ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలు క్రికెట్ ఆడుతున్న సభ్యదేశాల్లో ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటుంది. వన్డే వరల్డ్‌కప్, టి20 వరల్డ్‌కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా మెగాటోర్నీలు ఏవైనా ఏదో ఒక దేశం ఆతిథ్యం ఇవ్వడం కనబడుతుంది. అయితే తాజాగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు మాత్రం ఇంగ్లండ్ మాత్రమే ఎందుకు ఆతిథ్యమిస్తోంది అని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నాడు.
తొలిసారి 2021లో నిర్వహించిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదిక అయింది. ఈసారి ఓవల్ స్టేడియంలో రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తున్నారు. రెండు వేర్వేరు స్టేడియాల్లో రెండు ఫైనల్స్ జరిగితే ఇందులో కామన్‌గా ఉంది మాత్రం టీమిండియానే.
వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న టీమిండియా ఈసారి కూడా మ్యాచ్ గెలస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. 2021లో కివీస్‌తో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
మరి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ను ఐసీసీ ఇంగ్లండ్‌లోనే ఎందుకు నిర్వహిస్తుందనే ప్రశ్నకు ఒకటే సమాధానం వినిపిస్తుంది. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లాంటి ఆసియా ఖండపు దేశాల్లో జూన్ నెలలో ఎలాంటి టెస్టు మ్యాచ్‌లు జరగవు. దానికి కారణం వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారత్, శ్రీలంక ఇలా ఏది చూసుకున్నా ఉపఖండపు దేశాల్లో వాతావరణ పరిస్థితి ఒకలాగే ఉంటుంది. అందుకే జూన్ నుంచి ఆగస్టు వరకు ఉపఖండపు దేశాలు స్వదేశంలో టెస్టు మ్యాచ్‌లు ఎక్కువగా ఆడవు.
మనం సరిగ్గా గమనిస్తే జూన్ నెలలో ఇంగ్లండ్ మినహా ఏ దేశంలోనూ ఎక్కువగా క్రికెట్ మ్యాచ్‌లు జరగవు. ఈ సమయంలో ఇంగ్లండ్ లాంటి యూరోప్ దేశంలోనే పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉంటాయి. అందుకే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించడానికే మొగ్గు చూపుతుంది. 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌లో నిర్వహించాలని ఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
ఉపఖండపు దేశాలకు ప్రతికూలంగా..
ఇంగ్లండ్‌లోని పరిస్థితులు ఉపఖండపు దేశాలకు ప్రతికూలంగా ఉంటాయి. ఇక్కడి పిచ్‌లన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకు కాస్త అనుకూలంగా ఉంటాయి. ఇంగ్లండ్ పిచ్‌ల్లో ఎక్కువగా స్వింగ్ కనిపిస్తుంది. ఆసీస్ పిచ్‌లు ఎక్కువగా బౌన్సీ ట్రాక్‌లు ఉంటాయి. ఇక న్యూజిలాండ్‌లోనూ పరిస్థితులు అలానే ఉంటాయి. అందుకే ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్నప్పటికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లకు పెద్దగా ఇబ్బందులు ఉండవు.
కానీ టీమిండియాకు ఇది కాస్త ప్రతికూలమని చెప్పొచ్చు. 2021లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా తడబడింది. స్వింగ్ పిచ్‌లపై బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడిన టీమిండియా బ్యాటర్లు వికెట్లుపారేసుకున్నారు. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపింది లేదు.
ఈసారి కూడా పరిస్థితి అలానే కనిపిస్తోంది. ఓవల్ పిచ్ టీమిండియా కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువగా సహకరిస్తుందని తెలుస్తోంది. అలా అని పిచ్‌ను తప్పు బట్టడానికి లేదు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు ఎలాగైతే వికెట్లు తీశారో.. టీమిండియా ఇన్నింగ్స్‌లోనూ ఇప్పటివరకు పడిన ఆరు వికెట్లలో ఐదు పేసర్లే పడగొట్టారు. అయినా ఆసీస్ బ్యాటర్లు యదేచ్ఛగా బ్యాట్ ఝులిపించిన చోట టీమిండియా బ్యాటర్లు పరుగులు చేయలేక అల్లాడిపోతున్నారు. పరిస్థితి చూస్తుంటే టీమిండియా ఈసారి కూడా రన్నరప్‌గా నిలిచేలా కనిపిస్తోంది.
కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఐసీసీ ఇంగ్లండ్‌లో నిర్వహిస్తున్నప్పటికి బీసీసీఐ పెద్దగా అడ్డుచెప్పడం లేదు. క్రికెట్ ప్రపంచాన్ని కనుసైగలతో శాసిస్తున్న బీసీసీఐ తలచుకుంటే డబ్ల్యూటీసీ వేదికను మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ టెస్టు ఛాంపియన్‌షిప్ విషయంలో బీసీసీఐ సీరియస్‌గా కనిపించడం లేదు. టెస్టు క్రికెట్‌లో పెద్దగా కాసుల వర్షం కురిసే అవకాశం లేకపోవడంతో బీసీసీఐ తన దృష్టంతా టి20లు, వన్డేలపైనే ఉంచింది. బీసీసీఐ ఆలోచనా ధోరణి మారాలని అభిమానులు భావిస్తున్నారు.
ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్(FTP) పేరిట ఇప్పటికే రానున్న మూడేళ్లకు షెడ్యూల్ రూపొందించిన ఐసీసీ వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను కూడా ఇంగ్లండ్‌లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇది మార్చడానికి అవకాశం లేకపోయినప్పటికి బీసీసీఐ చొరవ తీసుకొని ఐసీసీని ఒప్పించి 2027 టెస్టు ఛాంపియన్‌షిప్‌కు తటస్థ వేదికలో జరిగేలా చూడొచ్చు. అలా కాదని బీసీసీఐ పట్టించుకోకుండా ఉంటే మాత్రం టీమిండియా భవిష్యత్తులోనూ రన్నరప్‌గానే నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చదవండి: WTC Final Day-3: రహానే ఫిఫ్టీ.. 200 మార్క్ దాటిన టీమిండియా
Comments
Please login to add a commentAdd a comment