హిందూస్తానీ సంగీతమయ ప్రపంచం...
తెలుసుకోదగ్గ పుస్తకం/ స్వరలయలు: కృష్ణుడు యమునా నది ఆవలి తీరాన బృందావనంలో వేణువు ఊదుతున్నాడు. అది గోపికను రమ్మని సంకేతం. కాని ప్రకృతి ప్రతికూలించింది. ఆకాశం నిండా నల్లని మబ్బులు, భయంకరమైన ఉరుములు, మెరుపులు, కుండపోత వర్షం. యమునా నది ఉప్పొంగి పారుతోంది. ఎట్లాగూ వెళ్లలేదు ఆమె. కాబట్టి ఏడుస్తున్నది.
రసియా మోహె బులాయె
నయనా నీర్ బహాయే...
ఖమాజ్ రాగంలో ఈ ఠుమ్రీని పాడుతున్నప్పుడు పర్వీన్ సుల్తానా ఈ లోకంలో లేదు. కళ్లు అశ్రుసిక్తాలయినాయి. కాటుక కరిగి చెంపల మీద చారికలు కట్టింది. శ్రోతలంతా గమనిస్తున్నారు. కాని ఆమెకా స్పృహ లేదు. అంతటి తాదాత్మ్యం ఆ గాయనిది.
హేమంత్ రాగంలో ఉస్తాద్ బడే గులామ్ అలీఖాన్ తన మధుర మంజుల గాత్రంతో
యాద్ పియాకి ఆయే
ఏ దుఃఖ్ సహాన జాయే
అని విరహ వేదన వ్యక్తం చేస్తున్నాడు. అతని కంఠం ఎంత మధురమైనదంటే అంతటి భారీకాయం, బొద్దు మీసాలు, పెద్దపులి తల గల ఉస్తాదుకు బదులు పదునారేళ్ల ప్రాయంగల సుకుమార సుందరి విరహ వ్యథను అనుభవిస్తున్నట్లు అనిపిస్తుంది శ్రోతలకు.
ఈ ముచ్చట్లు డా. సామల సదాశివ ‘స్వరలయలు’ పుస్తకం లోనివి. 2011-12 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని పొందిన ఈ పుస్తకాన్ని చెలిమి ఫౌండేషన్ వాళ్లు ప్రచురించారు. దేశమంతా వ్యాపించిన హిందుస్తానీ సంగీతాన్ని సజీవంగా సుసంపన్నంగా రకరకాల మార్పులనీ చేర్పులనీ చేసుకుంటూ కులమత భేదాలు లేకుండా తమ భుజాలకెత్తుకుని మోసిన మోస్తున్న అనేకమంది విద్వాంసుల గురించిన విశేషాల సమాహారమే ఈ పుస్తకం.
నిజం చెప్పాలంటే హిందూస్తానీ సంగీతానికి సంబంధించి ఒక సాధికారమైన చరిత్రని, వివిధ ఘరానాలు, వాటి పుట్టుపూర్వోత్తరాలు, వాటి విస్తరణతో సహా చందమామ కథల్లా చాలా చక్కని ‘యమన్’ ఆలాపనలా మన ముందు సాక్షాత్కరింప చేశారు రచయిత.
సంగీత సామ్రాట్ తాన్‌సేన్, అక్బర్ చక్రవర్తి మారువేషాలలో వెళ్లి పూలపొదల చాటున నక్కి తాన్‌సేన్ గురువు స్వామి హరిదాసు గానాన్ని విన్న ముచ్చట మొదలుకొని, తొంభై ఏళ్ల వయసులో తెల్లవారుజామున బొంబాయిలోని విక్రమాదిత్య హోటలులో అన్ని ఘరానాల ఉస్తాదుల ముందు తన సంగీతంతో ఉర్రూతలూగించిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్, ఒక్కొక్క వేదిక మీద ఒక్కొక్క రకంగా గానాన్ని ప్రదర్శించే కేసరీబాయి కేర్కర్, రోషనారా బేగమ్‌లాంటి విద్వాంసుల్ని నివ్వెర పరచిన హీరాబాయి బరోదేకర్, ఉస్తాద్ కరీంఖాన్, గంగూబాయి హంగల్, ప్రభా ఆత్రే... ఒక్కరని ఏంటి అనేకానేక ముచ్చట్లు పూల సుగంధాలు పరిమళించినట్లు. దేని సువాసన దానిదే.
జాతీయోద్యమాలు, గణపతి మండళ్లు, సామూహిక కార్యక్రమాలు... ఇవన్నీ హిందూస్తానీ సంగీతాన్ని ఒక్క పండితులకే కాక పామరులను కూడా దానిలో భాగం చేసి సుసంపన్నం చేశాయి. ఈ సంగీతం శాఖోపశాఖలై శాస్త్రీయ, ఉపశాస్త్రీయ, లోక్ సంగీత్‌లు, రంగ మంచ్‌లు, భక్తి సంగీతం, సినిమా సంగీతాలుగా విస్తరించి మన జీవితంలో ఒక ముఖ్య భాగం అయింది. ఈ చరిత్రనంతటిని ఈ పుస్తకం మన కళ్లముందుంచుతుంది.
- కృష్ణమోహన్‌బాబు