అండర్‌వేర్‌తో మాజీమంత్రి ఆత్మహత్యాయత్నం! | South Korea Latest News: Ex minister attempts suicide using underwear | Sakshi
Sakshi News home page

SK: అండర్‌వేర్‌తో మాజీమంత్రి ఆత్మహత్యాయత్నం!

Published Wed, Dec 11 2024 2:20 PM | Last Updated on Wed, Dec 11 2024 3:41 PM

South Korea Latest News: Ex minister attempts suicide using underwear

సియోల్‌: దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయంలో పోలీసుల సోదాలు కొనసాగుతున్నవేళ..  రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్‌ యోంగ్‌ హైయున్‌ అండర్‌వేర్‌తో ఆత్మహత్యాయత్నం చేశారు. విచారణ అధికారుల అదుపులో ఉన్న ఆయన.. కారాగారంలోనే ఈ ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

కిమ్‌ యోంగ్‌ హైయున్‌.. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు అత్యంత సన్నిహితుడు. సైనిక పాలన విధింపు ప్రకటన వెనుక ఈయన ప్రమేయమే ఉందనేది ప్రధాన ఆరోపణ. ఈ అభియోగంపై ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే సరిగ్గా అరెస్ట్‌కు ముందు బాత్రూంకు వెళ్లిన ఆయన.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో అధికారులు తలుపులు బద్ధలు కొట్టి చూశారు.

అండర్‌వేర్‌తో ఆయన ఉరివేసుకునే ప్రయత్నం చేయగా.. అధికారులు నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని న్యాయ శాఖ తాజాగా పార్లమెంట్‌కు నివేదించింది.

సైనిక పాలనపై నిర్వహించిన ఓటింగ్‌కు చట్ట సభ్యులు హాజరుకాకుండా వాళ్ల మీదకు భద్రతా బలగాలను ప్రయోగించాడనే అభియోగమూ ఉంది.

దక్షిణ కొరియా డిసెంబర్‌ 3వ తేదీన ఆ దేశ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ హఠాత్తుగా టీవీ ఛానెల్స్‌ ముందు ప్రత్యక్షమై.. అత్యవసర సైనిక పాలన ప్రకటన చేశారు. ప్రతిపక్షాలు దాయాది దేశం ఉత్తర కొరియాతో చేతులు కలిపి కుట్రలకు తెర తీశాయని, అందుకే పరిస్థితి అదుపు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.  ఆ వెంటనే దేశంలో అలజడి రేగింది. మరోపక్క.. ప్రతిపక్షాలతో పాటు అధికార ప‍క్షంలోని చట్ట సభ్యులూ ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సంక్షోభం తలెత్తే ప్రమాదంతో.. చేసేది లేక కొన్నిగంటల తర్వాత ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటూ ఆయన దేశానికి క్షమాపణలు చెప్పారు.

అయితే ఈ అంశంపై ప్రత్యేక మండలి విచారణ జరపనుంది. ఈ మేరకు మంగళవారం చట్ట సభ్యులంతా ఆ కౌన్సిల్‌కు అనుమతులు జారీ చేశారు. సైనిక పాలన విధింపు ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది యూన్‌పై అభియోగం. అది గనుక రుజువైతే.. ఆయనకు మరణశిక్ష పడే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: తప్పైంది.. నన్ను క్షమించండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement