
ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం
పారిస్ కోర్టు సంచలన తీర్పు
పారిస్: ఫ్రాన్స్ నేషనల్ ర్యాలీ పార్టీ అగ్రనేత మెరీన్ లీ పెన్(56)కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక అవకతవకల కేసులో పారిస్ న్యాయస్థానం ఆమెను దోషిగా నిర్ధారించింది. ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తూ సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. కోర్టు తీర్పు పూర్తిగా వెలువడకముందే లీ పెన్ కోర్టు గది నుంచి బయటకు వెళ్లిపోయారు.
కరుడుగట్టిన అతివాద నాయకురాలిగా గుర్తింపు పొందిన మెరీన్ లీ పెన్ 2027లో జరిగే ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ప్రతికూలంగా తీర్పు రావడం శరాఘాతంగా మారింది. అయితే ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయినప్పటికీ ఆమెకు ఉపశమనం దక్కే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరుగనున్నాయి.
ఆలోగా పై కోర్టులో విచారణ జరగడం, తీర్పు రావడం కష్టమేనని అంటున్నారు. యూరోపియన్ యూనియన్ నిధులను దుర్వినియోగం చేసినట్లు లీ పెన్‌పై ఆరోపణలు వచ్చాయి. 2004 నుంచి 2016 మధ్య సుమారు 33 లక్షల డాలర్లను సొంత పార్టీకి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో లీ పెన్‌తోపాటు మరో 12 మందిని సైతం న్యాయస్థానం దోషులుగా గుర్తించింది. లీ పెన్ గతంలో మూడుసార్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డారు. 2022లో ఎమ్మానుయేల్ మేక్రాన్ చేతిలో పరాజయం పాలయ్యారు.