దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్‌ విఫలం | South Korea Impeached President Yoon Arrest High Drama Updates | Sakshi
Sakshi News home page

6 గంటల హైడ్రామా.. దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్‌ విఫలం

Published Fri, Jan 3 2025 10:57 AM | Last Updated on Fri, Jan 3 2025 11:42 AM

South Korea Impeached President Yoon Arrest High Drama Updates

మార్షల్‌ లా విధింపు కేసులో  నిందితుడిగా దక్షిణ  కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌

యూన్‌పై  ఇప్చటికే చట్ట సభ్యుల అభిశంసన తీర్మాన వేటు

విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్‌ వారెంట్‌ జారీ

కోర్టు పత్రాలతో ఉదయమే అధ్యక్ష నివాసానికి చేరుకున్న విచారణ అధికారులు

లోపల అడ్డుకున్న సైన్యం, ప్రైవేట్‌ భద్రతా సిబ్బంది

నివాసం బయట భారీగా మద్దతుదారులు

అమెరికా, దక్షిణ కొరియా జెండాలతో యూన్‌కు మద్దతు

మరోవైపు యూన్‌ వ్యతిరేక నినాదాలతో మరో వర్గం

హైటెన్షన్‌.. 6గంటల హైడ్రామా తర్వాత నివాసం నుంచి వెనుదిరిగిన విచారణ అధికారులు

సియోల్‌: అభిశంసనకు గురైన దక్షిణ  కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ (Yoon Suk Yeol) అరెస్టు విఫలమైంది. కోర్టు నుంచి అంగీకారపత్రంతో శుక్రవారం తెల్లవారుఝామునే కరప్షన్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌(CIO) అధికారులు సియోల్‌లోని అధ్యక్ష భవనానికి చేరుకున్నారు. అయితే అక్కడ వాళ్లకు చాలా సమయం అడ్డగింత ఎదురైంది. దీంతో చేసేది లేక  అధ్యక్ష నివాసం నుంచి అధికారులు వెనుదిరిగారు. 

ఎమర్జెన్సీ మార్షల్‌ లా(Martial Law)ను ప్రకటించిన కేసులో విచారణకు సహకరించకపోవడంతో యూన్‌ సుక్‌ యోల్‌పై అరెస్టు వారెంటు జారీ అయింది. అయితే విచారణాధికారులు యూన్‌ నివాసంలోకి వెళ్లకుండా సైన్య బృందంతో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఒకానొక టైంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు.. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సీఐవో చీఫ్‌ ఓహ్‌ డోంగ్‌ వున్‌ హెచ్చరికలు జారీ చేశారు. అయితే అన్నివైపులా ప్రతిఘటన ఎదురుకావడంతో సుమారు ఆరు గంటలపాటు హైడ్రామా నడిచింది. చివరకు.. సీఐవో అధికారులు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది .

ఇక.. మార్షల్‌ లా ప్రకటించిన కేసులో.. అధ్యక్ష భవనంలో సోదాలకు విచారణ అధికారులు ప్రయత్నించినప్పుడు కూడా ఇలాంటి ప్రతిఘటనే ఎదురైంది. అయినప్పటికీ అధికారులు పోలీసుల సాయంతో బలవంతంగా లోపలికి వెళ్లి తనిఖీలు జరిపారు. మరోవైపు ఈ కేసులో మూడుసార్లు విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోవడంతో అధికారులు అరెస్ట్‌ వారెంట్‌ కోరుతూ కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం అంగీకరించింది. అదే జరిగితే దక్షిణ కొరియా చరిత్రలో అరెస్ట్‌ అయిన తొలి అధ్యక్షుడిగా నిలుస్తారు.

అరెస్ట్‌ జరిగితే.. 
కోర్టు 6వ తేదీ వరకూ గడువిచ్చిందని, ఆలోపే యూన్‌ను అరెస్టు చేస్తామని సీఐవో మరోమారు స్పష్టం చేశారాయన. యూన్‌ గనుక అరెస్ట్‌ అయితే.. ఆయన్ని గవాచియాన్‌లోని సీఐవో కార్యాలయానికి తరలించే  అవకాశం ఉంది. మార్షల్‌ లా విధింపు కేసులో అక్కడ ఆయన్ని విచారణ జరపనున్నారు. అరెస్ట్‌ వారెంట్‌ నేపథ్యంతో..  48 గంటలపాటు ఆయన్ని అదుపులో ఉంచుకునే అధికారం సీఐవోకు ఉంటుంది. అయితే అటుపై కస్టడీ కోసం కోర్టును అభ్యర్థించాల్సి ఉంటుంది.

విఫలయత్నాలే..
దక్షిణ కొరియాలో ఇలాంటి పరిణామాలు కొత్తేం కాదు. 2000, 2004 సంవత్సరాల్లో చట్ట సభ్యులను అరె‌స్ట్‌ చేయాలని ప్రయత్నించారు. అయితే.. రెండు సందర్భాల్లోనూ అరెస్ట్‌ వారెంట్‌ గడువు ముగిసేదాకా(ఏడురోజులపాటు) వాళ్ల పార్టీ సభ్యులు, మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అది సాధ్యపడలేదు. 

హైటెన్షన్‌
సెంట్రల్‌ సియోల్‌లో ఎటు చూసిన భారీగా బలగాలు కనిపిస్తున్నాయి. యూన్‌ను అరెస్ట్‌ చేస్తారనే ప్రచారంతో ఆయన అనుచరులు భారీగా అధ్యక్ష భవనం వద్దకు చేరి మోహరించారు. గురువారం యూన్‌ వ్యతిరేకులకు, మద్దతుదారులకు మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో భద్రతా బలగాలు కొందరిని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు.. యూన్‌ మద్దతుదారులు అమెరికా జెండాలతో నినాదాలు చేస్తూ కనిపించడం కొసమెరుపు. యూన్‌ అరెస్ట్‌ నేపథ్యంలో.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2,700 మంది పోలీసులు మోహరింపజేసినట్లు సమాచారం.

మార్షల్‌ లాతో చిక్కుల్లో..
ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ.. యూన్‌ ఇటీవల ‘ఎమర్జెన్సీ మార్షల్‌ లా’ విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతిపక్షాలు ‘మార్షల్‌ లా’ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానం తీసుకురాగా.. పార్లమెంట్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో యూన్‌ తన అధ్యక్ష అధికారాలు, విధులకు తాత్కాలికంగా దూరమయ్యారు. యూన్‌ను పదవి నుంచి తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని కోర్టు 180 రోజుల్లోగా తేల్చనుంది.

మరోవైపు యూన్‌ మద్దతుదారులు సియోల్‌లోని ఆయన నివాసం ఎదుట భారీగా మోహరించారు. వారిని ఉద్దేశిస్తూ యూన్‌ మాట్లాడారు. తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి దేశాన్ని ప్రమాదంలో పడేసేందుకు పనిచేస్తున్న శక్తులపై చివరివరకు పోరాడతానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మరోవైపు యూన్‌ను అరెస్టు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన తరఫు న్యాయబృందం హెచ్చరించింది. ఇంకోవైపు.. దక్షిణ కొరియాను మరో ఉత్తర కొరియాగా మార్చేయాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆయన మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆయన అరెస్టును అడ్డుకుని తీరతామంటూ నివాసం ఎదుట భారీగా మోహరించారు. 

అభిశంసన ఇలా.. 
మార్షల్‌ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌(జాతీయ అసెంబ్లీ)లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాయి. తీర్మానానికి అనుకూలంగా 204 మంది ఓటేయగా.. 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష అధికారాలను, విధులను ప్రధానమంత్రి హన్‌ డక్‌ సూకీకి అప్పగించాల్సి ఉంటుంది. తీర్మానప్రతులను రాజ్యాంగ న్యాయస్థానానికి పార్లమెంటు పంపుతుంది. యూన్‌ను తప్పించాలా, కొనసాగించాలా అన్న అంశాన్ని ఈ కోర్టు 180 రోజుల్లోపు తేలుస్తుంది. మరోవైపు యూన్‌ స్వచ్ఛందంగా దక్షిణ కొరియా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్‌ సలహాదారులు, కార్యదర్శులు చెబుతున్నారు.

 చదవండి👉🏻: కరోనా ప్యాటర్న్‌లోనే.. చైనా నుంచి మరో వైరస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement