నిలకడలేమితో సన్‌రైజర్స్ హైదరాబాద్
ఈసారి కొత్త కెప్టెన్, కొత్త హెడ్ కోచ్ ఆధ్వర్యంలో బరిలోకి
ఎనిమిది, ఎనిమిది, పది... గత మూడు ఐపీఎల్ సీజన్‌ల పాయింట్ల పట్టికలో వరుసగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్థానాలు ఇవి! 2023లోనైతే మరీ ఘోరంగా టీమ్ నాలుగే విజయాలు సాధించింది. 2020లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో మూడో స్థానంలో నిలిచిన తర్వాత జట్టు మళ్లీ కోలుకోలేదు. తర్వాతి ఏడాది విభేదాలతో వార్నర్‌ను ఎనిమిది మ్యాచ్‌లకే పరిమితం చేసిన టీమ్ మేనేజ్‌మెంట్ ఆ తర్వాత ఎన్ని ప్రయోగాలు చేసినా ఏవీ కలిసి రాలేదు. విదేశీ ఆటగాళ్లు అక్కడక్కడా మెరవడం మినహా భారత క్రికెటర్లు ఎవరూ జట్టును గెలిపించలేకపోతున్నారు.
అభిమానుల కోణంలో అయితే వారంతా అపరిచితుల్లా కనిపిస్తున్నారు. లీగ్‌లో ప్రతీ టీమ్ ఏదో ఒక దశలో విధ్వంసక ఆటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షిస్తుండగా సన్‌రైజర్స్ మాత్రం పాతకాలపు ఆటతోనే నడిపిస్తోంది. విదేశీ ఆటగాళ్లు కూడా తమపై ఉన్న అంచనాలు, ఒత్తిడిని అధిగమించి ఏ మేరకు రాణిస్తారనేది చెప్పలేం. ఈ నేపథ్యంలో మరో సీజన్‌కు జట్టు సిద్ధమైంది. వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ కెపె్టన్ కమిన్స్ సారథ్యంలో, కొత్త హెడ్ కోచ్ డానియల్ వెటోరి పర్యవేక్షణలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న సన్‌రైజర్స్ టోర్నీలో ఎంత దూరం వెళుతుందనేది ఆసక్తికరం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యానికే చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సౌతాఫ్రికా టి20 టోర్నీలో వరుసగా రెండేళ్లు టైటిల్స్ సాధించింది. ఈ రెండు సార్లూ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ జట్టును విజేతగా నిలిపాడు. అయినా సరే అతడిని కాదంటూ ఆస్ట్రేలియా స్టార్ ప్యాట్ కమిన్స్‌ను రైజర్స్ ఈసారి కొత్త కెప్టెన్‌గా నియమించింది.
వేలంలో కమిన్స్‌ను రైజర్స్ రూ. 20 కోట్ల 50 లక్షల భారీ ధరకు కొనుక్కుంది. గత ఏడాది కాలంలో నాయకుడిగా ఆసీస్‌కు అసాధారణ విజయాలు అందించిన కమిన్స్ అగ్రశ్రేణి టి20 లీగ్‌లో ఒక జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. అంతర్జాతీయ షెడ్యూల్ కారణంగా కమిన్స్ 2023లో ఐపీఎల్ ఆడలేదు.
2022లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 5 మ్యాచ్‌లే ఆడిన అతను ఏకంగా 10.68 ఎకానమీతో 7 వికెట్లే తీశాడు. అంతకుముందు సీజన్‌లోనూ 7 మ్యాచ్‌లలో 9 వికెట్లే తీసి భారీగా పరుగులిచ్చాడు. ఓవరాల్‌గా కమిన్స్‌కు టి20ల్లో అంత ఘనమైన రికార్డు ఏమీ లేదు.
జట్టులో సమర్థులైన విదేశీ ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా కూడా కెపె్టన్ హోదాలో కమిన్స్ అన్ని మ్యాచ్‌లు ఆడతాడు. ఇటీవల అతని బౌలింగ్ మెరుగైనా... తీవ్ర ఒత్తిడిలో జట్టుకు మంచి ఫలితాలు అందించడం కీలకం. సన్‌రైజర్స్ తమ తొలి మ్యాచ్‌ను ఈనెల 23న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడుతుంది.
విదేశీ బృందం ఇలా...
కమిన్స్‌ను మినహాయిస్తే మరో ముగ్గురు విదేశీయులకే తుది జట్టులో చాన్స్ ఉంది. ఇలాంటి స్థితిలో రైజర్స్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లలో ఎవరిని ఎంచుకుంటుందో చూడాలి. బ్యాటర్లలో వరల్డ్‌కప్ ‘ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రవిస్ హెడ్, గత ఏడాది టీమ్ టాప్ స్కోరర్ హెన్రిచ్ క్లాసెన్, దక్షిణాఫ్రికా టి20 కెప్టెన్ మార్క్‌రమ్, దూకుడుగా ఆడగల గ్లెన్ ఫిలిప్స్ అందుబాటులో ఉన్నారు.
తాజా ఫామ్, గుర్తింపును బట్టి చూస్తే హెడ్, క్లాసెన్‌లు ఖాయంగా కనిపిస్తున్నారు. అప్పుడు బౌలింగ్‌లో అగ్రశ్రేణి లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ లో మంచి రికార్డు ఉన్న హసరంగకు తుది జట్టులో చోటు ఖాయం. ఆల్‌రౌండర్‌గా మార్కో జాన్సెన్ కూడా సిద్ధంగా ఉన్నా అతడిని ఆడించడం కష్టంగా మారనుంది. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కారణంగా హసరంగ లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. అప్పుడు జాన్సెన్‌కు అవకాశం లభించవచ్చు.
మనోళ్లు సత్తా చాటుతారా...
బ్యాటింగ్ కోణంలో భారత ఆటగాళ్లంతా అంతంతమాత్రం ప్రదర్శనే కనబరుస్తున్నారు. ఏదో ఒక మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ మినహా నిలకడే లేదు. మయాంక్ అగర్వాల్, అభిõÙక్ శర్మ, రాహుల్ త్రిపాఠిలలో ఒక్కరు కూడా గత సీజన్‌లో కనీసం 300 పరుగులైనా చేయలేకపోయారు. సమద్, అన్‌మోల్‌ప్రీత్ ప్రభావం చూపలేకపోగా... ఉపేంద్ర, నితీశ్ కుమార్ రెడ్డి, సన్‌వీర్ ఏమాత్రం ఆడతారో చూడాలి.
రెండేళ్ల క్రితమే భారత జట్టుకు దూరమైన భువనేశ్వర్‌పైనే ఇంకా పేస్ బౌలింగ్ భారం ఉంది. ఉమ్రాన్ మాలిక్ తన వేగం మాత్రమే కాక ఇతరత్రా బౌలింగ్ మెరుగుపర్చుకొని ఉంటే ప్రభావం చూపించగలడు. నటరాజన్‌లో నాటి పదును తగ్గిపోగా, సీనియర్ జైదేవ్ ఉనాద్కట్ జట్టులో ఉండటం ఉపయోగపడవచ్చు. జట్టు స్పిన్ బలహీనంగా కనిపిస్తోంది. వాషింగ్టన్ సుందర్, షహబాజ్ అహ్మద్ ఫర్వాలేదనిపించే ఆటగాళ్లే. ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఒక్క సీజన్‌లోనూ వీరిద్దరు ఎనిమిదికి మించి వికెట్లు తీయలేదు. మయాంక్ మార్కండే లెగ్‌స్పిన్ కొంత వరకు ప్రభావం చూపించవచ్చు.
జట్టు వివరాలు
కమిన్స్ (కెప్టెన్), మార్క్‌రమ్, ఫిలిప్స్, క్లాసెన్, హెడ్, జాన్సెన్, హసరంగ, ఫజల్ హఖ్ (విదేశీ ఆటగాళ్లు). అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అన్‌మోల్‌ప్రీత్, ఉపేంద్ర యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్, వాషింగ్టన్ సుందర్, సనీ్వర్ సింగ్, జాతవేద్ సుబ్రహ్మణ్యం, ఆకాశ్ సింగ్, షహబాజ్ అహ్మద్, భువనేశ్వర్, ఉనాద్కట్, నటరాజన్, ఉమ్రాన్, మయాంక్ మర్కండే (భారత ఆటగాళ్లు).
సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment