ఉత్కంఠగా ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు
ప్యారిస్: కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఫ్రాన్స్ ప్రజలు ఆదివారం మొదటి రౌండ్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉండగా... వీరిలో నేషనల్ ఫ్రంట్‌కు చెందిన మరీన్ లె పెన్, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఎమ్మాన్యుయేల్ మాక్రన్ల మధ్య ప్రధాన పోటీ ఉండవచ్చని సర్వేలు తేల్చిచెప్పాయి.
అలాగే కన్జర్వేటివ్ ఫిలన్, మెలన్కొన్లు గట్టి పోటీ ఇస్తున్నారు. మొదటి రౌండ్ ఎన్నికల్లో ఎవరికీ 50 శాతం ఓట్లు రాకపోతే.. మే 7న రెండో రౌండ్ ఎన్నిక నిర్వహిస్తారు. మొదటి రౌండ్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు రెండో రౌండ్లో పోటీపడతారు. ఉగ్రవాద దాడులు జరగవచ్చన్న ముందస్తు సమాచారంతో దేశవ్యాప్తంగా భారీ భ్రదతా ఏర్పాటు చేశారు. 66 వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 50 వేల మంది పోలీసుల్ని, ఇతర భద్రతా సిబ్బందిని మోహరించారు. మూడ్రోజుల క్రితం ప్యారిస్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో 7 వేల మంది సైనికులతో పహారా నిర్వహించారు.