వెండితెరపై విషాద నాటకం
సినిమా
వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఎటువంటి దాగుడుమూతలు లేకుండా వినిపించిన బలమైన అవతలి గొంతు ‘హైదర్’. ఇలాంటి సినిమాను ఈ పద్ధతిలో తీయవచ్చా... సాధ్యమా... ఇంత ధైర్యం ఇంకా మిగిలి ఉందా... చీటికి మాటికి నిరసనలు సినిమాహాళ్ల దగ్గర ధర్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో కూడా తాము నమ్మిన ఒక సత్యాన్ని సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చా? చెప్పవచ్చు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ చెప్పి చూపించాడు. బహుశా కాశ్మీరీల జీవితాన్ని లోకానికి చెప్పి తీరాలి అని అతడు నిజాయితీగా గట్టిగా అనుకోవడమే దీనికి కారణం కావచ్చు. ఇందుకు అతడు షేక్‌స్పియర్ ప్రఖ్యాత నాటకం
‘హామ్లెట్’ని ఒక ముఖ్యమైన ఆధారంగా తీసుకున్నాడు. అయితే ఇది కేవలం ఆధారం మాత్రమే. కాని ఈ కథలో దర్శకుడు చూపించాలనుకున్నది ‘90ల నాటి కాశ్మీర్ పరిస్థితి, వేర్పాటు ఉద్యమం, ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రమేయం, విరుగుడుగా భారత సైన్యం, దాని మద్దతుతో పనిచేసే సంస్థలు, వీటితో సంబంధం లేకుండా స్వతంత్రం కావాలనుకునే మరికొన్ని సంస్థలు, వీటిని అడ్డు పెట్టుకొని లాభపడాలనుకునే రాజకీయ నాయకులు, ఇన్ని విరుద్ధ శక్తుల మధ్య నలిగిపోయిన సామాన్య ప్రజలు- వీటన్నింటినీ దర్శకుడు చూపించ దలుచుకున్నాడు. ఇందుకు ‘హైదర్’ అనే ఒక నవయువకుణ్ణి అతడి చివికిపోయిన కుటుంబాన్ని కేంద్రంగా చేసుకున్నాడు.
కాశ్మీర్ ఉద్యమంలో హటాత్తుగా మాయమై ఆచూకీ దొరక్కుండా పోయిన వేల మంది కాశ్మీరీలు ఉన్నారు. అలాంటి కాశ్మీరీలలో హైదర్ తండ్రి కూడా ఒకడు. అలా అదృశ్యమైన తండ్రిని వెతకడం కోసం హైదర్ కాశ్మీరుకు రావడంతో కథ ప్రారంభమవుతుంది. కాని వచ్చాక అతడికి ఊహించని విషయం తెలుస్తుంది. తన తల్లి తన బాబాయ్‌తో మెలగడం గమనిస్తాడు. అది చాలనట్టు ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా తన తండ్రి తన తల్లి సహకారంతో బాబాయ్ కుట్ర వల్ల చంపించబడ్డాడన్న సంగతిని తెలుసుకుంటాడు. అసలే బయట ఒక విధ్వంసం. ఇప్పుడు లోపల ఒక విధ్వంసం. ఆ తర్వాత జరిగిన అనేకానేక సంఘటనలు అతని ప్రమేయం లేకుండానే అతన్ని ఒక విషవలయంలోకి లాగుతాయి.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు చెప్పిన దాంట్లో ఎంత నిజమున్నదో తెలియదు. ఎవరివి నిజాలో ఎవరివి అబద్ధాలో తెలియదు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో తెలియదు. ఏ కన్నీళ్లు నకిలీవో ఏవి నిజమైనవో తెలియదు. ఏ ఆలింగనం వెనుక ఏ కుట్ర దాగుందో తెలియదు. ఇది ఒక్క హైదర్ పరిస్థితి మాత్రమే కాదు. సమస్త కాశ్మీరీలది కూడా.
దీనికి కారణం ఎవరు? ఒక ప్రజా సమూహాన్ని అబద్ధంలో అభద్రతలో వంచనలో అపనమ్మకంలో అనైతికంలో నెట్టింది ఎవరు? దీనికి బీజం ఎక్కడ పడింది... దీనిని చర్చిస్తాడు దర్శకుడు. కొన్ని నేరుగా చెబుతాడు. కొన్ని ప్రేక్షకులకు వదిలిపెడతాడు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్, టబూ వంటి గొప్ప నటీనటులు పని చేశారు. నాటి కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన కవిత్వాన్ని ఇందులో రెండు పాటలుగా
మలిచారు. మెహదీ హసన్ గజల్ ఉంది. మరి రెండు పాటలకు గుల్జార్ కలంకరణ చేశాడు. బషారత్ పీర్ అనే కాశ్మీరీ జర్నలిస్టు తన జీవితంలో చూసిన వాస్తవ కథనాలను అందించాడు. ‘ప్రతీకారంతో మరింత ప్రతీకారం తప్ప జరిగేదేమీ ఉండదు’ అనే డైలాగ్ ఇందులో ఉంది. ఈ ప్రతీకారాల వర్తమానం, సరిహద్దుల్లో కాల్పులు, వలస పోతున్న ప్రజానీకం ఇవాళ మనం చూస్తున్నాం.
‘కాశ్మీర్ మొత్తం జైలులా ఉంది’ అనడానికి చాలా సాహసం కావాలి. ఆ గొంతు వినడానికి సంయమనం కావాలి. మన సినిమా మరింత ముందుకెళ్లింది అనడానికి ఈ సినిమా ఒక నిదర్శనం.
- కృష్ణమోహన్‌బాబు
98480 23384