సాక్షి, హైదరాబాద్ : ఉగ్రవాద అనుమానితుడు నజీర్ కేసు దర్యాప్తును సిట్ పోలీసులు వేగవంతం చేశారు. ఇటీవల చంచల్‌గూడ జైలు సమీపంలోని ఎంఎం జిరాక్స్ సెంటర్‌పై దాడి చేసి అరెస్టు చేసిన నజీర్‌తో పాటు మరో ఐదుగురి విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2010లో బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా భారత్‌లోకి చొరబడిన నసీర్‌కు జహీరాబాద్ వాసులు నూర్, అసీమ్‌లు పూర్తి సహయసహకారాలు అందించినట్టు తెలిసింది. మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఉండేందుకు వసతి కల్పించిన వీరు...బాలాపూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొహైల్ సహాకారంతో యునాని ఆస్పత్రిలో వాచ్‌మన్‌గా నసీర్‌కు ఉద్యోగం ఇప్పించాడని విచారణలో తెలిపినట్టు తెలుస్తోంది. నసీర్ ఇచ్చిన పక్కా సమాచారం మేరకు నగర పోలీసులు ఢిల్లీ చేరుకుని నూర్, అసీమ్‌లని శనివారం అరెస్టు చేసి...స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారంట్‌పై సోమవారం నగరానికి తీసుకొచ్చారు.
నూర్‌ది ప్రధాన పాత్రే...
హుజీతో పాటు ఇతర నిషేధిత ఉగ్రవాదులకు అన్ని విధాల నూర్ సహకరించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 54 ఏళ్లున్న నూర్ రెండు దశాబ్దాలకుపైగా ఈ పని చేస్తున్నాడని, అనుమానం రాకుండా ఉండేందుకు నగరాలను మారుస్తుండేవాడని భావిస్తున్నారు. పానిపట్టు నుంచి ఈ ఏడాది మార్చిలో మెదక్ జిల్లా జహీరాబాద్‌కు వచ్చిన నసీర్‌కు...నూర్, అసీమ్‌లు ఆశ్రయం కల్పించారు.బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌కి వచ్చే సమయంలో నూర్...20వేల రూపాయాలను తీసుకుని నసీర్‌ని భారత్‌కి చేర్చాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద అక్రమ రవాణా ముఠాల దందా క్రమంలో నసీర్‌కు నూర్ మరింత దగ్గరైనట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబైలు కేంద్రంగా యువతకు ఉద్యోగాలిస్తామని మోసగించి ఇతర దేశాలకు అక్రమ రవాణా చేస్తుండేవారు. మాల్దా చెక్‌పోస్టు కేంద్రంగా ఈ తతంగాన్ని నడిపించారని పోలీసుల విచారణలో తేలింది. నూర్‌కు సన్నిహితుడైన అసిమ్...అతడు ఏది చెబితే అదే ఫాలో అవుతుండేవాడు. జహీరాబాద్ నుంచి నసీర్...చంచల్‌గూడ మారే క్రమంలో అంతా తానై అసిమే చూసుకున్నాడని తెలుస్తోంది. గత ఆరేళ్ల నుంచి నూర్‌తో కలిసి చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నసీర్ విచారణ మంగళవారంతో ముగియనుండగా మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.