
ఆసియాకప్‌లో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఎంత ఉత్కంఠంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే చేజింగ్‌లో హార్దిక్ దాటిగా ఆడడంతో టీమిండియా విజయాన్ని అందుకుంది. అయితే ఇరుజట్లు మ్యాచ్‌లో నిర్ణీత సమయంలోగా ఓవర్లను పూర్తి చేయలేకపోయిన సంగతి తెలిసిందే. దీంతో స్లో ఓవర్ రేట్‌తో పాటు సర్కిల్ బయట ఫీల్డింగ్‌పై పరిమితులు అనే కొత్త పదం వినిపించింది. అంటే నిర్ణీత ఓవర్లలోగా ఇన్నింగ్స్ పూర్తి చేయలేకపోతే.. మిగిలి ఉన్న ఓవర్లలో 30 గజాల సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఈ అంశం భారత్-పాక్ మ్యాచ్ ముగిసిన తర్వాత వార్తల్లో నిలిచింది.
-సాక్షి, వెబ్‌డెస్క్
అయితే ఈ నిబంధనను గత సంవత్సరమే ఐసీసీ క్రికెట్ కమిటీ మార్పును సిఫార్సు చేసింది. ఇది అన్ని ఫార్మాట్లలో ఆట యొక్క వేగాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని ఐసీసీ వివరణ ఇచ్చింది. ఐసీసీ సవరించిన ఈ రూల్స్‌తో మొదటి మ్యాచ్ వెస్టిండీస్, ఐర్లాండ్‌ల మధ్య జనవరిలో సబీనా పార్క్‌లో జరిగింది.
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22లో పేర్కొన్న ప్రకారం ఒక మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఎక్కువగా జరిగితే ఆటగాళ్లకు స్లో ఓవర్ రేట్ ఫైన్‌తోపాటు మ్యాచ్‌లో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లకు బదులు నలుగురు మాత్రమే ఫీల్డింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఐసీసీ మెన్స్ టి20 ప్రపంచకప్‌లో కూడా ఇదే నిబంధన అమలు కానుంది.
ఇక ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాక్ మ్యాచ్‌లో మొదట బౌలింగ్ చేసిన టీమిండియా నిర్ణీత సమయం ముగిసేలోగా 18 ఓవర్లు మాత్రమే పూర్తి చేసింది. దీంతో మిగిలిన రెండు ఓవర్లలో నలుగురు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ బయట ఉండడంతో పాక్ టెయిలెండర్లు స్వేచ్ఛగా బౌండరీలు బాదాడు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా టీమిండియా ఇన్నింగ్స్‌ను పూర్తి చేసి ఉంటే పాకిస్తాన్ 130 పరుగులలోపే చేసి ఉండేది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ కూడా అదే తప్పు చేసింది. నిర్ణీత సమయంలో పాక్ తమ కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోవడం వల్ల భారీ మూల్యమే చెల్లించుకుంది. నిబంధనల ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా పాక్ వేసిన చివరి ఓవర్లలో 30 అడుగుల సర్కిల్ బయట కేవలం నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతించారు అంపైర్లు. ఇది టీమిండియాకు బాగా కలిసొచ్చింది. ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్ ఉండటంతో భారత్ ఆఖరి 3 ఓవర్లలో భారీగా పరుగుల రాబట్టి (18 బంతుల్లో 32 పరుగులు) విజయం అందుకుంది.
చదవండి: Asia Cup 2022: సిక్సర్‌తో జట్టును గెలిపించాడు.. హార్దిక్‌కు అఫ్గనిస్తాన్ అభిమాని ‘ముద్దులు’!