ఐసీసీ టి20 ప్రపంచకప్ 2022లో ఫేవరెట్ ఎవరనేది ఒక ప్రశ్నగా ఉంది. క్రికెట్ అభిమానులు మాత్రం మా జట్టే ఫేవరెట్ అంటూ ఎవరికి తోచిన లెక్కలు వారు చెబుతున్నారు. వాస్తవానికి టోర్నీలో పలానా జట్టు ఫేవరెట్ అని చెప్పడం కష్టమే.ఎందుకంటే ఆడుతుంది టి20 ప్రపంచకప్. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఫేవరెట్ అనుకున్న జట్టు ప్రభావం చూపకపోవడం.. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన జట్టు అద్భుతాలు చేస్తూ టైటిల్ ఎగురేసుకుపోయినా ఆశ్చర్యపోవనసరం లేదు.
గతేడాది టి20 ప్రపంచకప్‌లో జరిగింది ఇదే. అసలు ఆస్ట్రేలియా టి20 ప్రపంచకప్ అందుకుంటుందని ఎవరు ఊహించలేదు. గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో ఫేవరెట్ జాబితాలో టీమిండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్‌లు ఉన్నాయి. కానీ అంచనాలు భిన్నంగా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ఫించ్ సేన ట్రోఫీని పట్టుకెళ్లిపోయింది.
-సాక్షి, వెబ్‌డెస్క్
ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా లాంటి బౌన్సీ పిచ్‌లపై జరగనున్న టి20 ప్రపంచకప్‌లో విజేతగా ఎవరు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఆసీస్ మైదానాలు పేసర్లకు స్వర్గధామంగా ఉన్నప్పటికి ఇటీవలే అక్కడి పిచ్‌లు కాస్త బ్యాటింగ్‌కు అనుకూలంగానే తయారు చేస్తున్నారు. ఇది కాస్త సానుకూలాంశమనే చెప్పొచ్చు. ఆసీస్‌ను మినహాయిస్తే వ్యక్తిగతంగా ఆసీస్ గడ్డపై టి20 క్రికెట్‌లో విజయాల శాతం ఎక్కువగా ఉన్న జట్టు టీమిండియానే. టీమిండియా తర్వాత పాకిస్తాన్, వెస్టిండీస్, శ్రీలంకలు ఉన్నాయి. ఇది కేవలం ఆసీస్ గడ్డపై ఆయా జట్లు ఆడిన మ్యాచ్‌ల్లో విజయాల ఆధారంగా తీసుకున్నవి మాత్రమే.
టీమిండియా
జట్ల పరంగా చూస్తుంటే టీమిండియా ఈ జాబితాలో తొలి స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై భారత జట్టు 20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 12 విజయాలు.. 8 ఓటములు ఉన్నాయి. ఆసీస్ గడ్డపై టీమిండియా విజయాల శాతం 60గా ఉంది. అత్యధిక విజయాల శాతంలో టీమిండియాదే అగ్రస్థానం. మరి ఈసారి టి20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫేవరెట్ అంటే కచ్చితంగా అవుననే చెప్పొచ్చు. బ్యాటింగ్ దుర్బేద్యంగా ఉండడం.. బౌలింగ్‌లో బుమ్రా లేని లోటు తెలుస్తున్నప్పటికి షమీ తుది జట్టుతో కలవడంతో బౌలింగ్ బలం పెరిగినట్లయింది. 2007 ఆరంభ టి20 ప్రపంచకప్ మినహా మరోసారి టీమిండియా ట్రోఫీ గెలవలేకపోయింది.
పాకిస్తాన్
పాకిస్తాన్ జట్టు ఆసీస్ గడ్డపై 24 టి20 మ్యాచ్‌లు ఆడగా.. 10 సార్లు ఓడి.. 12 సార్లు గెలిచింది. పాక్‌కు ఆసీస్ గడ్డపై గెలుపు శాతం 50గా ఉంది. ఇక పాకిస్తాన్ జట్టు విజయాలు ఎక్కువగా ఓపెనర్లు రాణింపుపైనే ఆధారపడి ఉంటుంది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లిద్దరు విఫలమైతే జట్టులో బ్యాటింగ్ చేసేవారు కరువయ్యారు. తాజాగా ఫఖర్ జమాన్ జట్టుతో కలిసినప్పటికి అతను ఎంత ప్రభావం చూపిస్తాడనేది చెప్పడం కష్టమే. అయితే బౌలింగ్‌లో మాత్రం పాకిస్తాన్ బలంగా కనిపిస్తుంది. యంగ్ క్రికెటర్లు మహ్మద్ వసీమ్, నసీమ్ షాలకు తోడు హారిస్ రౌఫ్ రాణిస్తున్నాడు. కాగా గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి రానున్న షాహిన్ అఫ్రిది రాక పాక్ బౌలింగ్‌ను దుర్బేద్యంగా మార్చింది.
అండర్‌డాగ్స్‌గా శ్రీలంక..
టీమిండియా, పాక్‌ల తర్వాత ఆసీస్ గడ్డపై అత్యధిక విజయాల శాతం శ్రీలంకకు ఉండడం విశేషం. ఈ జట్టు ఆసీస్ గడ్డపై 13 మ్యాచ్‌లాడగా.. అందులో 8 విజయాలు.. ఐదు ఓటములు ఉన్నాయి. విజయాల శాతం 61గా ఉన్నప్పటికి మ్యాచ్‌ల సంఖ్య తక్కువగా ఉండడంతో లంక మూడో స్థానంలో ఉంది. ఈసారి టి20 ప్రపంచకప్‌కు సూపర్-12కు అర్హత సాధించని శ్రీలంక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆసియా కప్ గెలిచిన అనంతరం బలంగా కనిపిస్తోన్న శ్రీలంకను తక్కువగా అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుంది. కచ్చితంగా ఈసారి లంక జట్టు చాలా ప్రభావం చూపించే అవకాశం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న లంక జట్టు సూపర్-12కు చేరడంలో ఎలాంటి ఆటంకాలు లేవు. అండర్‌డాగ్స్‌గా కనిపిస్తున్న శ్రీలంక టైటిల్ ఎగురేసుకుపోయిన ఆశ్చర్యపోవనసరం లేదు.
వెస్టిండీస్ అనుమానమే..
వెస్టిండీస్‌కు కూడా ఆస్ట్రేలియా గడ్డపై విజయాల శాతం 54గా ఉంది. కానీ మ్యాచ్‌ల సంఖ్య తక్కువగా ఉండడంతో విండీస్ నాలుగో స్థానంలో ఉంది. రెండుసార్లు టి20 ప్రపంచకప్ చాంపియన్ అయిన వెస్టిండీస్ ఈసారి సూపర్-12కు అర్హత సాధించలేదు. క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడనున్న వెస్టిండీస్ ఆటతీరు అంత బాగాలేదు. సూపర్-12కు వస్తుందా లేదా అన్నది అనుమానమే.
ఫేవరెట్‌గానే ఇంగ్లండ్..
ఇంగ్లండ్ జట్టుకు ఆసీస్ గడ్డపై విజయాల శాతం 40గా ఉంది. ఇప్పటివరకు ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ 16 మ్యాచ్‌లాడి తొమ్మిది ఓడి.. ఎనిమిదింటిలో గెలిచింది. అయితే టి20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్తాన్ వారి సొంతగడ్డపై.. అలాగే ఆస్ట్రేలియాను వారి స్వదేశంలోనే ఓడించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. 2010లో టి20 ప్రపంచకప్ చాంపియన్‌గా నిలిచిన ఇంగ్లండ్ ఈసారి కూడా ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతుంది.
అచ్చిరాని మేజర్ టోర్నీలు..
సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో బాగా ఆడినప్పటికి మేజర్ టోర్నీలనగానే ఎక్కడ లేని ఒత్తిడి కొనితెచ్చుకుంటాయి. గతేడాది రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఆసీస్ గడ్డపై 9 టి20 మ్యాచ్‌లాడింది. అందులో మూడు మాత్రమే గెలిచి మిగతా ఏడింటిలో పరాజయం చవిచూసింది. కివీస్‌కు ఆసీస్ గడ్డపై విజయాల శాతం కేవలం 17 మాత్రమే. ఇక సౌతాఫ్రికా జట్టు ఆసీస్ గడ్డపై 17 మ్యాచ్‌ల్లో తలపడగా.. 11 మ్యాచ్‌లు ఆసీస్ గెలవగా.. ప్రొటీస్ ఆరు విజయాలు నమోదు చేసింది. ఆసీస్ గడ్డపై ప్రొటిస్ జట్టు విజయాల శాతం 36గా ఉంది.
ఇక రేపటి నుంచి(అక్టోబర్ 16) టి20 ప్రపంచకప్ సంబరం మొదలవనుంది. అక్టోబర్ 16 నుంచి 21 వరకు జరిగేవన్నీ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు. ఆ తర్వాత రోజు నుంచి(అక్టోబర్ 22న) సూపర్-12 దశకు తెరలేవనుంది. ఇక అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్‌ల మ్యాచ్‌తో వరల్డ్ కప్ పీక్స్‌కు చేరనుంది. మరి ఈసారి ఆసీస్ గడ్డపై ఎవరు విజేతగా నిలుస్తారనేది నవంబర్ 13న తెలియనుంది.
చదవండి: T20 WC 2022: ఒకే ఫ్రేమ్‌లో 16 జట్ల కెప్టెన్లు.. ట్రోఫీతో ఫోజులు.. ఫొటో వైరల్
Comments
Please login to add a commentAdd a comment