బుమ్రా అసాధారణ బౌలింగ్ ప్రదర్శన
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఎన్నో రికార్డులు
‘ఆల్‌టైమ్ గ్రేట్’ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు
‘ఆటగాళ్లు గాయపడాలని ఎవరూ కోరుకోరు... కానీ ఇలాంటి పిచ్‌పై అతడిని ఎదుర్కోవడం అంటే మాకు ఒక పీడకలగా మారి ఉండేది... అతను బౌలింగ్‌కు దిగడం లేదని తెలిసిన వెంటనే మాకు ఇక్కడ గెలిచే అవకాశం ఉందని అర్థమైంది’... ఒక బౌలర్ గురించి ప్రత్యర్థి బ్యాటర్ ఇలాంటి మాట చెబుతున్నాడంటే సదరు బౌలర్ ఆ బ్యాటర్‌పై, జట్టులోని ఇతర ఆటగాళ్లపై చూపించిన ప్రభావం ఏమిటో అర్థమవుతుంది.
‘మీ గుండెల్లో నిద్రపోతా’ అంటూ సినిమాల్లో వినిపించే రొటీన్ డైలాగ్‌ను నిజంగానే అన్వయిస్తే ఎలా ఉంటుందో ఈ వ్యాఖ్య చూపించింది! అంతటి పదునైన బౌలింగ్‌తో భారత పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాపై చెలరేగిపోయాడు. ఈ ఒక్క సిరీస్‌లోనే ఎన్నో ఘనతలను లిఖించుకున్న అతను అప్పుడే ‘ఆల్‌టైమ్ గ్రేట్’లలో ఒకడిగా మారాడంటే అతిశయోక్తి కాదు.
బుమ్రా బౌలింగ్‌లో బెదిరిపోయిన తీరు గురించి ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా స్వయంగా చెప్పుకున్నాడు. ఈ సిరీస్‌లో బుమ్రా బౌలింగ్‌లో 112 బంతులు ఎదుర్కొన్న ఖ్వాజా 33 పరుగులే చేసి 6 సార్లు అవుటయ్యాడంటే అతను ఎంతగా ఇబ్బంది పడ్డాడో అర్థమవుతుంది. బుమ్రా లేని సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా ఆడి అతను 45 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. అయితే ఖ్వాజా మాత్రమే కాదు... ప్రతీ ఆసీస్ బ్యాటర్ అతని బౌలింగ్ బారిన పడినవారే.
మెక్‌స్వీనీ, హెడ్ చెరో 4 సార్లు బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కాగా... టాప్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 3 సార్లు వెనుదిరిగాడు. అయితే క్లీన్ బౌల్డ్ లేదా ఎల్బీడబ్ల్యూ. లేదంటే కాస్త డ్రైవ్ కోసం ప్రయత్నిస్తే కీపర్‌కు లేదా స్లిప్‌లో క్యాచ్! ఒక్క బ్యాటర్ కూడా ఒక్కసారైనా నేరుగా షాట్ ఆడే సాహసమే చేయలేదు. ఫలితంగా కేవలం 13.06 సగటుతో ఏకంగా 32 వికెట్లు తీసి బుమ్రా సిరీస్‌ను ముగించాడు. అతని బౌలింగ్ లేకపోతే భారత్ 0–4తో లేదా 0–5తో కూడా ఓడేదేమో!
అసాధారణ ప్రదర్శన...
ఇన్నింగ్స్ మొదలు కాగానే చెలరేగిపోయి శుభారంభాలు అందించాల్సి వచ్చినా... నిలదొక్కుకుంటున్న మిడిలార్డర్‌ను పడగొట్టాలన్నా... కీలక భాగస్వామ్యాలను విడదీయాలన్నా బుమ్రా వల్లే సాధ్యమైంది. సిరీస్ ఆసాంతం ఇది సాగింది. ప్రతిష్టాత్మక సిరీస్‌లో ప్రత్యర్థి గడ్డపై తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైన తర్వాత ఏ జట్టయినా గెలుపు గురించి ఆలోచించగలదా! కానీ బుమ్రా దానిని సాధ్యం చేసి చూపించాడు. అతని దెబ్బకు ఐదు వికెట్లు సమర్పించుకున్న ఆసీస్ ఆ టెస్టులో మళ్లీ కోలుకోలేకపోయింది. తర్వాతి మూడు టెస్టుల్లోనూ అక్కడక్కడా భారత జట్టు మ్యాచ్‌పై ఆశలు పెంచుకోగలిగిందంటే బుమ్రానే కారణం.
సిరీస్‌లో 908 బంతులేసిన బుమ్రా ఒక్కడే 32 వికెట్లు తీయగా, మిగిలిన భారత బౌలర్లంతా కలిపి 2814 బంతుల్లో 48 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. అతని సగటు 13.06 కాగా, మిగిలిన బౌలర్ల సగటు 34.82 చూస్తేనే తేడా ఏమిటో అర్థమవుతుంది. 20కంటే తక్కువ సగటుతో 200 వికెట్లు మైలురాయిని దాటిన బుమ్రా... ఎందరో గొప్ప బౌలర్లకు సాధ్యంకాని ఈ అరుదైన ఘనతను అందుకొని దిగ్గజాల సరసన నిలవగలిగాడు. విదేశీ గడ్డపై ఒక సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కూడా అతను నిలిచాడు.
భరించలేనంత భారాన్ని మోసి...
ప్రధాన బ్యాటర్లపై నమ్మకం లేక లోయర్ ఆర్డర్‌లో అదనపు పరుగుల కోసం భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఎంచుకున్న బౌలింగ్ ఆల్‌రౌండర్ వ్యూహం బుమ్రాపై భారాన్ని అమితంగా పెంచేసింది. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ వరకు కూడా ఇతర పేసర్లు సిరాజ్, ఆకాశ్‌దీప్ ఆశించిన రీతిలో ప్రభావం చూపలేకపోయారు. బ్యాటింగ్ బలం కోసం మరో ప్రధాన పేస్ బౌలర్‌ను ఆడించలేని స్థితి. దాంతో బాధ్యత మొత్తం బుమ్రా భుజాలపైనే పడింది. చివరకు అది కీలక సమయంలో జట్టునే దెబ్బ కొట్టింది. బౌలింగ్ భారం ఎక్కువై అతను వెన్ను నొప్పితో తప్పుకోవాల్సి వచ్చింది. సిరీస్ మొత్తంలో పచ్చికతో పేస్‌కు అత్యంత అనుకూలంగా కనిపించిన సిడ్నీ పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయకపోవడమే భారత్ విజయావకాశాలను దెబ్బ తీసిందనేది వాస్తవం. సిరీస్‌లో బుమ్రా ఏకంగా 151.2 ఓవర్లు
బౌలింగ్ చేశాడు. భారత్ వేసిన ఓవర్లలో ఇది 24.4 శాతం కాగా... భారత్ పడగొట్టి మొత్తం వికెట్లతో 40 శాతం బుమ్రానే పడగొట్టడం విశేషం. ‘బుమ్రాలాంటి అరుదైన ఆటగాడిపై భారం వేయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అతను చాలా ఎక్కువగా బౌలింగ్ చేశాడు. కానీ అతను అద్భుత ఫామ్‌తో చెలరేగిపోతున్న సమయంలో దానిని సమర్థంగా వాడుకోవడం కూడా జట్టుకు అవసరం’ అంటూ రోహిత్ శర్మ అప్పటికే తమ ప్రధాన పేసర్ పరిస్థితి గురించి చెప్పేశాడు.
ఎంత కాలం ఆటకు దూరం?
బుమ్రా వెన్ను నొప్పి తీవ్రత ఎంత అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. భారత్‌కు వచి్చన తర్వాతే అతని పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియవచ్చు. గ్రేడ్–1 గాయం లేదా గ్రేడ్–2 అయినా సరే గరిష్టంగా 6 వారాల్లో కోలుకునే అవకాశం ఉంది. అయితే అంతకుమించి ఉంటే మాత్రం సమస్యే. కనీసం మూడు నెలల తర్వాత గానీ సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదు. తర్వాత టెస్టు మ్యాచ్ కోసం జూన్ వరకు సమయం ఉండగా... ఫిబ్రవరి–మార్చి సమయంలోనే భారత్ ముందు చాంపియన్స్ ట్రోఫీ రూపంలో ప్రతిష్టాత్మక టోర్నీ ఉంది. ఇతర సిరీస్‌లను పక్కన పెట్టినా ఈ మెగా టోర్నీలో అతను ఆడటం జట్టుకు ఎంతో అవసరం. అయితే దానికి ముందు సన్నాహకంగా భారత్‌లోనే ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ కూడా ఆడతాడా అనేది చర్చనీయాంశం.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment