కుప్పకూలి... కూల్చేసి... | India in position to take huge lead in first Test of Border Gavaskar Trophy | Sakshi
Sakshi News home page

కుప్పకూలి... కూల్చేసి...

Published Sat, Nov 23 2024 3:49 AM | Last Updated on Sat, Nov 23 2024 6:44 AM

India in position to take huge lead in first Test of Border Gavaskar Trophy

పెర్త్‌ టెస్టులో పుంజుకున్న భారత్‌

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 150 ఆలౌట్‌

ఆదుకున్న నితీశ్‌ రెడ్డి, రిషబ్‌ పంత్‌

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 67/7  

4 వికెట్లతో నిప్పులు చెరిగిన బుమ్రా

గత రెండు పర్యాయాలు ఆ్రస్టేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లు నెగ్గిన భారత జట్టు ‘హ్యాట్రిక్‌’ దిశగా తొలి అడుగు తడబడుతూ వేసింది. కంగారూ పేసర్లను ఎదుర్కోలేక భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇక కష్టమే అనిపించిన దశలో బౌలర్లు విజృంభించి టీమిండియాను తిరిగి పోటీలోకి తెచ్చారు. 

ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి అరంగేట్రం టెస్టులో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటే... బంతితో తాత్కాలిక కెప్టెన్ జస్‌ప్రీత్‌ బుమ్రా నిప్పులు చెరిగాడు. నాయకుడు ముందుండి నడిపిస్తే ఎలా ఉంటుందో బుమ్రా చాటి చెప్పగా... అతడికి సిరాజ్, హర్షిత్‌ రాణా చక్కటి సహకారం అందించారు. రెండో రోజు ఇదే జోరు కొనసాగి... బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడైతే ఈ మ్యాచ్‌పై భారత్‌కు పట్టు చిక్కుతుంది.   

పెర్త్‌: బ్యాటర్లు విఫలమైన చోట... బౌలర్లు సత్తా చాటడంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తొలి రోజు భారత జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. ఐదు మ్యాచ్‌ల ‘బోర్డర్‌–గావస్కర్‌ ట్రోఫీ’ సిరీస్‌లో భాగంగా పెర్త్‌ వేదికగా శుక్రవారం తొలి టెస్టు ప్రారంభమైంది. పేసర్లకు స్వర్గధామం లాంటి పిచ్‌పై ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో తొలి రోజే 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఆట ముగిసే సమయానికి భారత్‌ భారీ ఆధిక్యం సాధించే స్థితిలో నిలిచింది. 

ఆ్రస్టేలియా గడ్డపై గత ఏడు దశాబ్దాల్లో ఒక టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు 17 వికెట్లు పడటం ఇదే తొలిసారి. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి అరంగేట్రం టెస్టులో (59 బంతుల్లో 41; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌గా నిలవగా... రిషబ్‌ పంత్‌ (78 బంతుల్లో 37; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), కేఎల్‌ రాహుల్‌ (74 బంతుల్లో 26; 3 ఫోర్లు) రాణించారు. 

ఆసీస్‌ బౌలర్లలో హాజల్‌వుడ్‌ 4 వికెట్లు... స్టార్క్, కమిన్స్, మార్ష్ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆ్రస్టేలియా ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ కేరీ (28 బంతుల్లో 19 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), స్టార్క్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు, సిరాజ్‌ 2 వికెట్లు, హర్షిత్‌ రాణా ఒక వికెట్‌ తీశారు. 

చేతిలో 3 వికెట్లు ఉన్న ఆతిథ్య జట్టు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 83 పరుగులు వెనుకబడి ఉంది. రెండో రోజు తొలి సెషన్‌లో వీలైనంత త్వరగా ఆ్రస్టేలియాను ఆలౌట్‌ చేస్తే టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కుతుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడితే ఈ టెస్టు ఫలితాన్ని శాసించే అవకాశం లభిస్తుంది.  

బుల్లెట్‌లాంటి బంతులతో.. 
బ్యాటర్ల వైఫల్యంతో డీలా పడ్డ జట్టులో బుమ్రా తిరిగి జవసత్వాలు నింపాడు. ప్రతి బంతికి వికెట్‌ తీసేలా కనిపించి టీమిండియాకు శుభారంభం అందించాడు. మూడో ఓవర్‌లో మెక్‌స్వీనీ (10)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న బుమ్రా... ఏడో ఓవర్‌లో ఆసీస్‌కు డబుల్‌ స్ట్రోక్‌ ఇచ్చాడు. నాలుగో బంతికి ఉస్మాన్‌ ఖ్వాజా (8)ను అవుట్‌ చేసిన బుమ్రా... ఆ మరుసటి బంతికి ప్రమాదకర స్టీవ్‌ స్మిత్‌ (0)ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. 

కెప్టెన్ స్పూర్తితో చెలరేగిన యువ పేసర్‌ హర్షిత్‌ రాణా మంచి వేగంతో ఆకట్టుకోగా... హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ మెయిడెన్‌లతో విజృంభించాడు. ఈ క్రమంలో ట్రావిస్‌ హెడ్‌ (11)ను హర్షిత్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. పచ్చికతో కూడిన పిచ్‌పై టాస్‌ గెలిచిన బుమ్రా బ్యాటింగ్‌ నిర్ణయం తీసుకోవడం క్రీడాభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసినా... ఇన్నింగ్స్‌ సాగుతున్న కొద్దీ అది సరైందనే భావన బలపడింది. 

మార్ష్ (6) రూపంలో తొలి వికెట్‌ ఖాతాలో వేసుకున్న సిరాజ్‌... క్రీజులో పాతుకుపోయిన లబుషేన్‌ (52 బంతుల్లో 2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆసీస్‌ సారథి కమిన్స్‌ (3)ను బుమ్రా అవుట్‌ చేయడంతో ఆసీస్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. పేస్‌కు అనుకూలమైన పిచ్‌పై భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో ఎలా ఆడతారనే అంశంపైనే ఈ మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంది.  

నమ్మకాన్ని నిలబెట్టుకున్న నితీశ్‌ 
ప్లేయర్ల సహనానికి పరీక్ష పెట్టే పెర్త్‌ పిచ్‌పై మొదట మన బ్యాటర్లు ఆకట్టుకోలేకపోయారు. ఆసీస్‌ బౌలర్లు విజృంభిస్తుంటే... కుదురుకోవడానికి ప్రయత్నించకుండా బాధ్యతారహిత షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (0) మూడో ఓవర్‌లోనే అవుట్‌ కాగా... 23 బంతులు ఎదుర్కొన్న దేవదత్‌ పడిక్కల్‌ (0) ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

ఆదుకుంటాడనుకున్న కోహ్లి (5) ఎక్కువసేపు నిలవలేకపోగా... కాస్త పోరాడిన కేఎల్‌ రాహుల్‌ అంపైర్‌ సందేహాస్పద నిర్ణయానికి పెవిలియన్‌ చేరాడు. ధ్రువ్‌ జురేల్‌ (11), వాషింగ్టన్‌ సుందర్‌ (4) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఫలితంగా భారత జట్టు 73 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అప్పటికే క్రీజులో ఉన్న పంత్‌కు నితీశ్‌ జత కలవడంతో భారత జట్టు కోలుకోగలిగింది.

ఆసీస్‌ గడ్డపై మెరుగైన రికార్డు ఉన్న పంత్‌... కమిన్స్‌ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్‌తో ఆకట్టుకోగా... తొలి టెస్టు ఆడుతున్న నితీశ్‌ రెడ్డి ధాటిగా ఆడాడు. ఏడో వికెట్‌కు 48 పరుగులు జోడించిన అనంతరం పంత్‌ వెనుదిరిగాడు. పంత్‌ అవుటయ్యాక నితీశ్‌వేగంగా ఆడి జట్టు స్కోరును 150కి చేర్చి చివరి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) మెక్‌స్వీనీ (బి) స్టార్క్‌ 0; రాహుల్‌ (సి) కేరీ (బి) స్టార్క్‌ 26; పడిక్కల్‌ (సి) కేరీ (బి) హాజల్‌వుడ్‌ 0; కోహ్లి (సి) ఖ్వాజా (బి) హాజల్‌వుడ్‌ 5; పంత్‌ (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 37; జురేల్‌ (సి) లబుషేన్‌ (బి) మార్ష్ 11; సుందర్‌ (సి) కేరీ (బి) మార్ష్ 4; నితీశ్‌ రెడ్డి (సి) ఖ్వాజా (బి) కమిన్స్‌ 41; హర్షిత్‌ (సి) లబుషేన్‌ (బి) హాజల్‌వుడ్‌ 7; బుమ్రా (సి) కేరీ (బి) హాజల్‌వుడ్‌ 8; సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్‌) 150. 
వికెట్ల పతనం: 1–5, 2–14, 3–32, 4–47, 5–59, 6–73, 7–121, 8–128, 9–144, 10–150. బౌలింగ్‌: స్టార్క్‌ 11–3–14–2; హాజల్‌వుడ్‌ 13–5–29–4; కమిన్స్‌ 15.4–2–67–2; లయన్‌ 5–1–23–0; మార్ష్ 5–1–12–2. 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: ఖ్వాజా (సి) కోహ్లి (బి) బుమ్రా 8; మెక్‌స్వీనీ (ఎల్బీ) (బి) బుమ్రా 10; లబుషేన్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 2; స్మిత్‌ (ఎల్బీ) బుమ్రా 0; హెడ్‌ (బి) హర్షిత్‌ రాణా 11; మార్ష్ (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 6; కేరీ (బ్యాటింగ్‌) 19; కమిన్స్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 3; స్టార్క్‌ (బ్యాటింగ్‌) 6; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (27 ఓవర్లలో 7 వికెట్లకు) 67. వికెట్ల పతనం: 1–14, 2–19, 3–19, 4–31, 5–38, 6–47, 7–59. బౌలింగ్‌: బుమ్రా 10–3–17–4; సిరాజ్‌ 9–6–17–2; హర్షిత్‌ రాణా 8–1–33–1.  

హర్షిత్‌ రాణా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి అరంగేట్రం 
ఈ మ్యాచ్‌ ద్వారా ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి, పేస్‌ బౌలర్‌ హర్షిత్‌ రాణా అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశారు. మ్యాచ్‌ ఆరంభానికి ముందు నితీశ్‌కు మాజీ కెపె్టన్‌ విరాట్‌ కోహ్లీ టెస్టు క్యాప్‌ అందించగా... హర్షిత్‌కు సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశి్వన్‌ జాతీయ జట్టు క్యాప్‌ ఇచ్చి అభినందించారు. 

భారత్‌ తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడిన 315వ ఆటగాడిగా నితీశ్‌ కుమార్‌ రెడ్డి, 316వ ప్లేయర్‌గా హర్షిత్‌ నిలిచారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో స్వదేశంలో  జరిగిన టి20 సిరీస్‌లో నితీశ్‌ తొలిసారి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 

న్యూఢిల్లీలో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆ్రస్టేలియా ఓపెనర్‌ మెక్‌స్వీనీ కూడా పెర్త్‌ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement