దాయది దేశాల క్రికెట్ పోరు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంది. కొన్ని కోట్ల మందికి, ముఖ్యంగా ఇరుదేశాల క్రికెట్ అభిమానుల్ని ఒకచోటుకు చేర్చి.. విపరీతమైన మజాను అందిస్తుంటుంది. అయితే ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు సన్నగిల్లడం, సరిహద్దు వివాదం, ఉగ్రదాడుల నేపథ్యాలు పరస్పర పర్యటనలకు ఇరుదేశాలను దూరం చేస్తూ వస్తున్నాయి. ఈ కారణంగానే వచ్చే ఏడాదిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌కు ఫిక్స్ అయ్యింది. అయితే..
క్రికెట్ రంగంలోనే రిచ్చెస్ట్ బోర్డు అని.. ఐసీసీనే ప్రభావితం చేయగల సత్తా ఉందనే పేరుంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI)కి. అంతటి శక్తివంతమైన బోర్డు.. పాక్ గడ్డకు తమ ఆటగాళ్లను పంపించేందుకు, అక్కడి పిచ్‌లపై ఆడించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తోంది. దీనికి కొంత సమాధానం భారత మాజీ క్రికెటర్ రాసిన పుస్తకంలో దొరికింది.
👉80వ దశకం చివర్లో.. పాక్-భారత్ మధ్య కశ్మీర్ విషయంలో ఉద్రిక్తతలు తారాస్థాయిలో కొనసాగుతున్నాయి. ఉగ్రవాదాన్ని పైసలు, ఆశ్రయమిచ్చి మరీ పోషిస్తోందంటూ పాక్‌ను అంతర్జాతీయ సమాజంలో భారత్ ఎండగట్టడం మొదలుపెట్టింది అప్పుడే. అలాంటి టైంలో అనూహ్యంగా.. భారత జట్టు పాక్ పర్యటన వెళ్లాల్సి వచ్చింది.
👉1989-90 సీజన్‌లో కృష్ణమాచారి శ్రీకాంత్ నేతృత్వంలోని భారత జట్టు.. నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడేందుకు పాక్‌కు వెళ్లింది. అన్ని టెస్టులు డ్రాగా ముగియగా.. వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు కైవసం చేసుకుంది. అయితే.. కరాచీ స్టేడియంలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఎవరూ ఊహించని ఓ ఘటన జరిగింది.
పాక్ జట్టు బ్యాటింగ్.. భారత్ ఫీల్డింగ్ చేస్తోంది. ఆ సమయంలో పథాన్ దుస్తుల్లో ఓ వ్యక్తి స్టేడియంలోకి దూసుకొచ్చాడు. బహుశా ఎవరైనా అభిమాని తమ ఫేవరెట్ ప్లేయర్‌ను కలవడానికి అయ్యి ఉంటారేమో!.. సిబ్బంది అతన్ని అడ్డుకుంటారులే అనుకుంటూ భారత ఫీల్డర్లు తమతమ స్థానాల్లో ఉండిపోయారు. అయితే పిచ్‌ను సమీపించే కొద్దీ.. అతని ఉద్దేశం ఏంటో ఆటగాళ్లకి అర్థమైంది. ప్రోకశ్మీర్, భారత వ్యతిరేక స్లోగన్లతో దూసుకొచ్చాడతను. అసలు ఈ పర్యటనకు రాకుండా ఉండాల్సిందంటూ భారత ఆటగాళ్లు దూషిస్తున్నాడతను. ఇంతలో అంపైర్లు జోక్యం చేసుకుని.. అతన్ని అడ్డగించే మైదానం నుంచి వెనక్కి పంపే ప్రయత్నం చేయబోయారు. అయితే ఆ వ్యక్తి సరాసరి కృష్ణమాచారి శ్రీకాంత్ దగ్గరికి వచ్చి ఏదో అన్నాడు. అంతే..
ఇద్దరూ ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఒకరి గల్లా ఒకరు పట్టుకుని లాగేసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాంత్ షర్ట్ చినిగిపోయింది. దీంతో జట్టు సభ్యులంతా దగ్గరికి పరిగెత్తారు. ఈలోపు.. సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని అక్కడి నుంచి లాక్కెల్లారు. క్రికెటర్ నుంచి కామెంటేటర్‌గా మారిన సంజయ్ మంజ్రేకర్ తన ‘ఇంపర్‌ఫెక్ట్’లో ఈ ఘటన గురించి రాసుకొచ్చారు. మంజ్రేకర్‌కు మాత్రమే కాదు, సచిన్ టెండూల్కర్‌కు కూడా ఈ మ్యాచ్ టెస్ట్ డెబ్యూ కావడం గమనార్హం.
అయితే ఈ ఘటన తర్వాత..శ్రీకాంత్ తన షర్ట్ మార్చుకుని వచ్చాడు. అసలేం జరగనట్లు ఆట యధావిధిగా జరిగింది. కానీ ఇదే మ్యాచ్‌లో.. మరో భారతీయ ఆటగాడు ముహమ్మద్ అజారుద్దీన్‌పైనా మెటల్ హుక్‌తో దాడి జరిగింది. ఒకవేళ.. ఇవాళ అలాంటి ఘటనలే గనుక ఈనాడు జరిగి ఉంటే.. ఆ మ్యాచ్, సిరీస్..మొత్తం పర్యటనే రద్దు అయ్యి ఉండేదేమో!.
👉ఇక.. అదే టూర్‌లో జరిగిన మరో ఘటన గుర్తు చేసుకుంటే.. మూడో వన్డే సందర్భంగా పెద్ద రచ్చే చెలరేగింది. కరాచీ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరుగుతుండగా.. 28 పరుగులకు పాక్ మూడు వికెట్లు పొగొట్టుకుంది. అది సహించలేని అభిమానులు భారత జట్టు ఆటగాళ్ల మీదకు రాళ్లు విసిరారు. పాక్ కెప్టెన్ జావెద్ మియాందాద్ అభిమానుల్ని శాంతపర్చేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరకు టియర్ గ్యాస్ ప్రయోగించి చెల్లాచెదురు చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేసి.. తిరిగి లాహోర్‌లో నిర్వహించారు.
👉ఈ ఘటన తర్వాత ఇరు కూడా దేశాలు పర్యటనలను కొనసాగించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే సిరీస్‌లు నిర్వహించుకున్నాయి. తటస్థ వేదికల్లోనూ మ్యాచ్‌లు ఆడాయి.. ఇంకా ఆడుతున్నాయి. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో భద్రతా కారణాల వల్లే తమ జట్టును పాక్‌కు పంపలేమని బీసీసీఐ కుండబద్ధలు కొట్టేసింది. ఇందుకు పైన చెప్పుకున్న కారణాలే కాదు.. ఇంకో ముఖ్యమైన ఘటన ఉంది.
2009 శ్రీలంక జట్టుపై పాక్ పర్యటనలో జరిగిన దాడి.. క్రికెట్ చరిత్రలో ‘బుల్లెట్’ అక్షరాలతో లిఖించబడింది. టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా ముసుగులతో వచ్చిన కొందరు తూటాల వర్షం కురిపించారు. ఆరుగురు పోలీసాఫీసర్లు చనిపోగా.. లంక టీంకు ఆటగాళ్లు, అధికారులు ఏడుగురు గాయపడ్డారు. ఘటన తర్వాత ఎయిర్‌లిఫ్ట్ ద్వారా క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. క్రికెట్ చరిత్రలోనే అదొక చీకటి దినంగా మిగిలిపోయింది.
ఈ ఘటన తర్వాత చాలా దేశాలు తమ జట్లను పాక్‌కు పంపేందుకు భయపడ్డాయి. అయితే భారత్ మాత్రం 2008 తర్వాతి నుంచి పాక్ గడ్డపై సిరీస్ ఆడలేదు. ముంబై 26/11 దాడులే అందుకు ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
👉పాక్ క్రికెట్ జట్టు ఇప్పటిదాకా పదిసార్లు.. భారత్‌లో పర్యటించింది. 1989 ఘటనలు పాక్ గడ్డపై భారత్‌కు మానని గాయం. అయితే ఆ ఘటనల తర్వాత కూడా భారత జట్టు మూడుసార్లు పాక్ పర్యటనకు వెళ్లింది. కానీ, మునుపటిలా పరిస్థితులు లేవిప్పుడు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కొనసాగితే పర్వాలేదు. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కానీ, పాక్‌లో ఇప్పుడు పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్‌తో దౌత్యపరమైన సంబంధాలు క్షీణించాయి.
పైగా.. ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత రాజకీయంగానూ పాక్‌లో సంక్షోభం నడుస్తోంది. ఒకవైపు ఉగ్రదాడులు.. ఇంకోవైపు అనుమానాస్పద రీతిలో ఉగ్ర నేతలు హతమవుతుండడం తీవ్ర చర్చనీయాంశంమైంది. అలాంటప్పుడు భారత ఆటగాళ్లకు భద్రత కల్పించడం ప్రశ్నార్థకమే!. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే ఇటు బీసీసీఐ, అటు కేంద్రప్రభుత్వం టీమిండియాను పాక్ పర్యటనకు అనుమతించడం లేదన్నది అర్థమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment