని ట్రాన్సిట్ వారంట్‌పై సిట్ పోలీసులు సోమవారం నగరానికి తీసుకొచ్చారు. మరోవైపు సోమవారం మధ్యాహ్నం లింగంపల్లి రైల్వేస్టేషన్‌లో హసీమ్‌ను ప్రత్యేక బృందం అరెస్ట్ చేసింది.
నూర్‌ది ప్రధాన పాత్రే..
హుజీతోపాటు ఇతర నిషేధిత ఉగ్రవాదులకు నూర్(62) సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నూర్ 2 దశాబ్దాలకుపైగా ఈ పని చేస్తున్నాడని, అనుమానం రాకుండా ఉండేందుకు నగరాలను మారుస్తుండేవాడని భావిస్తున్నారు. పానిపట్టు నుంచి ఈ ఏడాది మార్చిలో జహీరాబాద్‌కు వచ్చిన నసీర్‌కు.. నూర్, హసీమ్ ఆశ్రయం కల్పించారని, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కి వచ్చే సమయంలో రూ. 20 వేలు తీసుకుని నసీర్‌ను నూర్ భారత్‌కి చేర్చాడని, ఆ తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద అక్రమ రవాణా ముఠాల దందాలో నసీర్‌కు నూర్ దగ్గరైనట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై కేంద్రాలుగా యువతకు ఉద్యోగాలిస్తామని ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తుండేవారని, మాల్దా చెక్‌పోస్టు కేంద్రంగా ఈ తతంగాన్ని నడిపించారని విచారణలో తేలింది. నూర్ ఏది చెబితే హసీమ్ అదే ఫాలో అవుతుండేవాడని, జహీరాబాద్ నుంచి నసీర్ చంచల్‌గూడకు మారే క్రమంలో అంతా హసీమే చూసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నసీర్ విచారణ మంగళవారంతో ముగియనుండగా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
నూర్, హసీమ్‌లు పాత్రధారులే!
Published Tue, Aug 25 2015 2:33 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM
Advertisement