స్పై ప్రిన్సెస్‌.. టిప్పు సుల్తాన్‌ వంశస్తురాలు! | Spy Princess noor inayat khan | Sakshi
Sakshi News home page

స్పై ప్రిన్సెస్‌!

Published Tue, Oct 23 2018 4:22 AM | Last Updated on Tue, Oct 23 2018 11:41 AM

Spy Princess noor inayat khan - Sakshi

నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌

విలాసవంతమైన జీవితాన్ని కాదనుకుని దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆ మహిళ తరఫున బ్రిటన్‌లో ప్రస్తుతం ఉద్యమం నడుస్తోంది. ఆమె భారత సంతతికి చెందిన ముస్లిం మహిళ కావడం గమనార్హం. ఆమే నూరున్నిసా ఇనాయత్‌ ఖాన్‌ అలియాస్‌ నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌. బ్రిటన్‌ చరిత్ర పుటల్లో హీరోగా పిలుచుకునే నూర్‌.. భారత సంతతికి చెందిన టిప్పు సుల్తాన్‌ వంశస్తురాలు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎనలేని సేవలందించిన ఈమె ముఖ చిత్రాన్ని బ్రిటిష్‌ కరెన్సీపై ముద్రించాలన్న డిమాండ్‌ను ప్రముఖులు కూడా సమర్ధిస్తున్నారు.

టిప్పు సుల్తాన్‌ వంశం..
నూర్‌ ఖాన్‌ తల్లి అమినా బేగం అమెరికన్, తండ్రి ఇనాయత్‌ ఖాన్‌.. మైసూరు రాజు టిప్పు సుల్తాన్‌ కుటుంబీకుడు. 1914లో రష్యాలోని మాస్కోలో జన్మించారు. ధనికుల కుటుంబంలో పుట్టినా నూర్‌ విలాసాలను కాదనుకున్నారు. ఫ్రాన్స్‌ నాజీల వశం కావడంతో పారిస్‌ నుంచి బ్రిటన్‌కు వెళ్లారు. అక్కడే భావి జీవితానికి పునాది పడింది. బ్రిటన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందారు. ఫ్రెంచి భాషా నైపుణ్యం కూడా ఉండటంతో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీల ఆక్రమిత ప్రాంతంలోనే పారిస్‌కీ లండన్‌కీ మధ్య రహస్యంగా స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎస్‌ఓఈ) రేడియో ఆపరేటర్‌గా, నర్స్‌గా పనిచేశారు. అలా 1943లో నాజీ ఆక్రమిత ఫ్రాన్స్‌కు పంపిన తొలి మహిళా స్పెషల్‌ ఆపరేషన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ నూర్‌ ఖాన్‌(29) కావడం గమనార్హం. మాడెలీన్, నోరా బేకర్, జీన్‌ మేరీ రెనియర్‌ అనే మారుపేర్లతో పారిస్‌లో ఆమె రహస్యంగా విధులు నిర్వర్తించారు. చిట్టచివరికి నాజీ సైన్యం 1943 అక్టోబర్‌లో ఆమెను పట్టుకోగలిగింది. 1944 సెప్టెంబర్‌లో నూర్‌ ఖాన్‌ని కాన్సన్‌ట్రేషన్‌ క్యాంప్‌లోనే చిత్రహింసలు పెట్టి, నాజీలు కాల్చి చంపారు.

నూర్‌ కోసం ఉద్యమం
2012లో బ్రిటన్‌ రాణి, లండన్‌ యూనివర్సిటీలోని స్క్వేర్‌ గార్డెన్స్‌లో నూర్‌ఖాన్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. శ్రాబణి బసు అనే జర్నలిస్టు, రచయిత 2008లో ‘స్పై ప్రిన్సెస్‌’ పేరుతో నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌ చరిత్రను గ్రంథస్తం చేశారు. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ 2020లో విడుదల చేయబోయే 50 పౌండ్ల నోట్‌పై ముఖచిత్రం కోసం ప్రతిపాదనలు కోరుతూ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. స్పందించిన పలువురు ప్రముఖులు.. నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌ చిత్రాన్ని ముద్రించాలంటూ ఉద్యమం చేపట్టారు. ఈ అరుదైన ముస్లిం మహిళ సాహసంపై అందరికీ తెలియజెప్పాల్సిన సమయం ఇదేనంటూ చరిత్రకారులు ప్రచారం చేస్తున్నారు. వారికి మంత్రులు కూడా మద్దతు తెలపడంతో ఉద్యమం ఊపందుకుంది. ఇప్పటికే 1,500 మంది ప్రముఖుల సంతకాలను సేకరించినట్లు ఛేంజ్‌ డాట్‌ ఆర్గ్‌ నిర్వాహకులు తెలిపారు. వీరి ఉద్యమాలు, ప్రయత్నాలు సఫలమైతే త్వరలో ముద్రించే 50 పౌండ్ల నోటుపై భారత సంతతి మహిళ చిత్రం దర్శనమివ్వడం ఖాయం.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement