దక్షిణ కొరియా అధ్యక్షుని నిర్ణయంతో మరోమారు తెరపైకి మార్షల్ లా
పార్లమెంట్‌లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో రద్దు
తరచూ మార్షల్ లా ప్రయోగించిన అపఖ్యాతి పాలైన పాకిస్తాన్
దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు అమలు
శాంతి భద్రతల నుండి న్యాయ వ్యవస్థ వరకు సర్వం సైన్యం చేతుల్లోకి..
ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకలో, యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో..
రాజకీయాలపై ఆసక్తి కలిగినవారికి ప్రపంచ రాజకీయ చిత్రం ప్రతిరోజూ కొత్తగా కనిపిస్తుంది. తాజాగా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యోల్ ఉన్నట్టుండి ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ఉలిక్కిపడింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కలకలం చెలరేగింది. అయితే ఇంతలోనే అక్కడి పార్లమెంట్‌లో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో దానిని రద్దు చేయాల్సి వచ్చింది.
చర్చనీయాంశంగా మారి..
1980 తర్వాత దక్షిణ కొరియాలో మార్షల్ లా(సైనిక పాలన) విధించడం ఇదే తొలిసారి. ఈ నేపధ్యంలో మరోసారి మార్షల్ లా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ ఈ మార్షల్ లా చట్టాన్ని తరచూ అమలు చేసి, అపఖ్యాతి పాలయ్యింది. ఇంతకీ మార్షల్ లా అంటే ఏమిటి? అ చట్టాన్ని అమలు చేసినప్పుడు దేశంలోని పరిస్థితులు ఎలా ఉంటాయి?
శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు..
నిజానికి మార్షల్ లా అంటే దేశ అధికారమంతా సైన్యం చేతుల్లోకి వెళ్లడం. దేశంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించినప్పుడు దీనిని అమలు చేస్తారు. ఇది దేశంలోని ఒక నిర్దిష్ట ప్రాంతానికి లేదా దేశమంతటికీ వర్తించవచ్చు. ఇది అమలైనప్పుడు పౌర పరిపాలన ముగుస్తుంది. శాంతి భద్రతల నుండి న్యాయ వ్యవస్థ వరకు సర్వం సైన్యం నియంత్రణలోకి వస్తుంది. అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్న సైన్యం అవసరమని భావించిన పక్షంలో ప్రధానిని ఉరితీసే దిశగా కూడా యోచించేందుకు ఈ చట్టంలో అవకాశాలున్నాయి.
ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ పర్యవేక్షణలో..
ప్రజలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైన పరిస్థితుల్లో మార్షల్ లా వర్తిస్తుంది. ఇది యుద్ధం, తిరుగుబాటు లేదా పెద్ద ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో సంభవించవచ్చు. మార్షల్ లా అమలైనప్పుడు సైన్యం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇది న్యాయపరమైన నిర్ణయాలను తీసుకుంటుంది. పాకిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు మార్షల్ లా ప్రయోగించడం ఆనవాయితీగా మారింది.
పాక్‌లో నాలుగు సార్లు మార్షల్ లా
పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు సార్లు మార్షల్ లా విధించారు. 1958లో మొదటిసారిగా, దేశంలో రాజకీయ అస్థిరత ఏర్పటినప్పుడు నాటి అధ్యక్షుడు ఇస్కందర్ మీర్జా మార్షల్ లా విధించారు. అనంతరం మిలటరీ జనరల్ అయూబ్ ఖాన్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తదనంతర కాలంలో దేశంలో సైనిక, రాజకీయ శక్తుల మధ్య విభేదాలు మొదలయ్యాయి.
అడుగంటిన సామాన్యుల స్వేచ్ఛ
1977, జూలై 5 న జనరల్ జియా-ఉల్-హక్ పాకిస్తాన్‌లో మార్షల్ లా విధించి, అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వాన్ని పడగొట్టాడు. జియా దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి, తనను తాను అత్యున్నత పాలకునిగా ప్రకటించుకున్నాడు. రాజకీయ అస్థిరతతో పాటు సామాన్యుల స్వేచ్ఛ కూడా అడుగంటిపోవడంతో నాడు పాకిస్తాన్ గడ్డు రోజులను ఎదుర్కొంది. 1999లో పాకిస్తాన్‌లో మరోమారు మార్షల్ లా విధించారు. అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్‌ను తొలగించి, జనరల్ పర్వేజ్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈసారి కూడా రాజకీయ అస్థిరతను నెపంగా చూపారు. ఇతని పాలనలో సైనిక నియంతృత్వ పోకడ చాలా కాలం పాటు దేశంపై కొనసాగింది.
జర్మన్, జపాన్‌లలో..
మరికొన్ని దేశాలలోనూ మార్షల్ లా అమలయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, జర్మన్, జపాన్‌లలో సైన్యం పాలనను చేపట్టింది. ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో శ్రీలంకలో, యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌లో మార్షల్ లా విధించారు. అయితే పదే పదే మార్షల్ లా అమలు చేస్తూ పాకిస్తాన్ అపఖ్యాతి పాలైంది. ఈ చట్టం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంతగా నిర్వీర్యం చేస్తుందో పదే పదే మార్షల్ లా విధించడం చూస్తే అర్థమవుతుంది. మార్షల్ లా అమలు చేసేముందు పర్యవసానంగా వచ్చే దీర్ఘకాలిక ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల దక్షిణ కొరియా నిర్ణయం ద్వారా స్పష్టమైంది.
ఇది కూడా చదవండి: చైనా చేతికి ‘పవర్‌ఫుల్ బీమ్’.. గురి తప్పేదే లే..
Comments
Please login to add a commentAdd a comment