మండే మంటో కథలు... | New Book : Saadat Hasan Manto Stories | Sakshi
Sakshi News home page

మండే మంటో కథలు...

Published Mon, Nov 25 2013 3:21 AM | Last Updated on Mon, Aug 13 2018 7:54 PM

మండే మంటో కథలు... - Sakshi

మండే మంటో కథలు...

కొత్త పుస్తకం: ‘‘ఆ మంద ఉన్నట్టుండి ఎడమవైపుకు తిరిగింది. లాహోరులోని గొప్ప హిందూ తత్వవేత్త శ్రీ గంగారాం పాలరాతి విగ్రహంపై ఆ మంద చూపు నిలిచిపోయింది. ఒకడు విగ్రహం మొహానికి నల్లగా తారు పూశాడు. మరొకడు చెప్పులు దండగుచ్చి దాని మెడలో వేస్తుండగా పోలీసులు వచ్చారు. కాల్పులు జరుపుతూ చెప్పుల దండ పట్టుకున్న వ్యక్తికేసి కాల్చారు. తూటా తగిలింది. తర్వాత అతన్ని దగ్గర్లోని శ్రీ గంగారాం పేరు మీద ఉన్న ఆసుపత్రికి తీసుకుపోయారు’’
 
 ‘‘ఆ రైలును దుండగులు ఆపేశారు. వేరే మతానికి చెందిన వారినందర్ని ఒక క్రమపద్ధతిలో ఏరి నరికి పారేశారు. అది ముగిశాక మిగిలిన వారందరికీ పండ్లు మిఠాయిలు పంచి పెట్టారు. మళ్లీ రైలు కదిలే ముందు ఆ హంతకుల నాయకుడు అన్నాడు- ‘ప్రియమైన సోదర సోదరీమణులారా! మాకు మీ రైలొచ్చే సమయం ముందుగా తెలియకపోవడం వల్ల ఇంతకు మించిన ఆతిథ్యం ఏర్పాటు చేయలేకపోయాం. ఇంకా మంచి ఆతిథ్యం ఇచ్చి ఉంటే బాగుంటుందని అనుకున్నాం.’’

 సాదత్ హసన్ మంటో రాసిన గల్పికలలో మచ్చుకి రెండు ఇవి. దేవి అనువదించిన పదకొండు కథలు, మరికొన్ని గల్పికలతో ‘మంటో కథలు’ సంపుటి వెలువడింది. అంతకు ముందు హెచ్‌బిటి వాళ్లు కూడా మంటో కథల పుస్తకాన్ని తెచ్చారు. అయితే ఈ సంపుటిలో దేవి- మంటో భావాల్ని అతి దగ్గరగా అనువదించడమే కాకుండా, ఎంచుకున్న కథలన్నీ అన్ని కాలాలకూ అన్ని దేశాలకూ ప్రతిబింబంలా ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. మతం, హింస, ద్వేషం, విభజన ఉన్నంత కాలం ఈ కథలన్నీ సజీవంగానే ఉంటాయి. 1947 విభజన అయినా, 1984 శిక్కు ఊచకోతలయినా, 2002 గుజరాత్ మత విద్వేషాలైనా, 2013 ముజఫర్ నగర్ హింస అయినా అన్నింటికీ మూలం మతం, ద్వేషం, రాజ్యం. ఇవన్నీ ఉన్నంత కాలం మంటో కథలు మనకు మళ్లీ మళ్లీ గుర్తుకు వస్తాయి. అందుకే అతని కథలన్నీ అరె.. నిన్ననే కదా జరిగాయి అని అన్పిస్తాయి.
 
 అధికారం, మతం ఎంత క్రూరంగా ఉంటాయో మనిషి ఎన్ని భిన్న స్వభావాల సమాహారమో చెప్పాలంటే మంటోని చదవాల్సిందే. దేశ విభజన జరిగిన మూడేళ్లకి ఇరు దేశాలలో ఉన్న పిచ్చివాళ్లని కూడా బదలాయించుకోవాలని రెండు ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఆ పిచ్చివాళ్లలో ఒకడు బిషన్ సింగ్. తన వాళ్లందరూ వదిలేసి వెళ్లిపోయినా తనను పట్టించుకునే వాళ్లు ఎవరూ లేకపోయినా తను పుట్టి పెరిగిన ప్రదేశం పాకిస్తాన్‌లోనే ఉందని తెలిసినా జ్ఞాపకాలు వదలుకోలేక ఆ దేశం వదలటం ఇష్టం లేక సరిహద్దులలో ముళ్ల తీగ మీద పడి ప్రాణం తీసుకున్న ఒక పిచ్చివాడి దీన కథే ‘తోబా టేక్ సింగ్’. మత పిచ్చిలో మునిగి తేలుతున్న వాళ్లకి ఈ తోబా టేక్‌సింగ్‌లు ఎక్కడ గుర్తుంటారు?
 
 మనిషిలోని అమానవీయతకీ మతానికీ సంబంధం లేదు. రక్షించి తీసుకు వసారనుకున్న వాళ్లే అతి హీనంగా ప్రవర్తించి, మనిషిలోని చీకటి కోణాన్ని బయట పెట్టిన కథ - తెరువు. నన్ను నమ్ముకున్న వాళ్లు వేరే మతం వాళ్లయినా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడం కోసం ప్రాణాలు కోల్పోయిన సహాయ్‌లాంటి మానవతా మూర్తులు ‘1947 కథ’లో కనిపిస్తే ఎంతటి మానవ విషాదాన్నైనా సంపాదనా మార్గాలుగా మలుచుకునే వ్యాపార వర్గాల వారు ‘అమరత్వం’ కథలో కనపడతారు. ఇక ‘చల్లని మాంసం’ కథ. ఈ కథ రాసినందుకు మంటోకు హైకోర్టు 300 రూపాయల జరిమానా విధించింది. నేడు ఈ కథ చదువుతుంటే జుగుప్సతో మనం గడ్డ కట్టుకుపోతాము. ఇలా ఏ కథ గొప్పదనం ఆ కథదే.  మొదట్లో మంటో గురించిన పరిచయం చాలా బాగుంది. చివర్లో ఆర్టిస్ట్ మోహన్ చివరి మాటలు బాగున్నాయి.
 సాదత్ హసన్ మంటో కథలు; అనువాదం: దేవి; వెల: రూ.60/-
 ప్రతులకు: 9010646492
 - కృష్ణమోహన్ బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement