Krishna Mohan babu
-
తిరుమల కొండకి పద చిత్రాల పూజ
సీనియర్ జర్నలిస్టు పున్నా కృష్ణమూర్తి ‘తిరుమల కొండ పద చిత్రాలు’గా అందించిన అపురూపమైన పుస్తకం తిరుమలసాయికి ‘తొలి వందనము’ సమర్పిస్తూ మొదలవుతుంది. నిండుగా పూచిన మల్లెపొద లాంటి ఈ పుస్తకంలో ఎన్నెన్నో పరిమళభరిత విషయాలు! తిరుమలకొండ తొలి పేరు ‘వేంగడం’. 8వ శతాబ్దం దాకా వచ్చిన తమిళ సాహిత్యంలో కొండ మీద దేవుడు గురించి ఎవరూ నిర్దిష్టంగా చెప్పలేదు. వేట ప్రధానంగా జీవించిన గిరిజనులు ‘వేంగళాంబ’ అనే స్త్రీ దేవతను కొలిచి జాతరలు చేసుకునే వారని ప్రస్తావనలు ఉన్నాయి. దేవీ భాగవతం ‘వేంకటేశ్వరి’ అంది. స్కంధ, మార్కండేయ పురాణాలు చూపించి శైవులు ‘కుమారస్వామి’ అన్నారు. చివరికి రామానుజుడు విష్ణు అవతారమైన ‘వేంకటేశ్వరు’డని అందర్నీ ఒప్పించాడు. అందుకే అన్నమయ్య ‘ఎంత మాత్రమున ఎవ్వరు కొలిచిన అంత మాత్రమే నీవు’ అని తీర్పు చెప్పాడు. వేంగడం, వేంకటం, వెంకటగిరి అయింది. వేంకటేశ్వరుని తమ స్వామిగా చేసుకుని, వైష్ణవ గురువులు 12 మంది ఆళ్వారులు ‘పాశురా’లతో స్వామిని కీర్తించారు. ఆళ్వారులలో బ్రాహ్మలే కాకుండా క్షత్రియులు, శూద్రులు, పంచములు, ఓ స్త్రీ కూడా ఉన్నారు. భారతదేశంలో పరాయి పాలకుల దండయాత్ర జరగని ప్రముఖ ఆలయం తిరుమల ఒక్కటే. కొండలయ్య కోసం జుట్టు పెంచుకొని, బీబీ నాంచారమ్మ కోసం తలనీలాలు యిస్తారన్న కథ హైదర్ అలీని కొండపై దండెత్తకుండా చేసింది. ఆర్కాట్ నవాబుల దగ్గరి నుంచి ప్రతి ఒక్కరూ కొండపై శాంతినే కోరుకున్నారు. అక్కడ పవిత్రత దెబ్బతింటే భక్తులు రారు. హుండీ నిండదు. ఫలితంగా తిరుమలలో పన్నులు ప్రవేశించాయి. పెళ్లి కోసం వేంకటేశ్వరుడు అప్పులు చేశాడనే కథలు పుట్టాయి. నిలువు దోపిడీ మొక్కులు ప్రవేశించాయి. కంచి రాజధానిగా పాలించిన పల్లవ రాజవంశీకురాలు సామవాయి సమకూర్చిన నిధులతో 966 ఆగస్టు 30న మొదటి బ్రహ్మోత్సవం జరిగింది. 14వ శతాబ్దం వరకు బ్రహ్మోత్సవాలు తప్ప, యితర ఉత్సవాలు లేని తిరుమలలో 17వ శతాబ్దానికి 429 పండగలొచ్చి చేరి ‘నిత్య కల్యాణం పచ్చ తోరణం’ అయింది. పద్మశాలీల ఆడపడుచు పద్మావతీ దేవి 12వ శతాబ్దంలోనే అస్తిత్వంలోకి వచ్చింది. 29 శ్లోకాలతో కూడిన సుప్రభాతాన్ని ప్రతివాది భయంకర అన్నన్ 1430లో రాశారు. ఇలా తిరుమలతో అనుబంధం ఉన్న వ్యక్తులు, నమ్మకాలు, తీర్థాలు, చారిత్రకాంశాలను 2002లో వచ్చిన ఈ పుస్తకం చక్కగా వివరిస్తుంది. స్వయంగా ఫొటోగ్రాఫర్ కూడా అయిన పున్నా కృష్ణమూర్తి(ఫోన్: 7680950863) ప్రతీ పేజీని ఒక చక్కటి ఫొటోతో ప్రెజెంట్ చేయడం వల్ల పుస్తకం అందం పెరిగింది. కృష్ణమోహన్ బాబు 9848023384 -
వెండితెరపై విషాద నాటకం
సినిమా వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఎటువంటి దాగుడుమూతలు లేకుండా వినిపించిన బలమైన అవతలి గొంతు ‘హైదర్’. ఇలాంటి సినిమాను ఈ పద్ధతిలో తీయవచ్చా... సాధ్యమా... ఇంత ధైర్యం ఇంకా మిగిలి ఉందా... చీటికి మాటికి నిరసనలు సినిమాహాళ్ల దగ్గర ధర్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో కూడా తాము నమ్మిన ఒక సత్యాన్ని సాహిత్యాన్ని ఆధారంగా చేసుకొని చెప్పవచ్చా? చెప్పవచ్చు. దర్శకుడు విశాల్ భరద్వాజ్ చెప్పి చూపించాడు. బహుశా కాశ్మీరీల జీవితాన్ని లోకానికి చెప్పి తీరాలి అని అతడు నిజాయితీగా గట్టిగా అనుకోవడమే దీనికి కారణం కావచ్చు. ఇందుకు అతడు షేక్స్పియర్ ప్రఖ్యాత నాటకం ‘హామ్లెట్’ని ఒక ముఖ్యమైన ఆధారంగా తీసుకున్నాడు. అయితే ఇది కేవలం ఆధారం మాత్రమే. కాని ఈ కథలో దర్శకుడు చూపించాలనుకున్నది ‘90ల నాటి కాశ్మీర్ పరిస్థితి, వేర్పాటు ఉద్యమం, ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రమేయం, విరుగుడుగా భారత సైన్యం, దాని మద్దతుతో పనిచేసే సంస్థలు, వీటితో సంబంధం లేకుండా స్వతంత్రం కావాలనుకునే మరికొన్ని సంస్థలు, వీటిని అడ్డు పెట్టుకొని లాభపడాలనుకునే రాజకీయ నాయకులు, ఇన్ని విరుద్ధ శక్తుల మధ్య నలిగిపోయిన సామాన్య ప్రజలు- వీటన్నింటినీ దర్శకుడు చూపించ దలుచుకున్నాడు. ఇందుకు ‘హైదర్’ అనే ఒక నవయువకుణ్ణి అతడి చివికిపోయిన కుటుంబాన్ని కేంద్రంగా చేసుకున్నాడు. కాశ్మీర్ ఉద్యమంలో హటాత్తుగా మాయమై ఆచూకీ దొరక్కుండా పోయిన వేల మంది కాశ్మీరీలు ఉన్నారు. అలాంటి కాశ్మీరీలలో హైదర్ తండ్రి కూడా ఒకడు. అలా అదృశ్యమైన తండ్రిని వెతకడం కోసం హైదర్ కాశ్మీరుకు రావడంతో కథ ప్రారంభమవుతుంది. కాని వచ్చాక అతడికి ఊహించని విషయం తెలుస్తుంది. తన తల్లి తన బాబాయ్‌తో మెలగడం గమనిస్తాడు. అది చాలనట్టు ఒక అజ్ఞాత వ్యక్తి ద్వారా తన తండ్రి తన తల్లి సహకారంతో బాబాయ్ కుట్ర వల్ల చంపించబడ్డాడన్న సంగతిని తెలుసుకుంటాడు. అసలే బయట ఒక విధ్వంసం. ఇప్పుడు లోపల ఒక విధ్వంసం. ఆ తర్వాత జరిగిన అనేకానేక సంఘటనలు అతని ప్రమేయం లేకుండానే అతన్ని ఒక విషవలయంలోకి లాగుతాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు చెప్పిన దాంట్లో ఎంత నిజమున్నదో తెలియదు. ఎవరివి నిజాలో ఎవరివి అబద్ధాలో తెలియదు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారో తెలియదు. ఏ కన్నీళ్లు నకిలీవో ఏవి నిజమైనవో తెలియదు. ఏ ఆలింగనం వెనుక ఏ కుట్ర దాగుందో తెలియదు. ఇది ఒక్క హైదర్ పరిస్థితి మాత్రమే కాదు. సమస్త కాశ్మీరీలది కూడా. దీనికి కారణం ఎవరు? ఒక ప్రజా సమూహాన్ని అబద్ధంలో అభద్రతలో వంచనలో అపనమ్మకంలో అనైతికంలో నెట్టింది ఎవరు? దీనికి బీజం ఎక్కడ పడింది... దీనిని చర్చిస్తాడు దర్శకుడు. కొన్ని నేరుగా చెబుతాడు. కొన్ని ప్రేక్షకులకు వదిలిపెడతాడు. ఈ సినిమా కోసం షాహిద్ కపూర్, టబూ వంటి గొప్ప నటీనటులు పని చేశారు. నాటి కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ రాసిన కవిత్వాన్ని ఇందులో రెండు పాటలుగా మలిచారు. మెహదీ హసన్ గజల్ ఉంది. మరి రెండు పాటలకు గుల్జార్ కలంకరణ చేశాడు. బషారత్ పీర్ అనే కాశ్మీరీ జర్నలిస్టు తన జీవితంలో చూసిన వాస్తవ కథనాలను అందించాడు. ‘ప్రతీకారంతో మరింత ప్రతీకారం తప్ప జరిగేదేమీ ఉండదు’ అనే డైలాగ్ ఇందులో ఉంది. ఈ ప్రతీకారాల వర్తమానం, సరిహద్దుల్లో కాల్పులు, వలస పోతున్న ప్రజానీకం ఇవాళ మనం చూస్తున్నాం. ‘కాశ్మీర్ మొత్తం జైలులా ఉంది’ అనడానికి చాలా సాహసం కావాలి. ఆ గొంతు వినడానికి సంయమనం కావాలి. మన సినిమా మరింత ముందుకెళ్లింది అనడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. - కృష్ణమోహన్‌బాబు 98480 23384 -
హిందూస్తానీ సంగీతమయ ప్రపంచం...
తెలుసుకోదగ్గ పుస్తకం/ స్వరలయలు: కృష్ణుడు యమునా నది ఆవలి తీరాన బృందావనంలో వేణువు ఊదుతున్నాడు. అది గోపికను రమ్మని సంకేతం. కాని ప్రకృతి ప్రతికూలించింది. ఆకాశం నిండా నల్లని మబ్బులు, భయంకరమైన ఉరుములు, మెరుపులు, కుండపోత వర్షం. యమునా నది ఉప్పొంగి పారుతోంది. ఎట్లాగూ వెళ్లలేదు ఆమె. కాబట్టి ఏడుస్తున్నది. రసియా మోహె బులాయె నయనా నీర్ బహాయే... ఖమాజ్ రాగంలో ఈ ఠుమ్రీని పాడుతున్నప్పుడు పర్వీన్ సుల్తానా ఈ లోకంలో లేదు. కళ్లు అశ్రుసిక్తాలయినాయి. కాటుక కరిగి చెంపల మీద చారికలు కట్టింది. శ్రోతలంతా గమనిస్తున్నారు. కాని ఆమెకా స్పృహ లేదు. అంతటి తాదాత్మ్యం ఆ గాయనిది. హేమంత్ రాగంలో ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ తన మధుర మంజుల గాత్రంతో యాద్ పియాకి ఆయే ఏ దుఃఖ్ సహాన జాయే అని విరహ వేదన వ్యక్తం చేస్తున్నాడు. అతని కంఠం ఎంత మధురమైనదంటే అంతటి భారీకాయం, బొద్దు మీసాలు, పెద్దపులి తల గల ఉస్తాదుకు బదులు పదునారేళ్ల ప్రాయంగల సుకుమార సుందరి విరహ వ్యథను అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది శ్రోతలకు. ఈ ముచ్చట్లు డా. సామల సదాశివ ‘స్వరలయలు’ పుస్తకం లోనివి. 2011-12 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన ఈ పుస్తకాన్ని చెలిమి ఫౌండేషన్ వాళ్లు ప్రచురించారు. దేశమంతా వ్యాపించిన హిందుస్తానీ సంగీతాన్ని సజీవంగా సుసంపన్నంగా రకరకాల మార్పులనీ చేర్పులనీ చేసుకుంటూ కులమత భేదాలు లేకుండా తమ భుజాలకెత్తుకుని మోసిన మోస్తున్న అనేకమంది విద్వాంసుల గురించిన విశేషాల సమాహారమే ఈ పుస్తకం. నిజం చెప్పాలంటే హిందూస్తానీ సంగీతానికి సంబంధించి ఒక సాధికారమైన చరిత్రని, వివిధ ఘరానాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, వాటి విస్తరణతో సహా చందమామ కథల్లా చాలా చక్కని ‘యమన్’ ఆలాపనలా మన ముందు సాక్షాత్కరింప చేశారు రచయిత. సంగీత సామ్రాట్ తాన్సేన్, అక్బర్ చక్రవర్తి మారువేషాలలో వెళ్లి పూలపొదల చాటున నక్కి తాన్సేన్ గురువు స్వామి హరిదాసు గానాన్ని విన్న ముచ్చట మొదలుకొని, తొంభై ఏళ్ల వయసులో తెల్లవారుజామున బొంబాయిలోని విక్రమాదిత్య హోటలులో అన్ని ఘరానాల ఉస్తాదుల ముందు తన సంగీతంతో ఉర్రూతలూగించిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్, ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్క రకంగా గానాన్ని ప్రదర్శించే కేసరీబాయి కేర్కర్, రోషనారా బేగమ్లాంటి విద్వాంసుల్ని నివ్వెర పరచిన హీరాబాయి బరోదేకర్, ఉస్తాద్ కరీంఖాన్, గంగూబాయి హంగల్, ప్రభా ఆత్రే... ఒక్కరని ఏంటి అనేకానేక ముచ్చట్లు పూల సుగంధాలు పరిమళించినట్లు. దేని సువాసన దానిదే. జాతీయోద్యమాలు, గణపతి మండళ్లు, సామూహిక కార్యక్రమాలు... ఇవన్నీ హిందూస్తానీ సంగీతాన్ని ఒక్క పండితులకే కాక పామరులను కూడా దానిలో భాగం చేసి సుసంపన్నం చేశాయి. ఈ సంగీతం శాఖోపశాఖలై శాస్త్రీయ, ఉపశాస్త్రీయ, లోక్ సంగీత్‌లు, రంగ మంచ్‌లు, భక్తి సంగీతం, సినిమా సంగీతాలుగా విస్తరించి మన జీవితంలో ఒక ముఖ్య భాగం అయింది. ఈ చరిత్రనంతటిని ఈ పుస్తకం మన కళ్లముందుంచుతుంది. - కృష్ణమోహన్‌బాబు -
మండే మంటో కథలు...
కొత్త పుస్తకం: ‘‘ఆ మంద ఉన్నట్టుండి ఎడమవైపుకు తిరిగింది. లాహోరులోని గొప్ప హిందూ తత్వవేత్త శ్రీ గంగారాం పాలరాతి విగ్రహంపై ఆ మంద చూపు నిలిచిపోయింది. ఒకడు విగ్రహం మొహానికి నల్లగా తారు పూశాడు. మరొకడు చెప్పులు దండగుచ్చి దాని మెడలో వేస్తుండగా పోలీసులు వచ్చారు. కాల్పులు జరుపుతూ చెప్పుల దండ పట్టుకున్న వ్యక్తికేసి కాల్చారు. తూటా తగిలింది. తర్వాత అతన్ని దగ్గర్లోని శ్రీ గంగారాం పేరు మీద ఉన్న ఆసుపత్రికి తీసుకుపోయారు’’ ‘‘ఆ రైలును దుండగులు ఆపేశారు. వేరే మతానికి చెందిన వారినందర్ని ఒక క్రమపద్ధతిలో ఏరి నరికి పారేశారు. అది ముగిశాక మిగిలిన వారందరికీ పండ్లు మిఠాయిలు పంచి పెట్టారు. మళ్లీ రైలు కదిలే ముందు ఆ హంతకుల నాయకుడు అన్నాడు- ‘ప్రియమైన సోదర సోదరీమణులారా! మాకు మీ రైలొచ్చే సమయం ముందుగా తెలియకపోవడం వల్ల ఇంతకు మించిన ఆతిథ్యం ఏర్పాటు చేయలేకపోయాం. ఇంకా మంచి ఆతిథ్యం ఇచ్చి ఉంటే బాగుంటుందని అనుకున్నాం.’’ సాదత్ హసన్ మంటో రాసిన గల్పికలలో మచ్చుకి రెండు ఇవి. దేవి అనువదించిన పదకొండు కథలు, మరికొన్ని గల్పికలతో ‘మంటో కథలు’ సంపుటి వెలువడింది. అంతకు ముందు హెచ్‌బిటి వాళ్లు కూడా మంటో కథల పుస్తకాన్ని తెచ్చారు. అయితే ఈ సంపుటిలో దేవి- మంటో భావాల్ని అతి దగ్గరగా అనువదించడమే కాకుండా, ఎంచుకున్న కథలన్నీ అన్ని కాలాలకూ అన్ని దేశాలకూ ప్రతిబింబంలా ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. మతం, హింస, ద్వేషం, విభజన ఉన్నంత కాలం ఈ కథలన్నీ సజీవంగానే ఉంటాయి. 1947 విభజన అయినా, 1984 శిక్కు ఊచకోతలయినా, 2002 గుజరాత్ మత విద్వేషాలైనా, 2013 ముజఫర్ నగర్ హింస అయినా అన్నింటికీ మూలం మతం, ద్వేషం, రాజ్యం. ఇవన్నీ ఉన్నంత కాలం మంటో కథలు మనకు మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తాయి. అందుకే అతని కథలన్నీ అరె.. నిన్ననే కదా జరిగాయి అని అన్పిస్తాయి. అధికారం, మతం ఎంత క్రూరంగా ఉంటాయో మనిషి ఎన్ని భిన్న స్వభావాల సమాహారమో చెప్పాలంటే మంటోని చదవాల్సిందే. దేశ విభజన జరిగిన మూడేళ్లకి ఇరు దేశాలలో ఉన్న పిచ్చివాళ్లని కూడా బదలాయించుకోవాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ పిచ్చివాళ్లలో ఒకడు బిషన్ సింగ్. తన వాళ్లందరూ వదిలేసి వెళ్లిపోయినా తనను పట్టించుకునే వాళ్లు ఎవరూ లేకపోయినా తను పుట్టి పెరిగిన ప్రదేశం పాకిస్తాన్‌లోనే ఉందని తెలిసినా జ్ఞాపకాలు వదలుకోలేక ఆ దేశం వదలటం ఇష్టం లేక సరిహద్దులలో ముళ్ల తీగ మీద పడి ప్రాణం తీసుకున్న ఒక పిచ్చివాడి దీన కథే ‘తోబా టేక్ సింగ్’. మత పిచ్చిలో మునిగి తేలుతున్న వాళ్లకి ఈ తోబా టేక్‌సింగ్‌లు ఎక్కడ గుర్తుంటారు? మనిషిలోని అమానవీయతకీ మతానికీ సంబంధం లేదు. రక్షించి తీసుకు వసారనుకున్న వాళ్లే అతి హీనంగా ప్రవర్తించి, మనిషిలోని చీకటి కోణాన్ని బయట పెట్టిన కథ - తెరువు. నన్ను నమ్ముకున్న వాళ్లు వేరే మతం వాళ్లయినా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ప్రాణాలు కోల్పోయిన సహాయ్‌లాంటి మానవతా మూర్తులు ‘1947 కథ’లో కనిపిస్తే ఎంతటి మానవ విషాదాన్నైనా సంపాదనా మార్గాలుగా మలుచుకునే వ్యాపార వర్గాల వారు ‘అమరత్వం’ కథలో కనపడతారు. ఇక ‘చల్లని మాంసం’ కథ. ఈ కథ రాసినందుకు మంటోకు హైకోర్టు 300 రూపాయల జరిమానా విధించింది. నేడు ఈ కథ చదువుతుంటే జుగుప్సతో మనం గడ్డ కట్టుకుపోతాము. ఇలా ఏ కథ గొప్పదనం ఆ కథదే. మొదట్లో మంటో గురించిన పరిచయం చాలా బాగుంది. చివర్లో ఆర్టిస్ట్ మోహన్ చివరి మాటలు బాగున్నాయి. సాదత్ హసన్ మంటో కథలు; అనువాదం: దేవి; వెల: రూ.60/- ప్రతులకు: 9010646492 - కృష్ణమోహన్ బాబు