పలు ప్రాంతాల్లో వ్యాపిస్తున్న హ్యూమన్ మెటాప్యూమో వైరస్
బీజింగ్: విశ్వవ్యాప్తంగా మానవాళి మనుగడను ఒక్కసారిగా ప్రశ్నార్థంచేసి మహా మహమ్మారిగా ప్రపంచదేశాలను చుట్టేసిన కరోనా వైరస్ భయాల నుంచి తేరుకున్న పౌరులకు చైనా మరో భయపెట్టే వార్త మోసుకొచ్చింది. చైనాలో ఇప్పుడు కొత్తగా హ్యూమన్ మెటాఫ్యూమో వైరస్(హెచ్‌ఎంపీవీ) వ్యాప్తిచెందుతోందని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. కోవిడ్ సంక్షోభం సమసిపోయిన ఐదేళ్లకు మళ్లీ అదే డ్రాగన్ దేశం నుంచి వైరస్ వార్త వెలువడటంతో ప్రపంచదేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. కొత్త వైరస్ విజృంభణ, దాని విస్తృతి, సాంక్రమణ శక్తి సామర్థ్యాలపై వెంటనే ఆలోచనల్లో పడ్డాయి. చైనాలో ప్రస్తుత ఆరోగ్య పరిస్తితిపై ఆరా తీస్తున్నాయి.
చైనాలో పలు ప్రాంతాల్లో హెచ్‌ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందినట్లు వార్తలొచ్చాయి. పుకార్ల వార్తలకు మారుపేరుగా దుష్కీర్తిని మూటగట్టుకున్న సోషల్‌మీడియాలో ఇప్పటికే కొత్త వైరస్‌పై వార్తలు వెల్లువెత్తాయి. చైనాలో హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైసోప్లాస్మా నిమోనియో, కోవిడ్19లు విజృంభించాయని, చైనా అత్యయిక ఆరోగ్య స్థితిని విధించారని సోషల్‌మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు షేర్ చేసిన వీడియోల్లో చైనీయులు ఆస్పత్రులు, శ్మశానాల వద్ద క్యూ లైన్లు కనిపించిన దృశ్యాలున్నాయి. అయితే ఈ వార్తలను ఇంతవరకు చైనా ప్రభుత్వంగానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థగానీ ధృవీకరించలేదు. ఇది పాత వైరస్సేనని కొందరు వైద్యులు చెబుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment