ఈత కొలునులో చిక్కుకుని ముగ్గురు మృతి
- స్వాతంత్య్ర దినోత్సవం రోజున విషాదం
- ముగ్గురూ మిల్లార్‌పేట వాసులే
సాక్షి, బళ్లారి : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకుందామని బళ్లారిలోని చారిత్రాత్మక కొండపైనున్న కోటపైకి ఎక్కిన ముగ్గురు బాలురు ఈత కొలనులో పడి మృతి చెందిన హృదయ విదారక సంఘటన శుక్రవారం జరిగింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బళ్లారిలోని మిల్లార్ పేటకు చెందిన ఆటో డ్రైవర్ నూర్ కుమారుడు జాఫర్ (15), మున్సిపల్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న మస్తానప్ప, మీనాక్షిల కుమారుడు సుప్రీత్ (13), మిల్లార్ పేటకు చెందిన షంషుద్దీన్ కుమారుడు మహమ్మద్ షమిఉల్లా (17) బళ్లారి కొండపైనున్న కోటపైకి వెళ్లారు. కొండపై అటూ, ఇటూ సంతోషంగా తిరుగుతూ ఈత కొలునులో కమలం పువ్వులను పీకేందుకు దిగారు.
దీంతో బురదలో ఒక బాలుడు చిక్కుకోవడంతో అతన్ని రక్షించేందుకు వెళ్లిన మిగిలిన ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు కొలునులోని బురదలో ఇరుక్కుని మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న కౌల్‌బజార్ పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఈత నిపుణులను కొలనులో దింపారు. రెండు గంట ల పాటు కొలనులో వెతికి ముగ్గురు బాలుర మృతదేహాలను వెలికి తీశారు. ముగ్గురూ మిల్లార్‌పేటకు చెందిన వారే కావడంతో ఆ పేటలో విషాద ఛాయలు అలముకున్నాయి.
విషయం తెలుసుకున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరమేశ్వర నాయక్, మాజీ ఎంపీ కేసీ కొండయ్య తదితరులు వెళ్లి బాధిత కుటుంబీకులను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ముగ్గురు పిల్లలు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరులను కంటతడిపెట్టించింది. ఈ ఘటనపై కౌల్‌బజార్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.