'ఆమె' ప్రపంచాన్ని జయించింది!
ఆమె ఇప్పుడు ప్రపంచాన్ని జయించింది. అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాక అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ టెలివిజన్ సర్వీస్ తీస్తున్న డాక్యుమెంటరీకి కథగా మారింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న లింగ వివక్షపై సానుకూల మార్పులను ప్రోత్సహించే నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రానికి కథాంశమైంది. కోల్ కత్తా మురికివాడలనుంచి పుట్టిన ముత్యంలా.. అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ గా పేరు తెచ్చుకోవడమే కాక... డాక్యుమెంటరీకి ఎంపికైన ఏకైక భారతీయురాలుగా అయేషా నూర్ గుర్తింపు పొందింది.
మూర్ఛరోగం, పేదరికంతో పోరాడుతూనే తన లక్ష్యాన్ని సాధించింది కోల్ కత్తా మురికి వాడకు చెందిన 19ఏళ్ళ యువతి అయేషా నూర్. తండ్రి ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ మరణించినా.. ఆమె వెనుకంజ వేయలేదు. తన కరాటే కోచ్ ప్రోత్సాహంతో ప్రపంచ ప్రఖ్యాత బ్లాక్ బెల్ట్ ను సాధించింది. ఐదు దేశాలకు చెందిన ఐదుగురు యువతుల వ్యక్తిగత గాధలను ఐటీవీ సర్వీసెస్ తెరకెక్కించింది. ఐదుగురి కథాంశం ఒకేలా ఉన్నా... ఒక్కో యువతీ ఇతర యువతులకు ఒక్కో రకంగా సహాయం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అంటారు నెదర్లాండ్ కు చెందిన చిత్ర నిర్మాత కోయెన్ సూయిడ్ గీస్ట్.
కోల్ కత్తాలోని మురికివాడకు చెందిన మాఫిడల్ ఇస్లాం లైన్ లోని రెండు బిర్యానీ దుకాణాల మధ్య ఉన్న ఒకే ఒక్క గదిలో అయేషా కుటుంబం నివసిస్తోంది. థాయ్ పిఛాయ్ ఇంటర్నేషనల్ యూత్ కరాటే ఛాంపియన్ షిప్ కు సారధ్యాన్ని వహించిన అయేషా... పన్నెండు మంది సభ్యులున్న భారత జట్టులో ఒకే ఒక్క యువతి. 2012 లో రాష్ట్ర, జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ లో మూడు బంగారు పతకాలను కూడ సాధించింది. రాజ్ బజార్ సైన్స్ కాలేజీకి ఎదురుగా ఉన్న గ్రౌండ్లో ప్రతి ఆదివారం సాయంత్రం బాలికలు, యువతులు ఆత్మ రక్షణకోసం అయేషా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టి ఎందరికో తర్ఫీదునిస్తోంది.
''తండ్రి మరణంతో కుటుంబాన్ని ఈడ్చేందుకు, కడుపు నింపుకునేందుకు నా తల్లి కుట్టుపని చేయడం ప్రారంభించింది. ఇంట్లో ఎప్పుడూ ఆహారానికి కరువే. నా కోచ్ ఎం. ఎ. అలీ. ఆయనకు ముందుగా నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన లేకుండా నాకేదీ సాధ్యమయ్యేది కాదు'' అంటుంది అయేషా. 1988 లో ఓ ప్రముఖ కరాటే టోర్నమెంట్ లో స్వర్ణం సాధించారు అలీ... కుటుంబాన్ని నెట్టేందుకు తాత్కాలిక షూ వ్యాపారం చేసే అయేషా సోదరుడు తన్వీర్.. ఆమె పట్టుబట్టడంతో.. అలీవద్ద శిక్షణకు చేర్పించాడు.
ఆమె పట్టుదలే.. అనుకున్నది సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ప్రస్తుతం ప్రపంచానికే లింగ వివక్షపై అవగాహన కల్పించే అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ..లక్ష్య సాధనే ధ్యేయంగా గుర్తింపు పొందిన అయేషా నూర్ కథ... ఇప్పుడు ఓ అసాధారణ గాధగా తెరకెక్కింది. జోర్ధాన్, కెన్యా, పెరు, బంగ్లాదేశ్ లకు చెందిన మరో నలుగురు మహిళల కథలతోపాటు అయేషా నూర్ జీవిత కథ చిత్రంగా రూపొందింది. లాభాపేక్ష లేని సంస్థగా ఐ టీ వీ సర్వీస్... పలు అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిల్మ్ ప్రాజెక్లులకు నిధులను ఇచ్చి ప్రోత్సహిస్తుంది. యూఎస్ కాంగ్రెస్ ఆదేశంతో 1988 లో ఈ సంస్థ స్థాపించారు. అయితే డాక్యుమెంటరీ విషయం కోల్ కత్తా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియడంతో, మైనారిటీ వ్యవహారాల శాఖ అయేషా నూర్ కు సాహాయం అందించేందుకు ప్రయత్నించింది. అయితే అయేషా దాన్ని స్వచ్ఛందంగా తిరస్కరించింది.