కంగన... విశాల్... సెకండ్ వరల్డ్ వార్!
నిజంగా ఇదో చిత్రమైన కాంబినేషనే! కంగనా రనౌత్... బాలీవుడ్‌లో ఈ పేరు వినగానే విభిన్న తరహా పాత్రలు చేసే నటి గుర్తుకొస్తారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ పేరు వినగానే వైవిధ్యమైన కథాంశంతో కూడిన సినిమాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో ఓ కొత్త సినిమా మొదలైంది. పేరు - ‘రంగూన్’. గమ్మత్తేమిటంటే, ఇటీవలే తెలుగులో వచ్చిన క్రిష్ ‘కంచె’ సినిమా లాగే ఈ సినిమా కథ కూడా 1940ల నాటి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలోనే నడుస్తుంది.
ఈ పీరియడ్ ఫిల్మ్‌లో షాహిద్ కపూర్, సయీఫ్ అలీ ఖాన్‌లు హీరోలు. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కంగన ఒక నటిగా కనిపించనుండడం విశేషం. నటిగా తనను తీర్చిదిద్దిన వ్యక్తితోనే ప్రేమలో పడే పాత్ర ఆమెది. ఇక సినిమాలో ముఖ్యమైన మూడో పాత్ర - ఒక సైనికుడిది.
గతంలో ‘ఓంకార’ సినిమాలో విశాల్ భరద్వాజ్‌తో కలసి పనిచేసిన షాహిద్ కపూర్‌కు అదే దర్శకుడితో ఇది రెండో సినిమా. ఎప్పటికప్పుడు పాత్రల్లో కొత్తదనం కోసం, అభినయంలో ఆత్మ సంతృప్తి కోసం వెతికే కంగనా రనౌత్ మరోసారి దుమ్ము రేపుతారేమో చూడాలి.