భారత క్రికెట్‌లో 1983లో కొత్త శకం ప్రారంభమైంది. ఎందుకంటే ఇదే ఏడాది కపిల్ డెవిల్స్ తొలి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత్ ఇంగ్లండ్ గడ్డపై విశ్వవిజేతగా అవతరించింది. ఇలా ప్రపంచకప్‌లో తొలిసారి ఒక ఆసియా జట్టు కప్ గెలిచిన సందర్భం అదే. అప్పటికి పాకిస్తాన్, శ్రీలంకలు మాత్రమే ఆసియా నుంచి క్రికెట్ ఆడుతున్నాయి, ఈ నేపథ్యంలోనే ఆసియాలో క్రికెట్‌ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC)ను 1983లో స్థాపించారు.
ప్రస్తుతం ఈ కౌన్సిల్‌కు బీసీసీఐ సెక్రటరీ జై షా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ACCఏ ఆసియాకప్ పుట్టుకకు కారణమైంది. ఆసియా దేశాల మధ్య మాత్రమే నిర్వహించే టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు ఆసియా చాంపియన్‌గా అవతరిస్తుంది. తాజాగా మరికొన్ని గంటల్లో 15వ ఆసియా కప్‌కు తెరలేవనున్న నేపథ్యంలో దాని పుట్టుక, నిలిపివేసిన సందర్భాలు, ఎవరెవరు విజేతలుగా నిలిచారనేది ఒకసారి చూద్దాం.
-సాక్షి, వెబ్‌డెస్క్
ఆసియాకప్ పుట్టిన సంవత్సరం:
ఐసీసీ ఆధీనంలో ఉండే ఆసియా క్రికెట్ కౌన్సిల్ 1984లో యూఏఈ వేదికగా పురుషుల క్రికెట్‌లో తొలిసారి ఆసియాకప్ నిర్వహించింది. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ టోర్నీ జరగాల్సి ఉండగా.. మధ్యలో కొన్నిసార్లు నాలుగేళ్లకోసారి కూడా నిర్వహించారు.
అన్ని ఆసియా కప్‌లు ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక
ఇప్పటివరకు 14 ఆసియాకప్‌లు జరిగితే అన్ని టోర్నీలు ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక భారత్, పాకిస్తాన్‌లు చెరో 13సార్లు ఆసియాకప్‌లో పాల్గొన్నాయి. శ్రీలంకతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 1986లో భారత్ ఆసియా కప్‌ను బహిష్కరించింది. ఇదే కారణంతో 1993లో ఆసియాకప్‌ను నిర్వహించలేదు. ఇక భారత్‌తో రాజకీయ సంబంధాలు సరిగ్గా లేనందున పాకిస్తాన 1990-91 టోర్నీలో ఆడలేదు.
ఐసీసీ చేతిలోకి అధికారాలు
ఇక 2015లో ఆసియాకప్‌పై ఐసీసీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. టోర్నీ నిర్వహించే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు అధికారాలు తగ్గించి.. ఇక నుంచి ఆసియాకప్ రెండేళ్లకోసారి వన్డే, టి20 ఫార్మాట్‌లో రొటేషన్ పద్దతిలో జరుగుతుందని తెలిపింది. ఐసీసీ టోర్నీలకు అనుగుణంగా ఆసియాకప్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొంది.
దీని ప్రకారమే 2016 టి20 ప్రపంచకప్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందు బంగ్లాదేశ్ వేదికగా తొలిసారి ఆసియాకప్‌ను టి20 తరహాలో నిర్వహించారు. ఆ తర్వాత 2019 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకొని.. 2018లో వన్డే ఫార్మాట్‌లో జరిగింది. తాజాగా 15వ ఎడిషన్ ఆసియా కప్ మరోసారి టి20 ఫార్మాట్‌లో జరగనుంది. ఇక 2023 ఆసియాకప్‌ను పాకిస్తాన్‌లో వన్డే ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు.
ఇక 1984లో తొలిసారి నిర్వహించిన ఆసియాకప్‌లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక మధ్య మాత్రమే జరిగింది. 1986లో బంగ్లాదేశ్.. 2004లో యూఏఈ , హాంకాంగ్‌లు.. 2014లో అఫ్గనిస్తాన్‌లు ఆసియా కప్‌లో అరంగేట్రం చేశాయి. ఇక ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఏడుసార్లు ఆసియాకప్‌ను కైవసం చేసుకోగా.. ఆ తర్వాత శ్రీలంక ఐదుసార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ టోర్నీని ముద్దాడాయి. ఇక చివరగా 2018లో వన్డే ఫార్మాట్‌లో జరిగిన టోర్నీలో రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమిండియా టైటిల్ సాధించింది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా భారత్ బరిలోకి దిగుతోంది. మరి 15వ ఆసియాకప్‌లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.
చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ 15వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్, ఇతర వివరాలు
Comments
Please login to add a commentAdd a comment