Vishal Bhardwaj
-
బిగ్ స్క్రీన్ పై బిన్ లాడెన్‌ను చూస్తారా?
సాక్షి, సినిమా : విలియమ్స్ షేక్స్పియర్ నవలను కాస్త మార్చి చిత్రాలుగా తెరకెక్కించటంలో సీనియర్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ దిట్ట. మాక్బెత్ నుంచి మఖ్బుల్, ఒతెల్లో నుంచి ఓంకారా, హంలెట్ నుంచి హైదర్ సినిమాలను రూపొందించాడు. ఇప్పుడు ఆ ధ్యాస నుంచి బయటపడినట్లు ఉన్నాడు. అందుకే మరో క్రేజీ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చాడు. అల్ ఖయిదా మాజీ చీఫ్ ఒసామా బిన్‌లాడెన్‌పై సినిమా తీయబోతున్నట్లు ప్రకటించాడు. కేథరిన్ స్కాట్-క్లార్క్, అడ్రియాన్ లెవీ రచించిన ‘ది ఎక్సైల్ : ది స్టన్నింగ్ ఇన్సైడ్ స్టోరీ ఆఫ్ ఒసామా బిన్‌లాడెన్ అండ్ అల్ ఖయిదా ఇన్ ఫ్లైట్’ అనే నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు. అబ్బొట్టాబాద్ అనే టైటిల్ ఫిక్స్ చేసేశాడు కూడా. 9/11 దాడుల నుంచి ఇప్పటివరకు ఉన్న ఉగ్రవాద నేపథ్యాన్ని, అందులోని చీకటి కోణాన్ని తెరపై చూపించబోతున్నాడంట. అయితే ఇందులో ఎవరు నటించబోతున్నారు.. తదితర వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. గతంలో బిన్ తెరె లాడెన్ పేరుతో ఓ కామెడీ మూవీ బాలీవుడ్లో వచ్చింది. -
అవునా కంగనా?!
విశాల్ భరద్వాజ్ సినిమా ‘రంగూన్’ ఈ నెల 24న విడుదల అవుతోంది. అందులో కంగనా రనౌత్.. సైఫ్ అలీఖాన్ని, షాహిద్ కపూర్‌ని.. ఇద్దర్నీ ఒకేసారి ప్రేమిస్తుంది! ఎలా సాధ్యం ఏకకాలంలో ఇద్దర్ని ప్రేమించడం? ఎవరో ఒకరి మీదే కదా ప్రేమ ఉంటుంది. ఇద్దరి మీదో, ముగ్గురి మీదో ఉంటే అది ప్రేమ ఎలా అవుతుంది? మనకైతే.. ఇన్ని డౌట్స్ వస్తున్నాయి కానీ, కంగనాకు మాత్రం క్లారిటీ ఉంది. సినిమాలో.. సైఫ్‌కి కంగనా కావాలి. కంగనాకి సైఫ్ కావాలి. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేరింగ్‌తో ఉంటారు. ఒకరిపై ఒకరు ఆధారపడతారు. అతడిని ఆమె, అమెను అతడు కాపాడుకుంటూ ఉంటారు. ఆమెకు బాధ కలిగితే అతడు హర్ట్ అవుతాడు. అతడు బాధపడితే ఆమె హర్ట్ అవుతుంది. ఇద్దరి మధ్య గట్టి అనుబంధం ఉంటుంది. లిప్ కిస్‌లు కూడా ఇచ్చుకుంటారు. ‘అయితే ఇదంతా లవ్ కాదు, బంధం మాత్రమే’ అంటుంది కంగనా.మరి, షాహిద్ కపూర్‌తో కంగనాకు ఉన్నదేమిటి? అదేనట ఒరిజినల్‌గా ప్రేమంటే!‘ప్రేమ తనకదే ఏ కారణం లేకుండానే పుడుతుంది. సహాయాల వల్లనో, కేరింగ్ కారణంగానో ప్రేమ పుట్టదు. ఒకవేళ పుట్టినా అది ప్రేమ కాదు. ప్రేమంటే.. మనల్ని మనకు కొత్తగా చూపించేది’ అంటోంది కంగనా! సో.. ప్రేమలో బంధం, బంధనం ఉండవని అనుకోవాలి.బంధం, బంధనం లేనివే ప్రేమ అనుకోవాలి... అవునా కంగనా? -
'నాకు సినిమాలకంటే పుస్తకాలే ఎక్కువ'
ముంబయి: తనకు సినిమాలకంటే పుస్తకాలు, అందులో సాహిత్యమే చాలా ముఖ్యం బాలీవుడ్ చిత్రాల దర్శకుడు విశాల్ భరద్వాజ్ అన్నారు. 18వ మామీ చిత్రోత్సవంలో ఆయన బుధవారం మాట్లాడుతూ 'సినిమాల్లోకి సాహిత్యాన్ని తీసుకెళ్లడం చాలా ముఖ్యమైన అంశం. నా వరకు సినిమాలకంటే పుస్తకాలే ముఖ్యమైనవి. ఎందుకంటే.. మీ వద్ద మంచి పుస్తకాలుగానీ, సాహిత్యంగానీ లేకుంటే.. మంచి రచయితలు మనకు ఉండరు. మంచి రచయితలను తయారు చేయాలంటే మంచి పుస్తకాలను ఎప్పుడూ ప్రోత్సహించాల్సిందే. ఎక్కువ సాహిత్యంతో చాలామంచి సినిమాలు రూపొందించవచ్చు' అన్నారు. అలాగే 'ఇప్పుడు జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తీసే ట్రెండ్ మొదలైంది. అంతకుముందు చేతన భగత్ రాసిన పుస్తకాల ఆధారంగా రెండు సినిమాలు వచ్చాయి. నేను కూడా షేక్ స్పియర్ రచనల ఆధారంగా సినిమాలు తీశాను' అని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది 2017 ఫిబ్రవరి 24న భరద్వాజ్ దర్శకత్వం వహించిన రంగూన్ అనే చిత్రం విడుదలకానున్న విషయం తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కంగనా రనౌత్, సైఫ్ అలీ ఖాన్, షాహిద్ కపూర్ నటిస్తున్నారు. -
కంగన... విశాల్... సెకండ్ వరల్డ్ వార్!
నిజంగా ఇదో చిత్రమైన కాంబినేషనే! కంగనా రనౌత్... బాలీవుడ్లో ఈ పేరు వినగానే విభిన్న తరహా పాత్రలు చేసే నటి గుర్తుకొస్తారు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ పేరు వినగానే వైవిధ్యమైన కథాంశంతో కూడిన సినిమాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఓ కొత్త సినిమా మొదలైంది. పేరు - ‘రంగూన్’. గమ్మత్తేమిటంటే, ఇటీవలే తెలుగులో వచ్చిన క్రిష్ ‘కంచె’ సినిమా లాగే ఈ సినిమా కథ కూడా 1940ల నాటి రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలోనే నడుస్తుంది. ఈ పీరియడ్ ఫిల్మ్‌లో షాహిద్ కపూర్, సయీఫ్ అలీ ఖాన్లు హీరోలు. సాజిద్ నడియాడ్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కంగన ఒక నటిగా కనిపించనుండడం విశేషం. నటిగా తనను తీర్చిదిద్దిన వ్యక్తితోనే ప్రేమలో పడే పాత్ర ఆమెది. ఇక సినిమాలో ముఖ్యమైన మూడో పాత్ర - ఒక సైనికుడిది. గతంలో ‘ఓంకార’ సినిమాలో విశాల్ భరద్వాజ్‌తో కలసి పనిచేసిన షాహిద్ కపూర్‌కు అదే దర్శకుడితో ఇది రెండో సినిమా. ఎప్పటికప్పుడు పాత్రల్లో కొత్తదనం కోసం, అభినయంలో ఆత్మ సంతృప్తి కోసం వెతికే కంగనా రనౌత్ మరోసారి దుమ్ము రేపుతారేమో చూడాలి. -
85 ఏళ్ల వృద్ధురాలిగానూ!
గాసిప్ తెరపై అందాలను ఒలికిస్తూ, గ్లామరస్‌గా చేయాల్సిన సమయంలో లేటు వయసు పాత్రలు చేయాలంటే చాలా మంది కథానాయికలు ‘అయ్య బాబోయ్’ అంటారు. కానీ పాత్రానుగుణంగా తమను తాము మలుచుకోవడానికి ఎంతకైనా సిద్ధపడే హీరోయిన్లు అతి కొద్ది మందే. వాళ్లలో కంగనా రనౌత్ ఒకరు. ఛాలెంజింగ్ రోల్స్‌ను అవలీలగా చేయడంలో ఆమెకు ఆమే సాటి. ప్రస్తుతం విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగూన్’ చిత్రంలో చిత్రం కోసం గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారామె. తాజాగా మరో చిత్రంలో 85 ఏళ్ల వృద్ధురాలిగా నటించడానికి సుముఖత వ్యక్తం చేశారట. ‘మిస్టర్ ఇండియా’, ‘పానీ’, ‘బండిట్ క్వీన్’ లాంటి వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కించిన నటుడు శేఖర్ కపూర్ ఈ చిత్రానికి దర్శకుడు. దీని గురించి కంగన మాట్లాడుతూ-‘‘ కథ నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉంది. అన్నీ కుదిరితే ఆ పాత్ర కచ్చితంగా చేస్తాను. ఇది వరకు వయసు మళ్లిన పాత్రలు చేయాలన్న ఆలోచన ఉండేది కాదు. కానీ ఇటీవలే ‘అమోర్’ అనే హాలీవుడ్ చిత్రం ఈ విషయంలో నా దృక్పథాన్ని మార్చింది. ముసలివాళ్ల చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది. నా హృదయాన్ని కదిలించిన సినిమా ఇది. ఆ ప్రేరణతోనే శేఖర్ సార్ ఈ పాత్ర గురించి చెప్పగానే ఓకే చెప్పాను’’ అని అన్నారు. -
'ప్రతి అక్టోబర్ 2కు ఒక సినిమా'
ముంబై: బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తన సినిమాలతో జాతిపిత మహాత్మ గాంధీకి నివాళి అర్పిస్తున్నారు. గాంధీ జయంతికి తన సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 2న 'హైదర్' సినిమా విడుదల చేసిన భరద్వాజ్ ఈసారి 'తల్వార్' వదులుతున్నారు. 'తన సినిమాల విడుదల తేదీలపై భరద్వాజ్ చాలా ఎగ్జైట్ గా ఉన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ 2న తన సినిమా విడుదల చేయాలని ఆయన భావిస్తున్నార'ని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు. నోయిడా డబుల్ మర్డర్ కేసు ఆధారంగా 'తల్వార్' సినిమాను విశాల్ భరద్వాజ్ తెరకెక్కించారు. ఈనెలారంభంలో టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ చిత్రానికి సానుకూల స్పందన వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. -
‘రంగూన్’ క్వీన్...
ఇటీవలే ‘హైదర్’తో సంచలనం సృష్టించిన విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో ‘రంగూన్’ సినిమా చేయడానికి కంగనా రనౌత్ పచ్చజెండా ఊపారు. ఇందులో షాహిద్‌కపూర్, సైఫ్ అలీఖాన్ ముఖ్యతారలు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో బ్రిటీషు సైన్యానికి, సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో ఏర్పడిన ఇండియన్ నేషనల్ ఆర్మీకి మధ్య జరిగే యుద్ధంలో తమ వారినే భారతీయులు ఎలా మట్టుపెట్టారనే ఓ సున్నితమైన అంశాన్ని ఈ సినిమాలో చెప్పనున్నారు విశాల్. -
వెండితెరపై విషాద నాటకం
సినిమా వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఎటువంటి దాగుడుమూతలు లేకుండా వినిపించిన బలమైన అవతలి గొంతు ‘హైదర్’. ఇలాంటి సినిమాను ఈ పద్ధతిలో తీయవచ్చా... సాధ్యమా... ఇంత ధైర్యం ఇంకా మిగిలి ఉందా... చీటికి మాటికి నిరసనలు సినిమాహాళ్ల దగ్గర ధర్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో కూడా తాము నమ్మిన ఒక సత్యాన్ని సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చా? చెప్పవచ్చు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ చెప్పి చూపించాడు. బహుశా కాశ్మీరీల జీవితాన్ని లోకానికి చెప్పి తీరాలి అని అతడు నిజాయితీగా గట్టిగా అనుకోవడమే దీనికి కారణం కావచ్చు. ఇందుకు అతడు షేక్స్పియర్ ప్రఖ్యాత నాటకం ‘హామ్లెట్’ని ఒక ముఖ్యమైన ఆధారంగా తీసుకున్నాడు. అయితే ఇది కేవలం ఆధారం మాత్రమే. కాని ఈ కథలో దర్శకుడు చూపించాలనుకున్నది ‘90ల నాటి కాశ్మీర్ పరిస్థితి, వేర్పాటు ఉద్యమం, ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రమేయం, విరుగుడుగా భారత సైన్యం, దాని మద్దతుతో పనిచేసే సంస్థలు, వీటితో సంబంధం లేకుండా స్వతంత్రం కావాలనుకునే మరికొన్ని సంస్థలు, వీటిని అడ్డు పెట్టుకొని లాభపడాలనుకునే రాజకీయ నాయకులు, ఇన్ని విరుద్ధ శక్తుల మధ్య నలిగిపోయిన సామాన్య ప్రజలు- వీటన్నింటినీ దర్శకుడు చూపించ దలుచుకున్నాడు. ఇందుకు ‘హైదర్’ అనే ఒక నవయువకుణ్ణి అతడి చివికిపోయిన కుటుంబాన్ని కేంద్రంగా చేసుకున్నాడు. కాశ్మీర్ ఉద్యమంలో హటాత్తుగా మాయమై ఆచూకీ దొరక్కుండా పోయిన వేల మంది కాశ్మీరీలు ఉన్నారు. అలాంటి కాశ్మీరీలలో హైదర్ తండ్రి కూడా ఒకడు. అలా అదృశ్యమైన తండ్రిని వెతకడం కోసం హైదర్ కాశ్మీరుకు రావడంతో కథ ప్రారంభమవుతుంది. కాని వచ్చాక అతడికి ఊహించని విషయం తెలుస్తుంది. తన తల్లి తన బాబాయ్‌తో మెలగడం గమనిస్తాడు. అది చాలనట్టు ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా తన తండ్రి తన తల్లి సహకారంతో బాబాయ్ కుట్ర వల్ల చంపించబడ్డాడన్న సంగతిని తెలుసుకుంటాడు. అసలే బయట ఒక విధ్వంసం. ఇప్పుడు లోపల ఒక విధ్వంసం. ఆ తర్వాత జరిగిన అనేకానేక సంఘటనలు అతని ప్రమేయం లేకుండానే అతన్ని ఒక విషవలయంలోకి లాగుతాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు చెప్పిన దాంట్లో ఎంత నిజమున్నదో తెలియదు. ఎవరివి నిజాలో ఎవరివి అబద్ధాలో తెలియదు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో తెలియదు. ఏ కన్నీళ్లు నకిలీవో ఏవి నిజమైనవో తెలియదు. ఏ ఆలింగనం వెనుక ఏ కుట్ర దాగుందో తెలియదు. ఇది ఒక్క హైదర్ పరిస్థితి మాత్రమే కాదు. సమస్త కాశ్మీరీలది కూడా. దీనికి కారణం ఎవరు? ఒక ప్రజా సమూహాన్ని అబద్ధంలో అభద్రతలో వంచనలో అపనమ్మకంలో అనైతికంలో నెట్టింది ఎవరు? దీనికి బీజం ఎక్కడ పడింది... దీనిని చర్చిస్తాడు దర్శకుడు. కొన్ని నేరుగా చెబుతాడు. కొన్ని ప్రేక్షకులకు వదిలిపెడతాడు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్, టబూ వంటి గొప్ప నటీనటులు పని చేశారు. నాటి కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన కవిత్వాన్ని ఇందులో రెండు పాటలుగా మలిచారు. మెహదీ హసన్ గజల్ ఉంది. మరి రెండు పాటలకు గుల్జార్ కలంకరణ చేశాడు. బషారత్ పీర్ అనే కాశ్మీరీ జర్నలిస్టు తన జీవితంలో చూసిన వాస్తవ కథనాలను అందించాడు. ‘ప్రతీకారంతో మరింత ప్రతీకారం తప్ప జరిగేదేమీ ఉండదు’ అనే డైలాగ్ ఇందులో ఉంది. ఈ ప్రతీకారాల వర్తమానం, సరిహద్దుల్లో కాల్పులు, వలస పోతున్న ప్రజానీకం ఇవాళ మనం చూస్తున్నాం. ‘కాశ్మీర్ మొత్తం జైలులా ఉంది’ అనడానికి చాలా సాహసం కావాలి. ఆ గొంతు వినడానికి సంయమనం కావాలి. మన సినిమా మరింత ముందుకెళ్లింది అనడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. - కృష్ణమోహన్‌బాబు 98480 23384 -
హైదర్ ను బహిష్కరించాలా? నిషేధించాలా?
ప్రముఖ రచయిత షేక్ స్పియర్ నవల 'హ్యామ్లెట్' ఆధారంగా రూపొందించిన 'హైదర్' చిత్రం విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. 'హైదర్' పాత్రలో కథానాయకుడిగా నటించిన బాలీవుడ్ హీరో షాహీద్ కపూర్ నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కాశ్మీర్ లోయలో ఇస్లామిక్ టెర్రిరిజం నేపథ్యంగా దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించిన హైదర్ చిత్రం ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నట్టు కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ, బహిష్కరించాలంటూ సంప్రదాయవాదులు పిలుపినిస్తున్నారు. హైదర్ చిత్రం పాకిస్థాన్ దేశానికి అనుకూలంగా ఉంది. భారతీయ సైన్యాన్ని కించపరిచే విధంగా ఉందంటూ విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నిషేధం విధించాలంటూ డిమాండ్ మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. -
చాక్లెట్ బాయ్‌ని డిఫరెంట్‌గా చేసిన విశాల్
-
జీవితాన్ని మార్చేసే సినిమా
విశాల్ భరద్వాజ్ సారథ్యంలో రూపొందుతున్న ‘హైదర్’ సినిమా తన జీవితాన్ని మార్చేస్తుందనే భావన కలుగుతోందని బాలీవుడ్ న టి శ్రద్ధాకపూర్ పేర్కొంది. విలియం షేక్స్పియర్ రచించిన ఓ నాటికను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తీస్తున్నారు. ‘ఓ విభిన్నమైన సినిమా ప్రపంచంలో ఉన్నట్టుగా తొలి సారి అనిపించింది. నన్ను నేను చూసుకుని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా. వాస్తవానికి ప్రేక్షకులు కూడా వైవిధ్యాన్ని కోరుకుంటారు. పలు రకాల పాత్రల్లో చూడాలని ఆకాంక్షిస్తారు. ఈ సినిమాలో చేసే అవకాశం లభించడమే ఓ గొప్ప అదృష్టంగా భావిస్తున్నా. జీవితం మారిపోవచ్చనే భావన కలుగుతోంది’ అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రద్ధ.. తన మనసులోని భావాలను వెల్లడించింది. ఈ సినిమాలో శ్రద్ధాకపూర్‌తోపాటు టబు, ఇర్ఫాన్‌ఖాన్, కేకే మీనన్, షాహిద్ కపూర్ తదితరులు నటిస్తున్నారు. ‘షాహిద్‌కపూర్ నటన అద్భుతం. అటువంటి నటులతో కలసి పనిచేయడం అసాధారణమనిపిస్తోంది’ అని తెలిపింది. ఈ సినిమా కోసం కాశ్మీర్లో సెట్టింగ్ వేశారు. అక్కడ చాలారోజులుగా జరుగుతున్న షూటింగ్లో శ్రద్ధాకపూర్ పాల్గొం టోంది. ‘షూటింగ్‌కు నాలుగురోజుల ముందే కాశ్మీర్‌కు వెళ్లా. కాశ్మీరీ యాస, భాషను అర్థం చేసుకోవడం కోసం, అనుకరించడం కోసమే ముందుగా వెళ్లా. అవసరం లేకపోయినా గొప్ప గొప్ప నటులు షూటింగ్లో పాల్గొంటుండడంతో సెట్స్ వద్దకు వెళుతుండేదాన్ని’ అని అంది. కాగా ‘హైదర్’ సినిమా ట్రయలర్స్కు విశేష స్పందన లభించింది. దీంతో ఈ సినిమా బాగా ఆడుతుందని శ్రద్ధాకపూర్ భావిస్తోంది. -
వివాదాస్పదమైన పాత్రలో...
నటనను అమితంగా ఆరాధించే నటి టబు. కెరీర్‌కి ఇబ్బంది అనుకున్నారో ఏమో... 40 ఏళ్లు దాటినా పెళ్లి ఊసు ఎత్తరామె. ఇప్పటికీ విభిన్నమైన పాత్రలు లభిస్తే చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇటీవలే ఓ వివాదాస్పదమైన పాత్రకు పచ్చజెండా ఊపారు టబు. సినిమా పేరు ‘హైదర్’. విశాల్ భరద్వాజ్ దర్శకుడు. షాహిద్ కపూర్ కథానాయకుడు. కథ రీత్యా ఇందులో షాహిద్ తల్లి పాత్ర చనిపోతుంది. దాంతో అతని తండ్రి టబుని రెండో వివాహం చేసుకుంటాడు. అలా షాహిద్ పిన్నిగా ఇంట్లోకి అడుగుపెట్టిన టబు.. కొడుకు వరుసయ్యే షాహిద్‌పై మనసు పారేసుకుంటుంది. ఈ పాత్ర తీరు తెన్నులు విశాల్ చెప్పగానే... మరో ఆలోచన లేకుండా అంగీకారం తెలిపారట టబు. ‘‘ఇలాంటి పాత్రలు చేయడానికి ధైర్యం అవసరం. అందుకే సవాలుగా తీసుకొని ఈ పాత్ర చేస్తున్నా. ఇందులో గ్లామర్‌గా కనిపిస్తా. అదే సమయంలో అభినయానికి అద్భుతమైన అవకాశం ఉన్న పాత్ర. తప్పకుండా నా కెరీర్లో గుర్తుండి పోయే సినిమా అవుతుంది’’ అని చెప్పారు టబు. అయితే... టబు ఈ పాత్రకు ‘ఓకే’ చెప్పగానే... పలు విమర్శలు కూడా ఆమెను చుట్టుముట్టడం గమనార్హం. -
దర్శకత్వానికే ప్రాధాన్యత
స్వయంగా దర్శకత్వం వహించాలనుకునే సినిమాలను మాత్రమే నిర్మించాలనుకుంటానని, ఇతరులు తీసే వాటికి నిర్మాతగా వ్యవహరించడం ఇష్టముండబోదని విశాల్ భరద్వాజ్ అంటున్నాడు. ఇక నుంచి సినిమాలు తీయడం మానేసి, ఆ శక్తిని దర్శకత్వ నైపుణ్యాలను పెంచుకోవడానికి ఉపయోగించుకుంటానని చెప్పాడు. అభిషేక్ చౌబే తనకు సోదరుడు వంటివాడు కాబట్టే దేడ్ ఇష్కియా దర్శకత్వ బాధ్యతను అతడికి అప్పగించానని చెప్పాడు. విశాల్ 2002లో తొలిసారిగా తీసిన బాలల సినిమా మక్డీకి విమర్శల ప్రశంసలు దక్కాయి. తరువాత మక్బూల్, ఓంకార వంటి చిత్రాలు రూపొందించాడు. నో స్మోకింగ్, ఇష్కియా, ఏక్ థి దయాన్ సినిమాలను నిర్మించాడు కానీ వాటికి దర్శకత్వం మాత్రం వహించలేదు. ‘నా సోదరి వంటిదైన మేఘనా గుల్జార్ తీసే సినిమాను కూడా నేనే నిర్మిస్తున్నాను. నా మనసుకు అత్యంత ఇష్టమైన కథ అది’ అని వివరించాడు. భావోద్వేగాలు, నాటకీయత ఎక్కువగా ఉండే సినిమాలను రూపొందిస్తూ సంజయ్ లీలాభన్సాలీ విజయాలు సాధించడంపై స్పందిస్తూ అలాంటి కథలపై అతనికి నమ్మకం ఉంటుంది కాబట్టే వాటిని ఎంచుకుంటాడని చెప్పాడు. ‘నాకు నమ్మకం లేని కథలకు దర్శకత్వం వహించడం గానీ నిర్మించడం గానీ నాకు ఇష్టముండదు. సంజయ్‌కు రౌడీ రాథోడ్ కథ బాగా నచ్చింది కాబట్టే దానిని నిర్మించి దర్శకత్వం వహించాడు’ అని విశాల్ వివరించాడు. దర్శకుడిగా మారడానికి ముందు ఇతడు చాలా సినిమాలకు సంగీతం అందించాడు. మాచిస్, సత్య, చాచీ 420, గాడ్‌మదర్, మక్బూల్, ఓంకార, కమీనే, ఇష్కియా, 7 ఖూన్మాఫ్ వంటి సినిమాలకు విశాల్ సంగీత దర్శకుడిగా పనిచేశాడు. సంజయ్ కూడా తన సినిమాకు సంగీతం అందించాలని ఓసారి కోరినా అప్పట్లో తీరిక లేకపోవడంతో ఒప్పుకోలేకపోయానని విశాల్ భరద్వాజ్ వివరించాడు. -
వాళ్లిద్దరిపై నాకు నమ్మకం ఉంది: మాధురీ దీక్షిత్
'డేఢ్ ఇష్కియా' చిత్ర రూపకర్తలు విశాల్ భరద్వాజ్, అభిషేక్ చౌబేలపై నమ్మకం ఉండటం వల్లే తానా సినిమాలో నటించానని రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదరగొడుతున్న మాధురీ దీక్షిత్ తెలిపింది. 2007లో ఆజా నచ్లే సినిమాతో ఆమె మళ్లీ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. 2010లో వచ్చిన 'ఇష్కియా' చిత్రం బ్రహ్మాండంగా హిట్ కావడంతో దర్శకుడు చౌబే మరోసారి నిర్మాత విశాల్ భరద్వాజ్‌తో కలిసి 'డేఢ్ ఇష్కియా' సినిమా తీశాడు. ''ఈ స్క్రిప్టు కోసం నేను ఏడు సంవత్సరాలు వేచి ఉండదలచుకోలేదు. అందుకు నా కారణాలు నాకున్నాయి. ఇంతకుముందు నేను ఇక్కడ ఉండలేదు కూడా. నేను విదేశాల్లో ఉండేదాన్ని. ఇక్కడికొచ్చి పనిచేసి వెళ్లిపోయేదాన్ని. అందుకే నేను దేని కోసం వేచి ఉండేదాన్ని కాదు'' అని మాధురి తెలిపింది. కానీ 'డేఢ్ ఇష్కియా' చిత్రం ఆఫర్ వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడికొచ్చి స్క్రిప్టులు చదివి చేయాలని నిర్ణయించుకుని, అందుకే మళ్లీ ఇండియా వచ్చి ఇక్కడే స్థిరపడ్డానని చెప్పారు. విశాల్, అభిషేక్ కలిస్తే మంచి సినిమాలు వస్తాయన్న నమ్మకం తనకుందని, అందులో భాగం కావడం తనకూ ఇష్టమేనని మాధురి చెప్పింది. ఈ సినిమాలో ఇంకా నసీరుద్దీన్ షా, హుమా ఖురేషీ, అర్షద్ వార్సీ ఉన్నారు.